Pfizer: కరోనా టీకాతో కనకవర్షం..! 20 ఏళ్లలో తొలిసారిగా..

ABN , First Publish Date - 2021-08-11T21:35:42+05:30 IST

కరోనా టీకా తయారీదారైన ఫైజర్ సంస్థ షేర్లు మంగళవారం నాడు రికార్డు స్థాయిలో దుసుకుపోయాయి.

Pfizer: కరోనా టీకాతో కనకవర్షం..! 20 ఏళ్లలో తొలిసారిగా..

న్యూఢిల్లీ: కరోనా టీకా తయారీదారైన ఫైజర్ సంస్థ షేర్లు మంగళవారం నాడు రికార్డు స్థాయిలో దుసుకుపోయాయి. కంపెనీ షేర్ విలువ 4.9 శాతం పెరిగి 48.25 డాలర్ల వద్ద నిలబడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో అత్యధికంగా 48.57 డాలర్లను తాకింది. ఈ స్థాయిలో కంపెనీ షేర్లు దూకుడు కనబర్చడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి. 1999 ఏప్రిల్ 22న చివరిసారిగా ఫైజర్ కంపెనీ షేరు విలువ 47.44 డాలర్లను తాకింది. ‘‘టీకా కోసం వారు పడ్డ కష్టానికి గుర్తింపు వచ్చిందని నేననుకుంటున్నా’’ అని గాబెల్లీ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ జెఫ్ జోనాస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఫైజర్ కంపెనీ షేర్లలో కొన్ని గాబెల్లీ ఫండ్స్ చేతిలో ఉన్నాయి. టీకా తయారీకి అభివృద్ధి పరిచిన సాంకేతికను ఫైజర్ ఇతర వ్యాధుల పనిపట్టేందుకు కూడా వినియోగించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. 


మరో కరోనా టీకా తయారీదారైన మోడర్నా సంస్థ షేర్లు కూడా ఇటీవల కాలంలో దూసుకుపోతున్నాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు తిరోగమనంలో పయనించి 4.9 శాతం మేర నష్టపోయాయి. అయితే.. జులై నెల నుంచీ గమనిస్తే..కంపెనీ షేర్ విలువ 78 శాతం మేర పెరిగింది. కాగా. టీకా తయారీలో ఫైజర్ కంపెనీ భాగస్వామి అయిన జర్మన్ సంస్థ బయోఎన్‌టెక్ సంస్థ షేర్లు కూడా ఈ నెలలో 30 శాతం మేర లాభపడ్డాయి. మరో సంస్థ నోవోవ్యాక్స్ షేర్లు కూడా మంగళవారం నాడు 11 శాతం మేర పెరిగాయి.  


వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్‌ కారణంగా అమెరికాలో కరోనా కేసులు, ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్య ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్న విషయం తెలిసిందే. ‘‘డెల్టా వేరియంట్ కారణంగా అమెరికా ప్రజలు వణికిపోతున్నారు. దీనితో అనేక మంది టీకా వేసుకునేందుకు  ముందుకు వస్తున్నారు.’’ అని ఛేజ్ ఇన్వెస్టర్ సంస్థ అధ్యక్షుడు పీటర్ టెడ్ క్రజ్ పేర్కొన్నారు. ఛేజ్ ఇన్వెస్టర్ కౌన్సెల్ సంస్థకు కూడా ఫైజర్‌లో వాటాలు ఉన్నాయి. 

Updated Date - 2021-08-11T21:35:42+05:30 IST