ఇంధనం వదులుకోలేం..

ABN , First Publish Date - 2021-09-18T07:22:59+05:30 IST

జీఎస్‌టీ కౌన్సిల్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సుదీర్ఘంగా...

ఇంధనం వదులుకోలేం..

  • జీఎస్‌టీలోకి పెట్రోల్‌, డీజిల్‌ తీసుకువచ్చే ప్రతిపాదనకు రాష్ట్రాలు ససేమిరా 
  • ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ నుంచే జీఎస్‌టీ వసూలు
  • డిసెంబరు వరకు కొవిడ్‌ ఔషధాలకు పన్ను రాయితీ 
  • తగ్గనున్న కేన్సర్‌ మందుల ధరలు  
  • జీఎస్‌టీ మండలి నిర్ణయాలు 

    పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెచ్చేందుకు ఇది సరైన సమయం కాదని జీఎస్‌టీ మండలి భావించింది. అందుకే వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

    • - నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి



    లఖ్‌నవూ: జీఎస్‌టీ కౌన్సిల్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన జీఎస్‌టీ మండలి సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అనేక కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఈ నెలాఖరుతో ముగిసే కొవిడ్‌ ఔషధాలపై జీఎస్‌టీ రాయితీని డిసెంబరు నెలాఖరు వరకు కొనసాగించాలని జీఎస్‌టీ మండలి నిర్ణయించిందని సమావేశానంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అయితే కొవిడ్‌ చికిత్సకు ఉపకరించే కొన్ని వైద్య పరికరాలకు మాత్రం ఈ రాయితీ పొడిగింపు వర్తించదు. వాటిపై ఉన్న పన్ను రాయితీ ఈ నెలాఖరుతో ముగుస్తుంది. కండరాల క్షీణత వ్యాధుల చికిత్సలో ఉపయోగించే అత్యంత ఖరీదైన ఔషధాలకు జీఎ్‌సటీ నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చేందుకూ జీఎ్‌సటీ మండలి ఆమోదం తెలిపిందన్నారు.  


    ‘పెట్రో’ బాదుడు తప్పదు

    ఎన్నాళ్లుగానే ఎదురు చూస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ను జీఎ్‌సటీలో చేర్చే ప్రతిపాదనపై ఈసారి కూడా ఎలాంటి అంగీకారం కుదరలేదు. అత్యధిక పన్ను రాబడి తెచ్చే వీటిని జీఎ్‌సటీలో చేర్చే ప్రతిపాదనను రాష్ట్రాలు గట్టిగా వ్యతిరేకించాయి. దీంతో ఈ ప్రతిపాదనపై పెద్దగా చర్చ జరగలేదని సమాచారం. అయితే కేరళ హైకోర్టు సూచనల మేరకే పెట్రో ఉత్పత్తులను జీఎ్‌సటీ పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని చర్చించామని, ఈ అంశాన్ని రాష్ట్రాలు వ్యతిరేకించటమే కాకుండా ప్రస్తుతం ఇది సమయం కాదని స్పష్టం చేశాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. 


    రాష్ట్రాలకు ఊరట 

    వచ్చే ఏడాది జూలైతో ముగిసే నష్ట పరిహార సెస్‌ వసూళ్లను 2026 మార్చి వరకు పొడిగించాలని మండలి నిర్ణయించింది. జీఎ్‌సటీకి ఒప్పుకోవడం వల్ల రాష్ట్రాలు నష్టపోయే పన్ను రాబడుల భర్తీ కోసం కొన్ని ఖరీదైన వస్తువులపై ఈ సెస్‌ వసూలు చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జూలై నుంచి కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్రాలు చేసిన అప్పుల చెల్లింపులకు ఈ నష్టపరిహార సెస్‌ వినియోగించాలని తీర్మానించారు. కొవిడ్‌ ఆర్థిక కష్టాలతో కుంగిపోతున్న రాష్ట్రాలకు ఇదో ఊరట కానుంది. 




    ఫుడ్‌ యాప్స్‌పై అదనపు బాధ్యత 

    స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్‌ యాప్స్‌ ద్వారా డెలివరీ జరిగే ఆహార పదార్ధాలపై విధించే 5 శాతం జీఎస్‌టీ చెల్లింపు బాధ్యతను 2022 జనవరి 1 నుంచి ఫుడ్‌ డెలివరీ యాప్స్‌కే బదిలీ చేయాలని మండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఈ సంస్థలు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న ఈ పన్నుని రెస్టారెంట్లే చెల్లించేలా.. వాటికి బదిలీ చేస్తున్నాయి. అయితే రెస్టారెంట్లు ఈ పన్నును సరిగా చెల్లించక పోవడంతో ఏటా దాదాపు రూ.2,000 కోట్ల వరకు ప్రభుత్వం నష్టపోతోంది దీనికి చెక్‌ పెట్టేందుకు ఇక ఈ 5 శాతం జీఎ్‌సటీ చెల్లింపు బాధ్యతను ఫుడ్‌ డెలివరీ యాప్స్‌కే అప్పగించాలని జీఎ్‌సటీ మండలి నిర్ణయించింది. ఈ నిర్ణయంతో వినియోగదారులపై ఎలాంటి భారం పడదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. 


    ఇతర కీలక నిర్ణయాలు

    1. కేన్సర్‌ ఔషధాలపై 12 శాతంగా ఉన్న జీఎస్‌టీ 5 శాతానికి తగ్గింపు
    2. పోషకాలతో ద్విగుణీకృతం చేసిన బియ్యంపై 12 శాతం ఉన్న జీఎస్‌టీ 5 శాతానికి కుదింపు
    3. డీజిల్‌లో కలిపే బయో డీజిల్‌పై 12 శాతంగా ఉన్న జీఎస్‌టీ 5 శాతానికి తగ్గింపు
    4. సరుకు రవాణా వాహనాల నేషనల్‌ పర్మిట్‌ ఫీజుపై జీఎస్‌టీ రద్దు
    5. లీజుపై దిగుమతి చేసుకునే విమానాలపై  ఐజీఎస్‌టీ రద్దు
    6. అన్ని రకాల పెన్నులపై 18 శాతం జీఎస్‌టీ
    7. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో ఉపయోగించే కొన్ని పరికరాలపై జీఎస్‌టీ 5 శాతం నుంచి 12 శాతానికి పెంపు 
    8. 2022 జనవరి నుంచి పాదరక్షలు, దుస్తులపై కొత్త జీఎస్‌టీ రేట్లు
    9. ఇనుము రాగి, అల్యూమినియం, జింక్‌ వంటి ఖనిజాలపై జీఎస్‌టీ 5 నుంచి 18 శాతానికి పెంపు
    10. కొన్ని వస్తువులపై జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణ కోసం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కమిటీ ఏర్పాటు
    11. ఈ కమిటీ రెండు నెలల్లో నివేదిక సమర్పించాలి

    Updated Date - 2021-09-18T07:22:59+05:30 IST