నోరు మంచిదైతే ఆరోగ్యమూ మంచిదే!

ABN , First Publish Date - 2021-02-09T07:48:48+05:30 IST

సంపూర్ణ ఆరోగ్యం నోటి శుభ్రత నుంచే మొదలవుతుంది. నోట్లో తలెత్తే స్వల్ప మార్పుల మీద ఓ కన్నేసి ఉంచుతూ, అప్రమత్తంగా వ్యవహిరిస్తూ ఉండాలి.

నోరు మంచిదైతే  ఆరోగ్యమూ మంచిదే!

సంపూర్ణ ఆరోగ్యం నోటి శుభ్రత నుంచే మొదలవుతుంది. నోట్లో తలెత్తే స్వల్ప మార్పుల మీద ఓ కన్నేసి ఉంచుతూ, అప్రమత్తంగా వ్యవహిరిస్తూ ఉండాలి. ‘లేదంటే గోటితో పోయే సమస్యకు గొడ్డలితో పని పడే సందర్భాలు ఎదురుకావచ్చు’ అంటున్నారు దంతవైద్యులు!


నోటిలో దాదాపు 300 నుంచి 700 రకాల బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ నివసిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎకో సిస్టంలో ఉంటాయి. ఈ సిస్టం సమతులంగా ఉన్నంతకాలం నోటి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఇందుకోసం పరిశుభ్రంగా దంతధావనం చేసుకోవడం, నోట్లో ఆహార పదార్థాలు ఇరుక్కోకుండా చూసుకోవడం లాంటివి చేయాలి. అయితే ఈ జాగ్రత్తల్లో పొరపాటు జరిగితే, ఎకో సిస్టంలో అసమతౌల్యం ఏర్పడి ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి. నోట్లో పుండ్లు ఏర్పడడం మొదలవుతుంది. కాబట్టి నోటి శుభ్రత పాటించడం అత్యవసరం. అంతేకాకుండా సక్రమమైన పద్ధతిలోనే దంతధావనం చేయడం, సరైన బ్రష్‌ ఎంచుకోవడం, ఎగుడుదిగుడు పళ్లు లేకుండా జాగ్రత్తపడడం, దురలవాట్లకు దూరం ఉండడం చేయాలి. అలాగే క్రమం తప్పకుండా ప్రతిరోజూ దంతాలు, చిగుళ్లను పరీక్షించుకోవాలి. ప్రతి ఆరు నెలలకోసారి దంతవైద్యులను కలుస్తూ ఉండాలి.


పిల్లల్లో దంత సమస్యలు!

చనుబాలు లేదా పాల బాటిల్‌తో పాలు తాగే పసికందులు రాత్రంతా నోట్లో చనుమొన లేదా కృత్రిమ నిపుల్‌ ఉండిపోవడం వల్ల లాక్టోబాసిల్లస్‌ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఈ అలవాటు మూలంగా పాల పళ్లు పెరిగే క్రమంలోనే  పసుపుపచ్చగా మారి, తేలికగా విరిగిపోవడం మొదలవుతుంది. ఇలా పాల దంతాలు ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా నియంత్రించకపోతే వాటి స్థానంలో శాశ్వత దంతాలు ఎగుడుదిగుడుగా పెరిగే ప్రమాదం ఉంటుంది. మూడు నుంచి నాలుగేళ్ల వయసులో ఆహారపుటలవాట్లు, సరిగా దంతాలు శుభ్రపరుచుకోకపోవడం కారణంగా పిప్పి పళ్ల సమస్య మొదలవుతుంది. ఈ వయసులో కొన్ని పాల పళ్లు, కొన్ని శాశ్వత దంతాలు ఉండడం మూలంగా దంతాల మధ్య ఖాళీలు, పెరిగే కొత్త దంతాల ఆకారాల్లో అవకతవకలు ఏర్పడతాయి. 


జాగ్రత్తలు: పదేళ్ల లోపు వయసు పిల్లలకు తల్లిదండ్రులే దంతధావనంలో సహకరించాలి. ప్రారంభంలో వేలికి తొడుక్కునే టూత్‌ బ్రష్‌ ఉపయోగించి, పిల్లల చిగుళ్లు, పాల దంతాలు ప్రతి రోజూ సున్నితంగా శుభ్రం చేస్తూ ఉండాలి. తమంతట తాము బ్రష్‌ చేసుకోగలిగే పిల్లలకు సరైన బ్రషింగ్‌ విధానం నేర్పించాలి. 


కేన్సర్‌గా మారవచ్చు! 

నోట్లో తలెత్తే సాధారణ సమస్య ఎరుపు, తెలుపు పుండ్లు. వీటిలో ఎరుపు రంగు పుండ్లు ఇన్‌ఫ్లమేటరీ, ఇన్‌ఫెక్షన్‌ కారకాలు. నొప్పితో కూడిన వీటిని యాంటీ బయాటిక్స్‌తో తగ్గించుకోవచ్చు. అయితే ఎరుపు రంగు కలిగి ఉండి, నొప్పి లేకుండా ఉంటే కేన్సర్‌ పుండ్లుగా మారే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి ప్రీ మాలిగ్నెంట్‌ లీజన్స్‌ను బయాప్సీ ద్వారా నిర్థారించి, వీలైనంత త్వరగా చికిత్స మొదలుపెట్టడం అవసరం. కాబట్టి నోట్లో తలెత్తే ఏ రకమైనా పుండునూ నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని రకాల తెల్లని పుండ్లు ధూమపానం, పొగాకు నమలడం, గుట్కాల వల్ల తలెత్తుతాయి. నాలుక, చిగుళ్ల మీద, బుగ్గల లోపల ఈ రకమైన పుండ్లు ఏర్పడతాయి. అయితే ఎలాంటి పుండ్లు ఏర్పడినా ఆలస్యం చేయకుండా దంతవైద్యులను కలిసి పరీక్ష చేయించుకోవడం అవసరం. 




