గందరగోళం

ABN , First Publish Date - 2021-11-11T14:15:53+05:30 IST

రాష్ట్రంలో..

గందరగోళం

పీజీ ప్రవేశాలు గందరగోళం

డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షలు ఇంకా ముగియలేదు

అయినా పోస్టు గ్రాడ్యుయేట్‌ కౌన్సెలింగ్‌ షురూ.. 

అధికారుల మధ్య సమన్వయ లోపం

వారి నిర్ణయాల వల్ల విద్యార్థుల్లో ఆందోళన..

పీజీ కోర్సుల్లో ఎలా చేరాలని ఆవేదన


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరాలనుకుంటోన్న విద్యార్థుల పాలిట అధికారుల నిర్ణయాలు శాపంగా మారుతున్నాయి. రాష్ట్రంలో పీజీ ప్రవేశాల ప్రక్రియలో గందరగోళం నెలకొంది. విశ్వవిద్యాలయాలు, కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ కన్వీనర్‌, ఇతర సెట్లకు సంబంధించిన కన్వీనర్ల మధ్య సమన్వయ లోపం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్సిటీల అధికారులు తీసుకునే నిర్ణయాలు ఒకరకంగా ఉంటుండగా, కామన్‌ పీజీ సెట్‌ కన్వీనర్‌ తీసుకుంటోన్న నిర్ణయాలు మరోరకంగా ఉండటంతో విద్యార్థులు నష్టపోతున్నారు. ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ విశ్వవిద్యాలయాలు ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మధ్య డిగ్రీకి సంబంధించిన 4, 5, 6 సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించాయి.


అయితే, సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉండటంతో చాలా మంది విద్యార్థులు పరీక్షలకు హజరు కాలేకపోయారు. కొవిడ్‌ బాధితులు, జ్వరంతో బాధపడుతున్న వారు పరీక్షలకు హజరు కావాల్సిన అవసరం లేదని, వారి కోసం సెప్టెంబరులో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తామని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతోన్న సమయంలోనే... ఓయూకి చెందిన ఆచార్య పాండురంగారెడ్డి కన్వీనర్‌గా పోస్టు గ్రాడ్యుయేట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సీపీజీఈటీ)-2021 నిర్వహిస్తామని ప్రకటన వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో సీపీజీఈటీతో పాటు ఈసెట్‌, లాసెట్‌, తదితర ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అక్టోబరులో సీపీజీఈటీ ఫలితాలు ప్రకటించారు.


అయితే, ఇదే సమయంలో, జనవరి-ఆగస్టు మధ్య సెమిస్టర్‌ పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థుల కోసం విశ్వవిద్యాలయాలు ప్రత్యేక ఇన్‌స్టంట్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాయి. అందులో భాగంగా ఉస్మానియా, తెలంగాణ విశ్వవిద్యాలయాలు సెమిస్టర్‌ 1, 3, 5, 6 రాయాల్సిన విద్యార్థుల కోసం బ్యాక్‌లాగ్‌, సెమిస్టర్‌, మేకప్‌ ఎగ్జామినేషన్స్‌ పేరిట  సెప్టెంబరు 30న నోటిఫికేషన్లు జారీ చేశాయి. నవంబరులోనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పాయి. అలాగే, కరోనా నేపథ్యంలో  పరీక్షలకు హాజరుకాని డిగ్రీ విద్యార్థుల కోసం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించింది. అయితే, ఇప్పటివరకు ఫలితాలు ప్రకటించలేదు. ఇక పాలమూరు, శాతవాహన, కాకతీయ విశ్వవిద్యాలయాలు కొవిడ్‌ నేపథ్యంలో పరీక్షలకు హజరుకాలేని వారికి, పరీక్షలకు హజరై ఫెయిల్‌ అయిన వారి కోసం ఇన్‌స్టంట్‌ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధవుతున్నాయి. 


ఆయా వర్సిటీల డిగ్రీ పరీక్షల ప్రక్రియ కొనసాగుతుండగానే అధికారులు సీపీజీఈటీ కింద పీజీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించారు. సీపీజీఈటీలో ర్యాంకు సాధించిన విద్యార్థులు శుక్రవారం (ఈనెల 12)లోపు ఆన్‌లైన్‌లో ర్యాంకు కార్డు, డిగ్రీ సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేసుకోవాలని సూచించారు. 14న వెరిఫికేషన్‌ పూర్తయిన విద్యార్థుల వివరాలను ప్రకటిస్తామని, 23న విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు. 30లోగా విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంది. 


ఒకవైపు డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షలకు అనుమతి ఇచ్చి, ఫీజు తీసుకుని, మరోవైపు సీపీజీఈటీ కౌనెల్సింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేయడంతో విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షల ఫలితాలు రాకముందే సీపీజీఈటీ కింద పీజీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించడం ఏంటని ఆవేదన చెందుతున్నారు. కొవిడ్‌ వల్ల డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలకు హజరుకాని వారు, ఉత్తీర్ణత సాధించని వారు ఇప్పుడు పీజీలో ఎలా చేరాలని ప్రశ్నిస్తున్నారు. తమ విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-11-11T14:15:53+05:30 IST