మూర్తిమత్వం

ABN , First Publish Date - 2020-08-12T07:38:42+05:30 IST

ఒక్కొక్కరి ఆదర్శం ఒక్కొక్కరకంగా ఉంటుంది. ఆకులందున అణగిమణిగి ఉంటూ ఆచరించే ఆదర్శం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. తాము చేసేది ఆదర్శమని కూడా తెలియనంత...

మూర్తిమత్వం

నివాళి : జిఎల్ఎన్ మూర్తి 


1990ల నాటికి, తెలుగురాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాల సంఖ్య విపరీతంగా పెరిగింది. సాంస్కృతిక రంగం కోవలోకి వచ్చే అంశాలు కూడా పెరిగాయి. కానీ, పత్రికలలో వాటికి ఇచ్చే స్థలం తగ్గింది. అటువంటి కాలంలో, ఆయా రంగాల మనుగడకు సాంస్కృతిక రంగ విలేఖనం కీలకమయింది. అదే సమయంలో, అటువంటి విశిష్ట అంశంపై రాయగలిగినవారు కూడా అరుదైపోయారు. జిఎల్ఎన్ మూర్తి ప్రాసంగికత, ప్రాముఖ్యం ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. 


ఒక్కొక్కరి ఆదర్శం ఒక్కొక్కరకంగా ఉంటుంది. ఆకులందున అణగిమణిగి ఉంటూ ఆచరించే ఆదర్శం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. తాము చేసేది ఆదర్శమని కూడా తెలియనంత మంచితనం గురించి మాట్లాడుతున్నాను. వారి వ్యక్తిత్వం అంతా సహజాతంలాగా అనిపిస్తుంది. సందడి సందడిగా ఉంటారు కానీ ఆర్భాటం ఉండదు. తలలో నాలుకగా ఉంటారు కానీ, సొంతపల్లకీలు ఉండవు. మాటసాయమో చేతసాయమో చేయడానికి ముందు లెక్కలు ఉండవు, మీనం మేషం ఉండవు. లాభం నష్టం ఉండవు. అటువంటి కోవలోని ఒక అరుదైన మనిషి జిఎల్ఎన్ మూర్తి.


నాకు తెలిసి, జిఎల్ఎన్ మూర్తి మూడు నాలుగు దశాబ్దాల నుంచి జనం మధ్యలో ఉన్నారు. ఆయన ప్రజాజీవితం చాలా కిక్కిరిసి ఉంటుంది. తన చుట్టూ ఉండే ఆవరణాన్ని ఎప్పుడూ మనుషులతో నింపుకోవడం, లేదా అందుబాటులో ఉన్న సమ్మర్దమైన ఆవరణంలోకి వెళ్లడం- ఆయనకు ఆలవాటు. అందుకే, ఆయన తనకు ఆర్థికంగా సంతృప్తిపడదగిన ఉద్యోగం ఉండి కూడా చిరు సద్యోగం వెదుక్కున్నాడు. పేరుకు పార్ట్ టైమ్ విలేఖరి కానీ, ఆయన ఎంచుకున్న సాంస్కృతిక పాత్రికేయంలో హోల్ టైమర్. గడియారాన్ని పీల్చిపిప్పి చేసి, కాలాన్ని ఎంతగా పిండుకునేవాడో కానీ, ఒక వృత్తీ, ప్రవృత్తీ కాక, ఇంకా ఎంతో జీవితాన్ని మిగుల్చుకున్నాడు. అందులోనూ పౌరహక్కుల ఉద్యమం ప్రజాజీవితం అయితే, తన ఆంతరంగిక కైవారంలో సమకూర్చుకున్న స్నేహబృందం వ్యక్తిగతం.


మొన్న ఆదివారం నాడు రాత్రి 6 గంటలకు మూర్తిగారి స్మరణలో ఆయన మిత్రులు ఒక జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. నాటకరంగం అంతా ఆ స్థలాతీత సమావేశంలో కొలువు తీరినట్టు అనిపించింది. గుమ్మడి గోపాల కృష్ణ దగ్గరి నుంచి రాజీవ్ వెలిచేటి దాకా. సకల మార్గాల వారికీ ఆయనతో తమ తమ కార్యరంగాలకు సంబంధించిన అనుభవాలున్నాయి. వ్యక్తిగతమైన జ్ఞాపకాలూ ఉన్నాయి. తెలుగు పత్రికలలో సాంస్కృతిక వ్యవహరాలను పత్రికలలో రాసినంత మాత్రాన ఏర్పడే అభిమానాలు కావవి. కళాసాంస్కృతిక ప్రదర్శనలకు తగినంత స్థలాన్ని పత్రికలనుంచి రాబట్టుకోవడానికి, కాసింత ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికీ తగినంత కీర్తి, ప్రోత్సాహమూ అందించడానికి ఆయన ప్రయత్నించేవారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పద్య, పరిషత్, ప్రయోగ నాటకాల బృందాలన్నిటికీ మూర్తి కావలసినవారే. ఆయనకు నాటకం అన్నది ఒక బీట్ కాదు. గుండె చప్పుడు. 


