కమిషనర్‌ను బదిలీ చేయించిన ‘పేట’ రాజకీయం

ABN , First Publish Date - 2021-01-16T06:32:55+05:30 IST

అక్రమాలపై నిలదీస్తూ, తగు చర్యలు తీసుకున్న సదాశివపేట మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీ చర్చనీయాంశంగా మారింది.

కమిషనర్‌ను బదిలీ చేయించిన ‘పేట’ రాజకీయం

చర్చనీయాంశంగా మారిన వ్యవహారం


సదాశివపేట, జనవరి 15: అక్రమాలపై నిలదీస్తూ, తగు చర్యలు తీసుకున్న సదాశివపేట మున్సిపల్‌ కమిషనర్‌ బదిలీ చర్చనీయాంశంగా మారింది. 10 నెలల క్రితం సదాశివపేట మున్సిపల్‌ కమిషనర్‌గా స్పందన బాధ్యతలు చేపట్టారు. పని చేసిన తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు, కందకం కబ్జాదారులపై కొరఢా ఝులిపించారు. సదాశివపేట పాత పట్టణం చుట్టూ ఉన్న లోతైన కందకం (ప్రభుత్వ స్థలం)లో నిర్మాణాలు చేపట్టొద్దని, అంతేకాకుండా అందులో నిర్మాణాలకు మున్సిపల్‌ అనుమతులు మంజూరు చేయరాదని 2009లో ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను మున్సిపల్‌ అధికారులు పకడ్బందీగా అమలు చేయకపోవడంతో 2010 నుంచి కందకం స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. వాటి వెనుక రాజకీయ జోక్యం ఉండడంతో కమిషనర్‌ స్థాయి అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన.. జాతీయ రహదారిని ఆనుకుని కందకం స్థలంలో నిర్మించిన నాలుగు భారీ భవనాలకు నోటీసీలు జారీ చేసి, సీజ్‌ చేయడం చర్చనీయాంశమైంది. అంతే కాకుండా గుర్తు తెలియని వ్యక్తులు మున్సిపల్‌ తాగునీటి సరఫరా విభాగ సిబ్బందిని బెదిరించి, భౌతిక దాడికి పాల్పడడంతో నిరసనగా టౌన్‌ ప్లానింగ్‌ విభాగం గదికి ఆమె తాళం వేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను అసభ్య పదజాలంతో దూషించి, బెదిరింపులకు పాల్పడడంపైనా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో ఆమె వీటిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కారణంగానే ప్రజాప్రతినిధులు తమ పలుకుబడిని ఉపయోగించి ఆమెను బదిలీ చేయించారన్న ఆరోపణలొచ్చాయి. 

Updated Date - 2021-01-16T06:32:55+05:30 IST