పద్యం చెబితే పెట్రోల్ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన సాహిత్యాభిమాని!

ABN , First Publish Date - 2021-02-16T02:47:21+05:30 IST

పద్యం..జివనసారాన్ని మొత్తం అరటిపండు ఒలిచిపెట్టినట్టు బోధించే అద్భుత సాహిత్య ప్రక్రియ. కానీ.. ఆధునికజీవనం తెచ్చిన మార్పులు కారణంగా నేటి తరం చిన్నారులు పద్యాలకు దూరమవుతున్నారనడంతో ఎటువంటి సందేహం లేదు. అయితే తమిళనాడుకు చెందిన ఓ సాహిత్యాభిమాని మాత్రం ఈ పద్యసంపదకు కొత్త తరాన్ని దగ్గర చేసేందుకు నడుం కట్టారు.

పద్యం చెబితే పెట్రోల్ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన సాహిత్యాభిమాని!

చెన్నై: పద్యం..జీవనసారాన్ని మొత్తం అరటిపండు ఒలిచిపెట్టినట్టు బోధించే అద్భుత సాహిత్య ప్రక్రియ. కానీ.. ఆధునికజీవనం తెచ్చిన మార్పులు కారణంగా నేటి తరం చిన్నారులు పద్యాలకు దూరమవుతున్నారనడంతో ఎటువంటి సందేహం లేదు. అయితే తమిళనాడుకు చెందిన ఓ సాహిత్యాభిమాని మాత్రం ఈ పద్యసంపదకు కొత్త తరాన్ని దగ్గర చేసేందుకు నడుం కట్టారు. రామసేతు నిర్మాణంలో ఉడతాభక్తిగా తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు కోసం ఆయన ఎంచుకున్న మార్గం..ఉచిత పెట్రోల్..! చిన్నారులు పద్యాలు చెబితే చాలు..ఉచితంగా పెట్రోల్ ఇస్తానంటూ వారిలో సాహిత్యం పట్ల అభిమానం పెంచేందుకు కృషి చేస్తున్నాడు. తమిళుల ఆరాధ్యుడు తిరువళ్లువర్ రచించిన తిరుక్కరళ్ గ్రంథంలోని పద్యాలను చెప్పిన వారికే ఈ ఆఫర్ అని ప్రకటించారు. 


తిరుక్కరళ్ ప్రస్తావన లేనిదే తమిళ సాహిత్యం లేదంటే అతిశయోక్తి కాదు! ఈ గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యత ఇది. ప్రముఖ కవి తిరువళ్లువర్ దీన్నీ రచించారు. రాజకీయం, ఆర్థికం, నైతికత, ప్రేమ వంటి అనేక మానవజీవన పార్శ్వాలపై 1380 పద్యాలు ఇందులో ఉంటాయి. వీటిని అర్థం చేసుకుని మనసా వాచా కర్మణా పాటిస్తే మానజీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. అయితే..ఈ పద్యాలు నేర్చుకునేందుకూ ఎంతో సులువుగా ఉంటాయి. ఇంతటి విశిష్టత కలిగిన ఈ పద్యాలంటే తమిళ ప్రజానీకానికి అమితమైన అభిమానం. 62 ఏళ్ల కె. సెంగుట్టవన్ ఈ కోవలోకే వస్తారు. ఆయన కుటుంబానికీ తిరువళ్లువర్ అన్నా..ఆయన రచించిన తిరుక్కరళ్ అన్నా మాటల్లో చెప్పలేనంత గౌరవాభిమానాలు. వళ్లువర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సెంగుట్టవన్..కరూర్‌కు సమీపంలోని నాగంపల్లి ప్రాంతంలో ఓ  పెట్రోల్ బంక్ ఉంది. దీని పేరు కూడా వళ్లువర్ అని నామకరణం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. 


కాగా.. నేటి తరానికి ఈ సాహిత్యాన్ని దగ్గర చేసేందుకు పెట్రోల్ ధరలు పెరిగిన ప్రస్తుత తరుణమే సరైనదనే ఆలోచన ఆయన మదిలో మెదిలింది. ఫలితంగా పుట్టినదే ‘పద్యాలు చెబితే..పెట్రోల్ ఉచితం’ ఆఫర్. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైనా సరే తిరుక్కరళ్‌లో ఉన్న పద్యాల్లో కనీసం 20 చెబితే లీటర్, 10 చెబితే అర లీటర్ చొప్పున ఉచితంగా పెట్రోల్ పొందవచ్చంటూ ప్రకటన ఇచ్చారు. ఇంకేముంది..చూస్తుండగానే ఈ ప్రకటన విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు తిరుక్కరళ్ పద్యాలు నేర్పించి.. పెట్రోల్ బంక్‌కు తీసుకొస్తున్నారు. పిల్లల చేత పద్యాలు చెప్పించి..పెట్రోల్ పట్టుకెళుతున్నారు. అయితే..ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకూ మాత్రమే కొనసాగుతుందని చెబుతున్నారు. ఉచిత పెట్రోల్ విషయం అటుంచితే..పిల్లల్లో సాహిత్యాభిరుచి పెంచేందుకు సెంగుట్టవన్ చేస్తున్న ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Updated Date - 2021-02-16T02:47:21+05:30 IST