యార్డుల్లో.. పెట్రోల్‌

ABN , First Publish Date - 2021-10-19T05:28:46+05:30 IST

కేంద్ర చట్టాలతోపాటు, దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మార్కెట్‌ యార్డులు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌తో ప్రస్తుతం నిర్వీర్యం అవుతున్నాయి.

యార్డుల్లో.. పెట్రోల్‌

మార్కెట్‌ యార్డుల్లో ఆయిల్‌ బంకులు

ఆదాయం పెంపు.. యార్డుల సిబ్బందికి ఉపాధి

హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ సంస్థలతో ప్రభుత్వం చర్చలు

తొలిదశలో జిల్లాలో ఎనిమిది చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

       (గుంటూరు - ఆంధ్రజ్యోతి)

కేంద్ర చట్టాలతోపాటు, దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మార్కెట్‌ యార్డులు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌తో ప్రస్తుతం నిర్వీర్యం అవుతున్నాయి. ప్రధాన రహదారుల్లో విశాలమైన ప్రాంగణాల్లో యార్డులను ఏర్పాటు చేశారు. కొనుగోళ్లు, విక్రయాలు, యార్డుల నిర్వహణ తదితరాల కోసం గతంలో పెద్దసంఖ్యలో ఉద్యోగులను కూడా తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా స్థలాలు వృథాగా ఉండగా, దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బందిని తొలగించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో స్థలాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు సిబ్బందికి ఉపాధి చూపేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో మార్కెట్‌ యార్డుల్లో పెట్రోల్‌, డీజిల్‌ బంకులను ఏర్పాటు చేస్తే సిబ్బందికి ఉపాధి కల్పించవచ్చని, స్థలాలను సద్వినియోగం  చేసుకోవచ్చని, మార్కెట్‌ యార్డుల నిధులు పక్కదారి పట్టకుండా చూడవచ్చని అధికారులు భావిస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం మార్కెట్‌ యార్డుల్లో పెట్రోల్‌, డీజిల్‌ బంక్‌లు పెట్టాలని ప్రతిపాదించింది. హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ సంస్థలతో అధికారులు చర్చలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో 80-90 యార్డుల్లో బంకులు పెట్టాలని నిర్ణయించగా జిల్లాలో ఇందుకు ఎనిమిది యార్డులను గుర్తించారు. ఐఓసీ సంస్థ పిడుగురాళ్ల, వినుకొండ, మాచర్ల, తెనాలి యార్డుల్లో, హెచ్‌పీసీఎల్‌ చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, తెనాలి, రొంపిచర్ల, ఫిరంగిపురం, దుర్గి యార్డులలో బంక్‌లు పెట్టాలని ప్రతిపాదించాయి. ప్రతి యార్డులో ఒక బంక్‌ ఉండేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆయా యార్డుల్లో స్థలాలను బంక్‌లకు కేటాయించాలని మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.   బంకుల నిర్వహణపై విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించి స్థలాలకు లీజు తీసుకోవాలా... లేదా యార్డు ఆధ్వర్యంలోనే వీటిని కొనసాగించాలా అనే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు.


దశల వారీగా అన్ని యార్డుల్లో బంక్‌లు

మార్కెట్‌ యార్డుల నిధులను ప్రభుత్వం సీఎఫ్‌ఎమ్‌ఎస్‌(ట్రెజరి) నుంచి ఇతర శాఖలకు తరలిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరు యార్డు నిధుల సుమారు రూ.200 కోట్లు తరలించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయిల్‌ బంక్‌లను యార్డుల్లో ఏర్పాటు చేసి, వాటిని మార్కెటింగ్‌ శాఖ నిర్వహిస్తే నిధుల మళ్లింపు ఉండదని దానితో పాటు ఒక్కో బంక్‌ వల్ల సుమారు పదిమందికి శాశ్వత ఉపాధి లభిస్తుందని ఈ ప్రతిపాదనలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయిల్‌ బంక్‌ల నిర్వహణ వల్ల కల్తీని అరికట్టడంతోపాటు నిధులు మళ్లింపును అడ్డుకోవటం, ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందికి ఉపాధి చూపించవచ్చని అధికారులు తెలిపారు. దశల వారీగా అన్ని మార్కెట్‌ యార్డుల్లో బంక్‌లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. మార్క్‌ఫెడ్‌, సీసీఐ ద్వారా వివిధ రకాల పంటల కొనుగోళ్ల సమయంలో యార్డులకు నిత్యం వందలాది వాహనాలు వస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్‌ బంక్‌లకు ఏర్పాటు చేస్తే ఆదాయం పెరుగుతుందనే భావనతోనే ఈ ప్రయోగం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌ సంస్థలతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటే డిపాజిట్‌ మినహాయింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.  


 

Updated Date - 2021-10-19T05:28:46+05:30 IST