దీనావస్థలొ నేలకొండపల్లి సీహెచ్‌సీ.. పేరుకే 30 పడకల ఆసుపత్రి..

ABN , First Publish Date - 2020-08-14T18:46:59+05:30 IST

మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక దీనావస్థలో ఉంది. ఉన్న వైద్యులను డిప్యుటేషన్‌పై పంపి నేలకొండపల్లి సీహెచ్‌సీని కనీసం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం స్ధాయి కంటే

దీనావస్థలొ నేలకొండపల్లి సీహెచ్‌సీ.. పేరుకే 30 పడకల ఆసుపత్రి..

పదిమంది వైద్యులకు, ఉన్నది ముగ్గురే...!

మహిళా వైద్యురాలు అసలు లేరు....

ఇబ్బందులెదుర్కొంటున్న రోగులు


నేలకొండపల్లి(ఖమ్మం): మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక దీనావస్థలో ఉంది. ఉన్న వైద్యులను డిప్యుటేషన్‌పై పంపి నేలకొండపల్లి సీహెచ్‌సీని కనీసం ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం స్ధాయి కంటే దిగజార్చారంటే అధికారుల తీరును అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కోవిడ్‌ విజృంభిస్తున్న తరుణంలో వైద్యులు లేక రోగులు ప్రైవేటు వైద్యశాలలను, గ్రామీణ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవలనే వైద్యాధికారి కోవిడ్‌ బారిన పడి హోం క్వారంటైన్‌లో ఉన్నారు.


మూడు ఆరోగ్య కేంద్రాలు

 నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మూడు  రకాల హాస్పిటల్స్‌ నడుస్తున్నాయి. ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రం,సెమినిక్‌ సెంటర్‌లున్నాయి. అందులో పీహెచ్‌సీలో-3, సామాజిక ఆరోగ్య కేంద్రంలో-4, సెమినిక్‌ సెంటర్‌లో-3 వైద్యులు పని చేయాల్సి ఉంది. సెమినిక్‌ సెంటర్లో గైనకాలజిస్టు, పిల్లల వైద్యులు తప్పనిసరిగా ఉండాలి. కానీ ప్రస్తుతం నేలకొండపల్లిలో అన్ని రకాల విభాగాల్లో కలిపి కేవలం ముగ్గురంటే ముగ్గురే వైద్యులున్నారంటే, అందులో లేడీ డాక్టర్‌ లేరంటే నేలకొండపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రం పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.. 


మహిళా వైద్యులు లేక ఇక్కట్లు

నేలకొండపల్లి సీహెచ్‌సీలో పని చేసే మహిళా వైద్యురాలిని  జనవరిలో ఆరు పడకలున్న మంచుకొండ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రానికి డిప్యుటేషన్‌పై పంపారు. పక్కనే ఉన్న కూసుమంచిలో మహిళా వైద్యురాలుమాత్రం ఉన్నారు. కానీ 30 పడకలున్న నేలకొండపల్లిలో మాత్రం మహిళా వైద్యురాలు లేక పోవటం, ఉన్న వైద్యురాలిని డిప్యుటేషన్‌పై పంపటంలో మతలబు ఏమిటో జిల్లా ఉన్నతాధికారులకే తెలియాలి. ఇంకో వైద్యురాలు పీజీ చేయటానికి సెలవుపై వెళ్లటంతో నేలకొండపల్లి సీహెచ్‌సీలో మహిళా వైద్యురాలు లేకుండా అయ్యింది.


గర్భిణీల బాధలు..

నేలకొండపల్లి సీహెచ్‌సీలో గైనకాలజిస్టు లేక పోవటంతో గర్భిణీలు, మహిళా రోగుల బాధలు వర్ణనాతీతం. గైనకాలజిస్టు లేక పోవటంతో సీహెచ్‌సీలో అసలు ఒక్కటంటే ఒక్క డెలివరీ కూడా కావటం లేదంటే ఆశ్ఛర్యకరమే మరి. 2017 నుంచి నేలకొండపల్లిలో గైనకాలజిస్టు లేరంటే అతిశయోక్తి గాదు. గతంలో పీహెచ్‌సీగా ఉన్న సమయంలో నేలకొండపల్లి ప్రభుత్వ వైద్యశాల ఆపరేషన్లకు, డెలివరీలకు జిల్లాలోనే పేరు గాంచింది. కానీ ప్రస్తుతం పేరుకు సీహెచ్‌సీ అయినప్పటికీ వైద్యులు లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా, రోగులకు సరైన వైద్య సేవలు అందించ లేక పోతున్నది.


అవకాశాన్ని బట్టి పంపుతా...: జిల్లా వైద్య,ఆరోగ్యాధికారి మాలతి

నేలకొండపల్లి సీహెచ్‌సీలో వైద్యుల కొరతపైనా, ముఖ్యంగా మహిళా వైద్యురాలు లేక పోవటంపై ఆంధ్రజ్యోతి ఫోన్‌లో వివరణ కోరగా తనకు అన్నీ తెలుసని, అవకాశాన్ని బట్టి పంపుతానని చెప్పటం కొస మెరుపు. జిల్లా కలెక్టర్‌ స్పందించి నేలకొండపల్లి సీహెచ్‌సీకి వైద్యులను, ప్రధానంగా మహిళా వైద్యులను పంపాలని మండల వాసులు కోరుతున్నారు.

Updated Date - 2020-08-14T18:46:59+05:30 IST