Abn logo
Oct 18 2021 @ 23:45PM

మార్కెట్‌ యార్డుల్లో పెట్రోలు బంక్‌లు

జిల్లాలో ఏడు ఏఎంసీల గుర్తింపు

 ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు

 ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

 వ్యవసాయ మార్కెట్‌ యార్డుల ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం కన్నేసింది. మార్కెట్‌ సెస్‌ ఖచ్చితంగా వసూలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టగా తాజాగా యార్డుల్లో పెట్రోల్‌ బంక్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది. లీజుకు లేదంటే అద్దెకు యార్డులో స్థలాన్ని అప్పగించ నున్నారు. అక్కడ ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ను నిర్మిస్తుంది. నిర్వహణ కూడా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొ రేషన్‌ చూసుకోనుంది. బంక్‌లు ఏర్పాటు చేస్తే డిమాండ్‌ ఉండే ఏడు మార్కెట్‌ యార్డులను జిల్లాలో గుర్తించారు. భీమ వరం, పాలకొల్లు, ఆచంట, అత్తిలి, కొవ్వూరు, దెందులూరు, ఆకివీడు మార్కెట్‌ యార్డుల్లో బంక్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఎటువంటి అవతవకలకు వీలు లేకుండా సక్రమంగా పెట్రోలు, డీజల్‌ సరఫరాకు అవకా శం ఉండడంతో డిమాండ్‌ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 92 మార్కెట్‌ యార్డులను గుర్తించారు. అందులో పశ్చిమలోనే 7 మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. వాటిలో విశాలమైన స్థలాలు ఉన్నాయి. ప్రధాన రోడ్డులకు ఆనుకుని యార్డులు ఉన్నాయి. ఫలితంగా పెట్రోల్‌ బంక్‌లకు డిమాండ్‌ ఉంటుందని అధికారులు తలపోస్తున్నారు. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం బంక్‌లు ఏర్పాటుకు సుముఖంగా ఉంది. అంతే తప్పా మార్కెట్‌ యార్డుల్లో రైతులకు ప్రయోజనకరమైన అభివృద్ధి పనులకు చేపట్టడం లేదు. ప్రధానంగా జిల్లాలో పుంతరోడ్డు అభివృద్ధి చేయాలి. వాటిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వస్తోంది. అంతర్గత అభివృద్ధికి గతంలో 20శాతం నిధులు వెచ్చించేవారు. సిమెంట్‌ రహదారులు, డ్రెయిన్‌లు వంటి పనులు చేపట్టేవారు. ఇప్పుడు యార్డుల్లో అంతర్గత పనులు నిర్వహించాలన్నాసరే పాకలవర్గాల తీర్మానాలు సరిపోవు, వాటిని ప్రతిపాదనల రూపంలో కమిషనర్‌కు పంపాలి. ప్రభుత్వం అనుమతి తీసుకున్న తర్వాతే కమిషనర్‌ ఆమోద ముద్ర వేస్తారు. ఆ తర్వాత పనులు నిర్వహించాల్సి ఉంటుంది. కేవలం జీతభత్యాలు, యార్డు నిర్వహణ వరకు అవసరమైన నిధులు ఇప్పించేత వరకే పాలకవర్గాలు పరిమితమయ్యాయి. రైతు బంధు పథకాన్ని కూడా నిలిపివేశారు. తద్వారా రైతుల పంటలు నిల్వచేసుకుని రుణాలిచ్చే పద్ధతికి చెక్‌ పడింది. యార్డుల ద్వారా వచ్చే ఆదాయమంతా ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించుకుంటోంది. రికార్డుల్లోనే యార్డుల ఆదాయం కనిపిస్తోంది. ఖర్చుపెట్టుకోవడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయ్యింది. తాజాగా పెట్రోల్‌ బంకుల నిర్మాణంలో అదే జరుగుతోంది. ఇలా పాలకవర్గాల ప్రమేయం మారె ్కట్‌ కమిటీల్లో తగ్గిపోతోంది, ప్రభుత్వమే అంతా తానై వ్యవహరిస్తోంది.