దంతాలకు గుండెకు లంకె!

పెరిడాంటైటిస్‌ బ్యాక్టీరియా గుండె కవాటాల్లో ఉండే బ్యాక్టీరియా ఒకేలా ఉంటాయి. కాబట్టి పెరిడాంటైటిస్‌ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, బ్యాక్టీరియా గుండెకు చేరి గుండె సమస్యలకు కారణమయ్యే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. కాబట్టి దంతాలకు సంబంధించిన ఏ చిన్న సమస్యనూ నిర్లక్ష్యం చేయకూడదు. 


13 - 20 ఏళ్ల వారిలో....

ఈ వయసులోనే జ్ఞానదంతాలు రావడం కూడా కనిపిస్తుంది.  విపరీతమైన దవడ నొప్పి, తలనొప్పి, చెవి నొప్పి మొదలవుతాయి. పిల్లలు ఇలాంటి నొప్పుల గురించి చెప్పినప్పుడు దంత సమస్యగానే భావించి దంతవైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి. ఈ వయస్కుల్లో పిప్పి పళ్లూ సహజమే! కొందరికి ఫిల్లింగ్స్‌తో సమస్యను సరిదిద్దవచ్చు. ఇన్‌ఫెక్షన్‌ నరం వరకూ చేరుకుంటే రూట్‌ కెనాల్‌ చికిత్స అవసరం పడుతుంది. ఆహారపుటలవాట్లు, రాత్రివేళ నిద్రలో దంతాలు కొరకడం లాంటి అలవాట్లే ఇలాంటి ఇన్‌ఫెక్షన్లకు, సమస్యలకు కారణం. 


జాగ్రత్తలు: ఈ వయస్కుల్లో బయల్పడే పిప్పి పళ్లను నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే ఎగుడుదిగుడు దంతాలను కనిపెట్టి దంతవైద్యుల సహకారంతో వాటిని సరిచేసే చికిత్సలను ఆశ్రయించాలి. నిద్రలో దంతాలు కొరికే అలవాటు మానసిక ఒత్తిడితో మొదలవుతుంది. చదువు, కెరీర్‌కు సంబంధించిన ఒత్తిడిలు ఉంటే, వాటిని తగ్గించుకోగలిగే సూచలను అందించాలి. పళ్లు కొరుకుడుతో దంతాలు దెబ్బతినకుండా నైట్‌ గార్డ్స్‌ వంటి పరికరాలు ఉపయోగించవలసి ఉంటుంది.


మహిళల్లో దంత సమస్యలు!

కౌమార దశలో, గర్భిణిగా ఉన్న సమయంలో మహిళల్లో ప్రధానంగా చిగుళ్లకు సంబంధించిన జింజివైటిస్‌ సమస్య తలెత్తుతూ ఉంటుంది. ఈ సమస్యకు కారణం ఆయా సమయాల్లో వారి శరీరంలో చోటుచేసుకునే హార్మోన్లలో హెచ్చుతగ్గులే! అయితే కారణం హార్మోన్ల హెచ్చుతగ్గులే అయినా, దీనికి నోటి శుభ్రత లోపం తోడైతే ఈ సమస్య మరింత తీవ్రమై పెరిడాంటైటిస్‌కు దారితీస్తుంది. కాబట్టి వైద్యులను కలిసి స్కేలింగ్‌ చికిత్స తీసుకుని, నోటి శుభ్రత కూడా కొనసాగించాలి.


చిగుళ్ల నుంచి దవడకు.. 

దీర్ఘకాలం పాటు నోటి శుభ్రతను నిర్లక్ష్యం చేస్తే జింజివైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అది దవడ ఎముకకు పాకి పెరిడాంటైటిస్‌గా పరిణమించే ప్రమాదం ఉంటుంది. 25 నుంచి అంతకంటే ఎక్కువ వయసులో ఈ సమస్య సర్వసాధారణం. అంతకంటే తక్కువ వయసులో కూడా ఈ సమస్య అరుదుగా కొందరిలో కనిపించవచ్చు. సరైన కాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే బోన్‌ లాస్‌ (ఎముక కరిగిపోతుంది) మొదలవుతుంది. కాబట్టి నోటి శుభ్రత పాటించడంతో పాటు, దంతాలు ఊడిపోయినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆ ఖాళీని కట్టుడు పళ్లతో భర్తీ చేసుకోవాలి. దంతాలు ఊడిపోయినప్పుడు ఆ ఖాళీని అలాగే వదిలేస్తే, పక్కన ఉన్న దంతాలు వదులై, ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి. ఇదే పరిస్థితి పునరావృతమై దంతాలు ఒక్కొక్కటిగా ఊడిపోతాయి.


డాక్టర్‌ శరత్‌ బాబు చింతపట్ల

ఛీఫ్‌ కన్సల్టెంట్‌ డెంటిస్ట్‌,

మెడికవర్‌ హాస్పిటల్‌,

హైదరాబాద్‌.

Read more