‘కడుపు మాడ్చిన’ కరోనా..!

ABN , First Publish Date - 2020-03-26T07:06:19+05:30 IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న..

‘కడుపు మాడ్చిన’ కరోనా..!

అభాగ్యులు, యాచకుల ఆకలి కేకలు

అన్నం పెట్టేవారి కోసం ఎదురుచూపులు

లాక్‌డౌన్‌తో కాలు బయట పెట్టని జనం 

  

ఒంగోలు(ఆంధ్రజ్యోతి): ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా భయం కాలు బయట పెట్టనివ్వడం లేదు. లాక్‌డౌన్‌ ప్రభావంతో వీధుల్లో జన సంచారం కరువైపోయింది. దీంతో వీధులన్నీ నిర్మాన్యుంగా మారాయి. పోలీసులు, పత్రికా ప్రతినిధులు తప్ప రోడ్ల వెంట కనిపించేవారు లేరు. అయితే ప్రాణాంతక వ్యాధి ప్రబలకుండా తీసుకుంటున్న చర్యల వల్ల కొందరి అభాగ్యుల కడుపు మాడుతోంది. రోగం, రొప్పు సంగతి దేవుడెరు.. పట్టెడు అన్నం దొరకక ఆకలితో అలమటిస్తున్నావారి పరిస్థితి దయనీయంగా మారింది. నిన్న, మొన్నటి వరకు ఈనెల 31 వరకు మాత్రమే లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రభుత్వం తాజాగా వచ్చే నెల 14 వరకు పొడిగించడంతో అభాగ్యుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. 


దీంతో జిల్లా వ్యా ప్తంగా పలువురు అనాథలు, అభాగ్యులు, యాచక వృత్తిపై ఆధారపడి జీవించేవారు, వృత్తి పనుల కోసం వచ్చిన కార్మికులు గత నాలుగు రోజులుగా ఎంతో దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో గత నాలుగు రోజులుగా తిండి లేక అవస్థలు పడుతున్నారు. కరోనా కంటే ముందుగా కరువుతో చచ్చేట్టు ఉన్నామని పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు. కరోనా నియంత్రణ చర్యలు అభినందనీయం అయినప్పటికీ అదే సమయంలో అభాగ్యులు ఆకలి కేకలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రజ్యోతి పరిశీలనలో పలువురు అభాగ్యులు, యాచక వృత్తిలో ఉన్న వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు సైతం ఆహారం కోసం ఆశతో ఎదురుచూడం హృదయ విదారకం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం అనాధలను, అభాగ్యులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.


ఇంటికెళ్లే దారేదీ..!

వృత్తి పనుల కోసం విచ్చేసిన పలువురు వలస కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఒంగోలు నగరంలోని ప్రకాశం భవనం ఎదురు గల ఓ హోటల్‌లో పనిచేస్తున్న కొందరు యువకులు గత నాలుగు రోజులుగా నానా అవస్థలు పడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఇంటికెళ్ళలేని పరిస్థితి. ఒకవైపు తాము పనిచేస్తున్న హోటల్‌ను సైతం మూసివేయడంతో చేతిలో డబ్బులు ఉన్నా, తిండి దొరక్క దయనీయంగా జీవిస్తున్నారు. ఫుట్‌పాత్‌లపైనే నిద్రిస్తూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు.


తమది విజయనగరం జిల్లా పెద్దమేడపల్లి గ్రామం అని, అందరు ఒకే ఊరికి చెందిన వారు కావడంతో నడిచి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లు వాపోయారు. నాలుగు రోజులకే దయనీయంగా మారిన తమ బతుకు, మరో మూడు వారాలంటే పరిస్థితి ఏమిటి అని ఆవేదన చెందుతున్నారు. తమ సొంత ఊరు వెళ్ళేందుకు అధికారులు అవకాశం కల్పించాలని వారు వాపోతున్నారు. బుధవారం ఆంధ్రజ్యోతి వారిని కలిసి మాట్లాడే క్రమంలో తిండి లేక హోటల్‌లోని సద్దిపడిన అన్నంలో నీళ్ళు పోసుకుని నలుగురు కలిసి తినడం కన్పించింది.


వారితోపాటు చీమకుర్తి గ్రానైట్‌లో పనిచేసే పలువురు వలస కార్మికులు, అదేవిధంగా వివిధ చేతి వృత్తి పనుల కోసం ఒంగోలు చేరుకుని ఇంటికెళ్ళే మార్గం లేక ఇక్కడే వీధుల్లో, ఆర్టీసీ, రైల్వే స్టేషన్‌లో రోజులు లెక్కపెట్టుకుంటున్న వారు వందల్లోనే ఉన్నారు. తమను పట్టించుకోవాలని బాధితులు కోరు తున్నారు. 



Updated Date - 2020-03-26T07:06:19+05:30 IST