మజ్లిస్‌ కనుసన్నల్లో పీఎఫ్‌ఐ

ABN , First Publish Date - 2022-09-22T08:51:19+05:30 IST

భారత్‌ను ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్‌ఐ కుట్ర పన్నిందని, అలాంటి సంస్థను టీఆర్‌ఎస్‌ సహకారంతో ఎంఐఎం పెంచి పోషిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు.

మజ్లిస్‌ కనుసన్నల్లో పీఎఫ్‌ఐ

  • మజ్లిస్‌ కనుసన్నల్లో పీఎఫ్‌ఐ
  • టీఆర్‌ఎస్‌ అండతో పెంచి పోషిస్తోంది
  • తెలంగాణలో విధ్వంసానికి పీఎఫ్‌ఐ కుట్ర 
  • ప్రభుత్వానికి తెలియకపోవడం సిగ్గుచేటు
  • ఏ స్కాంలో చూసినా సీఎం కుటుంబ సభ్యులే
  • బుల్‌డోజర్లు వచ్చుడే.. కేసీఆర్‌ బంగ్లాలను కూల్చుడే
  • ప్రజాసంగ్రామ యాత్రలో సంజయ్‌ వ్యాఖ్యలు

(ఆంధ్రజ్యోతి హైదరాబాద్‌ సిటీ నెట్‌వర్క్‌): భారత్‌ను ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్‌ఐ కుట్ర పన్నిందని, అలాంటి సంస్థను టీఆర్‌ఎస్‌ సహకారంతో ఎంఐఎం పెంచి పోషిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. తెలంగాణలో బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించాలనే కుట్ర ఇటీవల బిహార్‌లో బయటపడిందని, ఇది పీఎఫ్‌ ఐ లాంటి సంస్థల పనేనని అన్నారు. ఎంఐఎం కనుసన్నల్లో పీఎ్‌ఫఐ పని చేస్తోందని ఆరోపించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు జరిపేంత వరకూ పీఎ్‌ఫఐ గురించి తెలంగాణ ప్రభుత్వానికి తెలియకపోవటం సిగ్గుచేటని విమర్శించారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సంజయ్‌ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా నాగోలు చౌరస్తాలో  మాట్లాడుతూ.. తెలంగాణలో 2.40 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు మంజూరు చేసిందని, వాటిని ఎక్కడ నిర్మించారో చెప్పాలని కేంద్రం లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. లిక్కర్‌ స్కాం, పేకాట, ఇసుక, డ్రగ్స్‌ ఇలా ఏ స్కాంలో చూసి నా కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉంటున్నాయని ఆరోపించారు. సీబీఐ, ఈడీ దాడులు అనగానే కేసీఆర్‌ కొడుక్కు కాలు విరిగిందని, బిడ్డకు కరోనా వచ్చిందని ఎద్దేవా చేశారు. 


పాతబస్తీలో ఇంటి పన్ను, కరెంటు బిల్లు, వాటర్‌ బిల్లు కనీసం రూ.100 కూడా వసూలు చేయరని, హిందువులను మాత్రం వేధించి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాధనాన్ని వెచ్చించి వంద గదులతో ప్రగతి భవన్‌ కట్టించుకున్న కేసీఆర్‌.. పేద ప్రజలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఎందుకు కట్టించడం లేదని ప్రశ్నించారు. ‘‘బుల్‌డోజర్లు వచ్చుడే.. కేసీఆర్‌ బంగ్లాలను కూలగొట్టుడే. ఆ డబ్బం తా వెచ్చించి పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చుడే’’ అని వ్యాఖ్యానించారు. సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా వస్తుండటంతో కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదన్నారు. పాదయాత్రలో బీజేపీ సీనియర్‌ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్‌రావు, పార్టీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ కన్వీనర్‌ వంగా మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. 


నేడు పెద్ద అంబర్‌పేట్‌లో ముగింపు సభ

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను గురువారం రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్‌లో నిర్వహిస్తున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఈ సభకు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. సభ ఏర్పాట్లను బుధవారం ఆ పార్టీ నేతలు జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, పాదయాత్ర ప్రముఖ్‌ మనోహర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఇప్పటివరకు 102 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో సంజయ్‌ పాదయాత్ర పూర్తయిందని తెలిపారు.

 

ప్రజా సంగ్రామ యాత్రకు 100 రోజులు

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర.. బుధవారంతో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో ఆయన 1,238 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. 


రేపు రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు  

హైదరాబాద్‌: పార్లమెంటు ప్రవాస్‌ యోజనా కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పర్యటించేందుకు కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి, బీఎల్‌ వర్మ శుక్రవారం రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-09-22T08:51:19+05:30 IST