రేపటి నుంచి పీజీ అడ్మిషన్లు

ABN , First Publish Date - 2021-01-17T04:53:16+05:30 IST

వీఎస్‌యూ కళాశాల, కావలిలోని పీజీ కేంద్రంలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

రేపటి నుంచి పీజీ అడ్మిషన్లు

20 నుంచి అనుబంధ పీజీ కళాశాలల్లో..

వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ వెల్లడి


వెంకటాచలం, జనవరి 16 :  వీఎస్‌యూ కళాశాల, కావలిలోని పీజీ కేంద్రంలో పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా ఈనెల 20వ తేదీ నుంచి అనుబంధ పీజీ కళాశాలల్లోని పీజీ కోర్సులకు అడ్మిషన్లు మొదలవుతాయన్నారు. పీజీలో చేరదలచుకున్న విద్యార్థులు యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్ష ర్యాంకు కార్డు, హాల్‌ టికెట్‌తోపాటు ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌, డిగ్రీ ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా తీసుకుని రావాలని ఆయన తెలిపారు. పదో తరగతి నుంచి అన్ని విద్యార్హతల సర్టిఫికెట్లు, స్టడీ సర్టిఫికెట్లు, ఐదు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, క్యాస్ట్‌, ఆదాయ ఽధ్రువీకరణ సర్టిఫికెట్‌, ఆధార్‌కార్డు కూడా తీసుకుని రావాలన్నారు. వాటన్నింటిని అడ్మిషన్‌ సమయంలో అందజేయాలని కోరారు. 


 రెండు కొత్త కోర్సుల ప్రారంభం


యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా రెండు కొత్త కోర్సులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. క్వాంటేటివ్‌ ఎకనామిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అనే సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు యూనివర్సిటీ కళాశాలలో ప్రారంభిం చామని, వాటికి కూడా అడ్మిషన్లు జరుగుతాయన్నారు. 


వర్సిటీ విద్యార్థులకు విద్యాదీవెన


యూనివర్సిటీ కళాశాల, కావలిలోని పీజీ కళాశాలతోపాటు ప్రభుత్వ కళాశాలల్లో పీజీ చదివే విద్యార్థులకు మాత్రమే జగనన్న విద్యాదీవెన (ఫీజు రీయింబర్స్‌మెంటు) వర్తిస్తుందని రిజిస్ర్టార్‌ తెలిపారు. 


 ఏర్పాట్లను పరిశీలించిన వీసీ


వర్సిటీలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ కోసం చేసిన ఏర్పాట్లను శనివారం వీఎస్‌యూ వీసీ రొక్కం సుదర్శనరావు, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయ కృష్ణారెడ్డి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుజాఎస్‌ నాయర్‌ పరిశీలించారు. 



డిగ్రీ అడ్మిషన్లకు గడువు పెంపు


వెంకటాచలం, జనవరి 16 : వీఎస్‌యూ అనుబంధ డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌ డిగ్రీ అడ్మిషన్ల గడువును ఈనెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు వీఎస్‌యూ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ లేబాకు విజయకృష్ణారెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.  పండుగ సెలవులను దృష్టిలో ఉంచుకొని ఓఏఎండీసీ పోర్టల్‌ ద్వారా నాలుగేళ్ల హానర్స్‌ డిగ్రీ ప్రొగ్రాంలో ప్రవేశానికి వెబ్‌ ఎంపికల నమోదు కోసం ఈనెల 21వ తేదీ వరకు  గడువు పొడిగించినట్లు తెలిపారు.ఈనెల 24వ తేదీ వరకు ఫేజ్‌ - 1 సీట్ల కేటాయింపు ఉంటుందని, ఈనెల 25 నుంచి 27వతేదీ వరకు కళాశాల ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసుకోవాలని తెలిపారు. 

Updated Date - 2021-01-17T04:53:16+05:30 IST