సాహిత్యసభలు, సన్మానాలు, నృత్యప్రదర్శనలు, నాటకప్రదర్శనలు వీటి సమాచారాన్ని, కార్యక్రమవిశేషాలను రిపోర్టు చేయడమే కాకుండా, సమీక్షించడం ‘కల్చరల్ మూర్తి’ పాతికేళ్ల కిందటే మొదలుపెట్టారు. తెలుగు పత్రికలలో గతంలో కూడా కళారంగ సమీక్షకులు, విమర్శకులు ఉండేవారు. వారిలో కొందరు సుప్రసిద్ధులు కూడా. కానీ, 1990ల నాటికి, తెలుగురాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాల సంఖ్య విపరీతంగా పెరిగింది. సాంస్కృతిక రంగం కోవలోకి వచ్చే అంశాలు కూడా పెరిగాయి. కానీ, పత్రికలలో వాటికి ఇచ్చే స్థలం తగ్గింది. అటువంటి కాలంలో, ఆయా రంగాల మనుగడకు సాంస్కృతిక రంగ విలేఖనం కీలకమయింది. అదే సమయంలో, అటువంటి విశిష్ట అంశంపై రాయగలిగినవారు కూడా అరుదైపోయారు. జిఎల్ఎన్ మూర్తి ప్రాసంగికత, ప్రాముఖ్యం ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. రాజకీయాలను రిపోర్టు చేసే విలేఖరులలో రాజకీయవ్యవస్థపై సమగ్ర అవగాహన ఎందరికి ఉంటుందో చెప్పలేము. మూర్తికి మాత్రం కళా సాంస్కృతిక రంగాల ప్రస్తుత స్థితి గురించి, వాటిని సరిదిద్దడానికి చేయవలసిన పనుల గురించి పూర్తి అవగాహన ఉండేది. ఒకనాడు కేవలం సాంస్కృతిక వ్యవహారాల విలేఖరిగానే ఉన్న మూర్తిని ‘ఆంధ్రజ్యోతి’ యావత్ తెలుగు ప్రాంతాలన్నిటి సాంస్కృతిక పరిణామాలపై మార్గదర్శనం చేసేందుకుగాను సమన్వయకర్తగా స్వీకరించింది. తెలుగు రాష్ట్రాలకు ఉండవలసిన సాంస్కతిక విధానాల గురించి ఆయనకు ప్రత్యేకమైన ఆలోచనలున్నాయి. అట్లాగే, నాటకం, ఇతర కళారంగాల సమస్యల గురించిన పూర్తి అవగాహన ఉన్నది. పత్రికలలో వీటికి ఇవ్వవలసిన ప్రాధాన్యం గురించిన పట్టుదల కూడా ఉన్నది. నాటకప్రదర్శనలను పత్రికలు పూర్తిగా విస్మరించడం మీద ఆయనకు తీవ్రమైన అభ్యంతరం ఉన్నది. పత్రికలలో సాంస్కృతిక అంశాలకు తగిన ప్రాధాన్యం ఇస్తే, అది ప్రజాదరణను పెంపొందిస్తుందన్నది ఆయన వాదన. 


ఒకే అంశం గురించిన స్థూల, సూక్ష్మ అవగాహనలు కలిగి ఉండడం అరుదు. సాంస్కృతిక రంగాన్ని మొత్తంగా చూస్తూ, ప్రభుత్వ ప్రమేయం ప్రోత్సాహం అవసరమైన భాగం, ప్రజాదరణపై మనుగడ సాగించగలిగే భాగం, ఉద్యమాలకు అనుబంధంగా ఉండే సాంస్కృతిక రంగం- అన్న విభజనను అర్థం చేసుకుని, విడివిడిగా చూడగలిగినవారు మూర్తి. అట్లాగే, వర్ధమాన రంగస్థల నటుల దగ్గర నుంచి, సుప్రసిద్ధ నటరత్నాల దాకా, రచయితలు, ప్రయోక్తలు, నేపథ్య కార్మికులు- అందరూ ఆయనకు వ్యక్తిగతంగా పరిచయస్తులే. మూర్తి- పాతికేళ్ల కిందట పనిచేసిన పత్రికలో వారం వారం రాసిన కళాసమీక్షల దగ్గర నుంచి, ఇటీవలి కథనాల దాకా- సంకలనం చేయగలిగితే, తెలుగు ప్రాంతాల సాంస్కృతిక చరిత్రను సాధ్యమైనంతగా నమోదు చేయవచ్చు. కళారంగాలకు చెందిన ప్రముఖులతో ఆయనకు ఉన్న వ్యక్తిగత పరిచయాలను కథనం చేస్తే, అది సాంస్కృతిక చరిత్రకు మరో దోహదం కాగలదు. ఆయన పనిచేసిన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదువుకున్న విద్యార్థులు తమ ఉద్యమాలకు మూర్తి అందించిన సహకారాన్ని నెమరువేసుకుంటున్నారు, నక్సలైట్లతో చర్చల సమయంలో మూర్తి హక్కుల కార్యకర్తగా పడిన శ్రమ, ఆ ప్రక్రియలో భాగమైన వారు గుర్తుచేసుకుంటున్నారు. ఈ జ్ఞాపకాలన్నీ, నమోదు కావలసిన చరిత్రలే. 


రాజకీయ, సాంస్కృతిక కార్యకర్తగా ఉన్న మూర్తి, ఆ పనులన్నిటినీ ఇష్టంగా చేయడం వల్ల ఆయనకు ఆయా రంగాల వారందరూ మిత్రులయ్యారు. పరిచయం ఏకారణం చేత ఏర్పడినా, ఒకసారి దగ్గరైతే ఆయనకు ఆప్తులే. వారి కష్టాలేమిటో తెలుసుకుని, వాటికి విరుగుడు ఆలోచించడం మొదలుపెడతాడు. అవసరాలకు అందుబాటును జోడిస్తాడు, కేవలం మానవసంబంధాల సాయంతో. ఆయన సాయం పొందినవారు మరొకప్పుడు ఎవరికో సాయం చేయవలసిందే. 


ఆయన వెళ్లిపోయినందుకు కష్టంగా ఉన్నది. ఇష్టమైన ఎందరినో తీసుకువెడుతున్న ఈ పాడుకాలం మీద కోపంగా ఉన్నది. 

కె. శ్రీనివాస్

Updated Date - 2020-08-12T07:38:42+05:30 IST