సడలింపు సందడి లేని ‘పేట’!

ABN , First Publish Date - 2021-06-21T05:32:38+05:30 IST

రాష్ట్రంలో సోమవారం నుంచి కర్ఫ్యూ తాజా సడలింపు అమలులోకి వస్తున్నా... పాయకరావుపేట వాసులు మాత్రం ఆ ఆనందానికి నోచుకోవడం లేదు.

సడలింపు సందడి లేని ‘పేట’!
పాయకరావుపేట పట్టణ వ్యూ


 నేటి నుంచి తూ.గో. మినహా రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 6 వరకు కర్ఫ్యూ సడలింపు

  పాయకరావుపేటలో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలు

  తునివాసులు ఇక్కడకు వచ్చే అవకాశం ఉండడంతో నిబంధనలు యథాతథంగా అమలు 

పాయకరావుపేట, జూన్‌ 20 : రాష్ట్రంలో సోమవారం నుంచి కర్ఫ్యూ తాజా సడలింపు అమలులోకి వస్తున్నా... పాయకరావుపేట వాసులు మాత్రం ఆ ఆనందానికి నోచుకోవడం లేదు. పక్కనే ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో అక్కడ ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే కర్ఫ్యూలో సడలింపు ఇచ్చారు. అదే నిబంధనలను పాయకరావుపేటలో కూడా పంచాయతీ అధికారులు అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటలకే అన్ని రకాల వ్యాపార దుకాణాలు మూసివేయాల్సి వస్తుంది. సుమారు రెండు నెలల క్రితం కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న సమయంలో తుని, పాయకరావుపేట పట్టణాల్లో వ్యాపారస్థులు స్వచ్ఛందంగా పాక్షిక లాక్‌డౌన్‌ పాటించారు. ఆ తరువాత ప్రభుత్వం కర్ఫ్యూను అమలు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో కర్ఫ్యూను మరో నాలుగు గంటల పాటు సడలిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో అంతటా ఆనందం వ్యక్తమవుతోంది.  అయితే రాష్ట్రంలో ఇప్పటికీ కరోనా కేసుల సంఖ్య తగ్గని తూర్పుగోదావరి జిల్లాలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉన్న కర్ఫ్యూలో ప్రభుత్వం మార్పులు చేయలేదు. దీంతో ఆ జిల్లా సరిహద్దులో ఉన్న తుని పట్టణంలో మధ్యాహ్నం రెండు గంటలకే అన్ని వ్యాపార సంస్థలు మూసి వేయాలి. కొత్తగా ఇచ్చిన సడలింపుల వల్ల పాయకరావుపేటలో సాయంత్రం ఆరు గంటల వరకు గడువు ఇస్తే.. తుని నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చే ప్రమాదం ఉందని పంచాయతీ పాలకులు భావిస్తున్నారు. దీంతో పాయకరావుపేటలో కూడా మధ్యాహ్నం రెండు గంటలకే వ్యాపార కేంద్రాలు మూసివేయాలి. అయితే పోలీసులు మాత్రం ప్రభుత్వ ఆదేశాల మేరకు సాయంత్రం ఆరు గంటల నుంచి కర్ఫ్యూ అమలుచేస్తామని చెబుతున్నారు. ఇదే విషయమై పాయకరావుపేట మేజర్‌ పంచాయతీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎం.సత్యప్రసాద్‌ ఆదివారం పట్టణంలో దండోరా వేయించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట ఎస్‌ఐ డి.దీనబంధు ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ సమయాన్ని సడలిస్తున్నప్పటికీ ప్రజలు మరికొంత కాలం కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి భౌతిక దూరం పాటించాలని  సూచించారు. 

Updated Date - 2021-06-21T05:32:38+05:30 IST