కలకలం: ఒంగోలులో ఓ ఇంటిపై.. పెట్రోలు బాంబులతో దాడి

ABN , First Publish Date - 2021-07-14T16:15:53+05:30 IST

ఒంగోలులోని ఓ ఇంటిపై పెట్రోల్‌..

కలకలం: ఒంగోలులో ఓ ఇంటిపై.. పెట్రోలు బాంబులతో దాడి

పాక్షికంగా అంటుకున్న మంటలు

పాతకక్షలే కారణమని అనుమానం 

పోలీసుల అదుపులో రెండు గ్రూపులకు చెందిన పలువురు 


ఒంగోలు: ఒంగోలులోని ఓ ఇంటిపై పెట్రోల్‌ బాంబుల దాడి జరిగింది. ఇది నగరంలో కలకలం సృష్టించించింది. పాత కక్షలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు. అందిన సమాచారం మేరకు.. నగరంలోని రెవెన్యూ కాలనీ రెండోలైనులో నివాసముంటున్న కుంచాల అరుణ సోదరి కుమారుడైన మహేశ్‌ సిమెంట్‌ వ్యాపారి. వీరు గతంలో బండ్లమిట్టలో నివాసం ఉండేవారు. మహే్‌షకు సమీపంలోని మంగలిపాలెంలో నివాసం ఉండే హైదర్‌ఆలీ, అక్రం అలీలతో చదువుకునే సమయం నుంచే స్నేహం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదర్‌ ఆలీకి మహేష్‌ ఏడు నెలల క్రితం రూ.50 వేలు అప్పు ఇచ్చాడు. ఈ విషయంలో మహేశ్‌కు హైదర్‌ అలీకి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. వారిరువురూ స్థానిక యువకులతో కలిసి రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు. అనేక సార్లు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు ఒంగోలు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదు చేసుకున్నారు. తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో మరో కేసు ఉంది.


ఈ నేపథ్యంలో గతనెల 19న జరిగిన లోక్‌ అదాలత్‌లో ఐదు కేసుల్లోనూ ఇరువర్గాల వారు రాజీపడ్డారు. అయినప్పటికీ వారు తరచూ గొడవపడుతూనే ఉన్నారు. మహేష్‌ రెవెన్యూ కాలనీలోని తన పిన్ని కుంచాల అరుణ ఇంటి వద్ద ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆ ఇంటిపై సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అందరూ నిద్రిస్తుండగా పెట్రోలు బాంబుల దాడి జరిగింది. ఇరువురు యువకులు బీరు సీసాల్లో పెట్రోలు పోసి వాటిలో వస్త్రాలు కుక్కి నిప్పంటించి విసిరేశారు. దీంతో ఆ ఇంటి ముఖ ద్వారానికి ఉన్న కర్టెన్‌ తగులబడడంతోపాటు అద్దం కూడా పగిలిపోయింది. తెల్లవారి లేచి చూసి ఆ ఇంట్లో ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. సీసీ కెమెరాలు పరిశీలించగా ఇరువురు యువకులు సీసాలు విసిరినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న  పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. రెండు గ్రూపులకు చెందిన యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. 

Updated Date - 2021-07-14T16:15:53+05:30 IST