Abn logo
Oct 15 2021 @ 02:36AM

35 పైసలు పెరిగిన ‘పెట్రో’ ధర

న్యూఢిల్లీ, అక్టోబరు 14: దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. చమురు సంస్థలు గురువారం లీటరు పెట్రోలు, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర ఎన్నడూ లేనంతగా రూ.104.79కి చేరింది. డీజిల్‌ రూ.93.52కి పెరిగింది. ముంబైలో లీటరు పెట్రోలు రూ.110.75, డీజిల్‌ రూ.101.40కి పెరిగింది. ఇక, హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.109.00, డీజిల్‌ ధర రూ.102.04కి చేరింది. దేశంలోని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వ్యాట్‌ ఆధారంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పులు ఉంటాయి. కొన్ని రోజులుగా ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే, మంగళ, బుధవారాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరల్లో ఎటువంటి మార్పులేదు. మళ్లీ గురువారం పెరగడం గమనార్హం. కాగా, పెట్రోలు, డీజిల్‌ ధరలు వరుసగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర సర్కారుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఎడాపెడా పన్నులు బాదుతూ, దీనిపై తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుకథలు చెబుతోందని ట్వీట్‌ చేశారు.


కర్ణాటక రైతులకు డీజిల్‌పై రూ.20 రాయితీ

రోజురోజుకూ పైపైకి ఎగబాకుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలతో దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఈ ప్రభావం రైతులపైనా ఎక్కువగానే ఉంది. ఇలాంటి తరుణంలో కర్ణాటక ప్రభుత్వం రైతులు వాడే డీజిల్‌పై లీటరుకు రూ.20 రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ  మంత్రి బీసీ పాటిల్‌ తెలిపారు. చిత్రదుర్గ మురుఘామఠంలో వ్యవసాయ, పారిశ్రామిక మేళాను గురువారం ప్రారంభించిన మంత్రి.. అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడారు. రైతులు సాగు, పంట దిగుబడుల రవాణాకు వినియోగించే వాహనాలకు వాడే డీజిల్‌కు లీటరుకు రూ.20 రాయితీ ఇస్తామని చెప్పారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే డీజిల్‌కు రాయితీ ఇవ్వదలచామని.. కానీ కొవిడ్‌ కారణంగా సాధ్యం కాలేదని తెలిపారు. ప్రస్తుత సీఎం బసవరాజ్‌ బొమ్మై సంసిద్ధత వ్యక్తం చేశారని, త్వరలోనే విధివిధానాలు ప్రకటించి రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు.