పెరియార్‌ వర్సిటీ ప్రశ్నాపత్రంలో కుల ప్రస్తావన

ABN , First Publish Date - 2022-07-16T14:40:35+05:30 IST

సేలం పెరియార్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన చరిత్రకు సంబంధించిన ప్రశ్నపత్రంలో కులానికి సంబంధించిన ప్రశ్న రావడంపై రాజకీయ నాయకులు

పెరియార్‌ వర్సిటీ ప్రశ్నాపత్రంలో కుల ప్రస్తావన

                                          - నేతల ఆగ్రహం


చెన్నై, జూలై 15 (ఆంధ్రజ్యోతి): సేలం పెరియార్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన చరిత్రకు సంబంధించిన ప్రశ్నాపత్రంలో కులానికి సంబంధించిన ప్రశ్న రావడంపై రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సేలం కరుప్పూరులో ఉన్న పెరియార్‌ విశ్వవిద్యాలయంలో సేలం, నామక్కల్‌, ధర్మపురం, కృష్ణగిరి జిల్లాలు సహా పలు జిల్లాల విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆ విశ్వవిద్యాలయంలో పోస్టుగ్రాడ్యుయేట్‌ చరిత్ర పాఠ్యాంశానికి సంబంధించిన ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నపత్రంలో రాష్ట్రంలో అట్టడుగు వర్గాలకు చెందిన కులం ఏమిటి? అనే ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు మహర్‌, నాడార్‌, ఈళ్వర్‌, హరిజన అనే నాలుగు సమాధానాలు కూడా పొందుపరిచారు. ఆ నాలుగింటిలో సరైన సమాధానాన్ని విద్యార్థులు ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నాపత్రం గురువారం సాయంత్రం సామాజిక ప్రసార మాధ్యమాల్లో వెలువడి తీవ్ర కలకలం సృష్టించింది. పీఎంకే నేత రాందాస్‌ సహా పలువురు రాజకీయ నేతల ప్రశ్నాపత్రంలో కులం ప్రస్తావన ఎందుకంటూ విరుచుకుపడ్డారు. కులమతాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించిన ద్రావిడ ఉద్యమనేత పెరియార్‌ పేరుతో ఉన్న ఆ విశ్వవిద్యాలయంలో కులానికి సంబంధించిన ప్రశ్న వేయడం భావ్యమేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ జగన్నాధన్‌ మాట్లాడుతూ ఆ ప్రశ్నాపత్రం తమ విశ్వవిద్యాలయం రూపొందించలేదని, ఇతర విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల కమిటీ తయారు చేసిందని, దీనిపై విచారణ జరిపి  కారకులైనవారిపై చర్యలు చేపడతామన్నారు.

Updated Date - 2022-07-16T14:40:35+05:30 IST