గవర్నర్ పదవి ఇవ్వడానికి కారణమిదేనని భావిస్తున్నా..: కంభంపాటి హరిబాబు

ABN , First Publish Date - 2021-07-07T06:28:47+05:30 IST

గవర్నర్‌గా నియమించారని..

గవర్నర్ పదవి ఇవ్వడానికి కారణమిదేనని భావిస్తున్నా..: కంభంపాటి హరిబాబు

చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తా

ఎంపీగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా 

విశాఖకు రైల్వేజోన్‌ తెచ్చాం

‘ఆంధ్రజ్యోతి’తో మిజోరం నూతన గవర్నర్‌గా నియమితులైన కంభంపాటి హరిబాబు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): 

‘‘ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసే అవకాశం రావడం అదృష్టమే. అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తాననే నమ్మకంతోనే ఈ పదవి ఇచ్చారని భావిస్తున్నా. నా శక్తిమేరకు న్యాయం చేస్తా.’’

- మిజోరం నూతన గవర్నర్‌గా నియమితులైన డాక్టర్‌ కంభంపాటి హరిబాబు


గవర్నర్‌గా నియమించారని తెలిసిన తరువాత దసపల్లా హిల్స్‌లోని ఆయన నివాసం మంగళవారం మధ్యాహ్నం అభిమానులతో నిండిపోయింది. నగరంలోని ప్రముఖులు, పార్టీ నాయకులు, అభిమానులు అంతా వచ్చి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.


ఎంపీగా నిధులను సార్థకం చేశా..

విశాఖపట్నం ఎంపీగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చా. ఏ అంశంలోను ఫెయిల్‌ కాలేదు. ఎంపీ లాడ్స్‌ కింద వచ్చిన నిధులను సద్వినియోగం చేశా. ముఖ్యంగా స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చాం. పబ్లిక్‌ రంగ సంస్థల నుంచి కూడా రూ.మూడు కోట్లు వరకు సమీకరించి ఖర్చు చేశాము. అప్పటికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు కూర్చోవడానికి బెంచీలు లేవు. నేలపైనే కూర్చొనేవారు. విశాఖ పార్లమెంటు పరిధిలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బెంచీలు ఇచ్చాము. అలాగే ప్రభుత్వ ఆస్పత్రులోని గైనిక్‌ వార్డుల్లో ఎక్కడా వేడి నీటి వసతి లేదు. అది చాలా అవసరం. దానికోసం అన్ని ఆస్పత్రుల్లోను ఇబ్బందులు లేకుండా సోలార్‌ గీజర్లు ఏర్పాటు చేయించాము. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు ఇచ్చాము.


రైల్వే జోన్‌ సాధించాం

ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు విశాఖకు రైల్వేజోన్‌ తెస్తామని ప్రకటించాము. కానీ అదంతా సులువుగా రాలేదు. అయితే ఎంపీగా ఉన్నప్పుడే జోన్‌ వస్తుందని చెప్పా. ఆ మేరకు నా హయాంలోనే జోన్‌ ప్రకటించారు. తాజాగా కొత్తవలసలో ప్రారంభించిన అండర్‌ పాస్‌వే కూడా నేను ప్రతిపాదించినదే.


విమానాశ్రయం విస్తరించాం

విశాఖ విమానాశ్రయం టెర్మినల్‌ భవనాన్ని విస్తరించాము. కొత్తగా ఆరు పార్కింగ్‌ బేస్‌ నిర్మించాము. కొత్తగా అంతర్జాతీయ విమానాలు తెప్పించాము. 

- షీలానగర్‌లో 500 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి మంజూరు చేయించాము.

- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీజీహెచ్‌ఎస్‌ ఆస్పత్రి తీసుకువచ్చాము.


పదేళ్లు ఉద్యోగానికి సెలవు పెట్టా

ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసినప్పుడు క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటున్నందున మొదట ఐదేళ్లు లాస్‌ ఆఫ్‌ పే కింద సెలవు పెట్టా. ఆ తరువాత విశాఖ-1 నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో యూనివర్సిటీ మరో ఐదేళ్లు సెలవు ఇచ్చింది. అలా పదేళ్లు దూరంగా ఉన్నా. ఇక బాగుండదని, పూర్తిగా రాజకీయాల్లో వుండాలని స్వచ్ఛంద పదవీ విరమణ చేశాను. ఏ బాధ్యత అప్పగించినా వంద శాతం దానిపై దృష్టి పెట్టి నిబంధనల మేరకు చేయడం అలవాటు. ఆ పనితీరును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా మెచ్చుకుంటారు. అందరి ఆశీస్సుల వల్లే ఈ రోజు గవర్నర్‌గా అవకాశం వచ్చింది. ఎక్కడున్నా విశాఖ అభివృద్ధికి నా వంతు ప్రయత్నం చేస్తా.

Updated Date - 2021-07-07T06:28:47+05:30 IST