Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆనందయ్య మందుపై హైకోర్టులో పిటిషన్‌

అమరావతి: ఆనందయ్య మందుపై ఏపీ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ అనుమతి కోసం హైకోర్టు న్యాయవాది యలమంజుల బాలాజీ దరఖాస్తు చేశారు. అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు తరపున పిటిషన్‌ దాఖలు చేశారు. కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని, ఈ మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఆకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ నిలిపివేసిందని, దీనివల్ల అనేక మంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని తెలిపారు. విచారణకు అనుమతించాలని న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టుకు లేఖ రాశారు.


మరోవైపు ఆనందయ్య మందుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఆయుష్ తేల్చింది. అయితే ఐసీఎంఆర్ ఏం నివేదిక ఇస్తుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా ఆనందయ్య మందు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. జనం నుండి అనూహ్య మద్దతు వస్తుండటంతో మందుపై శాస్త్రీయ అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య ఈ మందును తయారు చేశారు. వాడుతున్న మూలికలను, తయారీ పద్ధతిని పరిశీలించిన ఏపీ ఆయుష్ కమిషనర్ రాములు ఈ మందులో ఎలాంటి హానికర పదాదార్థాలను వాడటం లేదని గుర్తించామన్నారు. అయినప్పటికీ శాస్త్రీయత ధృవీకరణ జరిగే వరకు ఆనందయ్య మందును నాటుమందుగానే పరిగణిస్తామని రాములు చెప్పారు.

Advertisement
Advertisement