Abn logo
May 13 2021 @ 10:48AM

వివాహాలకు, అంత్యక్రియలకు ముందస్తు అనుమతి ఎక్కడ?

  • అయోమయంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది..


హైదరాబాద్/చాదర్‌ఘాట్‌ : అమలులోకి వచ్చిన లాక్‌డౌన్‌లో వివాహాలకు 40 మంది, అంత్యక్రియలకు 20 మంది హాజరుకావొచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ముందస్తు అనుమతి తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలపై పోలీసులు, రెవెన్యూ సిబ్బందిలో కన్ఫ్యూజన్‌ మొదలైంది. వీటికి ముందస్తు అనుమతి ఎవరు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ముందుగా స్థానిక పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలా, లేక మండల రెవెన్యూ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవాలా లేక ఈ రెండు కార్యాలయాల నుంచి అనుమతి తీసుకోవాలా అనే విషయాలపై ప్రభుత్వపరంగా వివరాలు కొరవడ్డాయి.


వివాహాలు, అంత్యక్రియలు నిర్వహించేవారు ముందస్తు అనుమతి కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలియక ముందుగా పోలీస్‌స్టేషన్‌కు, మండల రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తున్నా సరైన మార్గదర్శకాలు లేని కారణంగా ప్రస్తుతానికి దరఖాస్తు తీసుకుని ఎక్నాలెడ్జ్‌మెంట్‌ ఇస్తున్నారు. అయినా వీటి తనిఖీలకు ఎవరు వస్తారు, ఎవరి నుంచి అనుమతి పొందాలనే వివరాలపై నిర్వాహకుల్లో అయోమయం తొలగించడానికి సరైన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతున్నారు.

Advertisement