స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పేటకు ప్రథమస్థానం

ABN , First Publish Date - 2021-11-22T06:27:35+05:30 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సూర్యాపేట మునిసిపాలిటీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమస్థానం దక్కింది. లక్ష జనాభా దాటిన మునిసిపాలిటీల విభాగంలో జాతీయస్థాయిలో 158వ ర్యాంకు సొంతం చేసుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులను కేంద్రప్రభుత్వం శనివారం రాత్రి విడుదలచేసింది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పేటకు ప్రథమస్థానం

జాతీయ స్థాయిలో 158వ ర్యాంకు



సూర్యాపేటటౌన్‌, నవంబరు 21: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సూర్యాపేట మునిసిపాలిటీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమస్థానం దక్కింది. లక్ష జనాభా దాటిన మునిసిపాలిటీల విభాగంలో జాతీయస్థాయిలో 158వ ర్యాంకు సొంతం చేసుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకులను కేంద్రప్రభుత్వం శనివారం రాత్రి విడుదలచేసింది. దీంట్లో సూర్యాపేట మునిసిపాలిటీ గతంకంటే మెరుగైన ర్యాంకు సాధించి రాష్ట్రస్థాయిలో తొలిస్థానంలో నిలిచింది. పేట మునిసిపాలిటికి ఇప్పటికే జాతీయస్థాయిలో గుర్తింపు ఉంది. పలు పథకాలను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తూ ప్రత్యేకతను సంపాదించుకుంది. 2017లో జాతీయస్థాయిలో స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డును సైతం అందుకుంది. అంతేగాక ఐఎ్‌సవో సర్టిఫికెట్‌ సాధించింది. మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు, బహిరంగ టాయిలెట్ల ఏర్పాటు, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ, ప్లెక్సీల నిషేధం, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఇటుకల తయారీ, విక్రయం తదితర విషయాలను పరిశీలించిన కేంద్ర బృందం స్వచ్ఛసర్వేక్షణ్‌ ర్యాంకుకు ఎంపికచేసింది.


పారిశుధ్యంలో భేష్‌

పారిశుధ్యం అమలులో పేట మునిసిపాలిటీ ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకుంది. దేశంలోని పలు మునిసిపాలిటీల పాలకవర్గాలు, అధికారులు పేటను సందర్శించి అధ్యయంనం కూడా చేశారు. పట్టణంలో చెత్తను వీధుల్లో పడవేయకుండా చెత్త కుండీలను పదేళ్ల కిత్రమే తీసేశారు. ఇంటింటికీ వెళ్లి ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరిస్తున్నారు. ప్రతీ ఇంటికి తడి, పొడి చెత్త బుట్టలు అందజేశారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను పట్టణ సమీపంలోని జమునానగర్‌లోని వర్మికంపోస్టు కేంద్రానికి తరలించి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. దీని ద్వారా కూడా మునిసిపాలిటీకి కొంత ఆదాయం సమకూరుతోంది.


గతంలో దక్కిన అవార్డులు

జిల్లాస్థాయిలో ఉత్తమ మునిసిపాలిటీ అవార్డు, జిల్లా ఉత్తమ మునిసిపల్‌ చైర్మన్‌ అవార్డు, స్వచ్ఛభారత్‌ అవార్డులు గతంలో పేటకు దక్కాయి. 2017లో స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డును కేంద్రం ప్రభుత్వం అందజేసింది. అంతేగాక ఐఎ్‌సవో సర్టిఫికెట్‌ వచ్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2019లో జాతీయస్థాయిలో 126వ ర్యాంకు సాధించగా, 2020లో 326వ ర్యాంకు దక్కింది. 2021 సంవత్సరానికి 2812.42 పాయింట్లతో 158 ర్యాంకును సొంతం చేసుకుంది.


మరిన్ని అవార్డులకు కృషి : అన్నపూర్ణ, పేట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌

పారిశుధ్యం అమలు, బహిరంగ మలమూత్ర విసర్జనరహిత పట్టణంగా తీర్చిదిద్దడంలో విజయం సాధించడంతోనే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డును ప్రకటించింది. జాతీయ స్థాయిలో సూర్యాపేటకు గుర్తింపురావడం సంతోషంగా ఉంది. పాత మెయిన్‌రోడ్డు విస్తరణ, ఎస్టీపీ పనులు పూర్తయితే మరిన్ని అవార్డులు వచ్చే అవకాశం ఉంది. మున్ముందు పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం. అందుకు ప్రజలు సహకరించాలి.


Updated Date - 2021-11-22T06:27:35+05:30 IST