ఒక వైపు టీకా.. మరోవైపు టెస్టులు

ABN , First Publish Date - 2021-05-17T05:41:04+05:30 IST

ఒక వైపు టీకా.. మరోవైపు టెస్టులు

ఒక వైపు టీకా.. మరోవైపు టెస్టులు
హన్మకొండ పోచమ్మకుంట అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఒకే చోట కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా నియంత్రణ వ్యాక్సిన్‌ కోసం రద్దీగా ఉన్న జనం దృశ్యం (ఫైల్‌)

పీహెచ్‌సీల్లో  గందరగోళ పరిస్థితి

వరంగల్‌ సిటీ, మే 16 : కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్‌ కార్యక్ర మం.. కరోనా నిర్ధారణ పరీక్షలు ఒకే చోట జరుగుతుండడం ఆందోళన కలిగి స్తోంది. ఇది ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల, ప్రభుత్వాస్పత్రుల్లో ఈ తరహా విధానంతో కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాక్సిన్‌ వేసుకునే వారు హెల్త్‌ సెంటర్‌కు వచ్చి లేని కరోనాను అంటించుకొనే ముప్పు ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వారికి ప్రమాదం ఎక్కవగా ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ సెంటర్లను ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. 

ప్రమాదకరంగా పీహెచ్‌సీలు

వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఏరి యా ఆస్పత్రులు, నగరంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ ఒకే చోట జరుగుతున్నాయి. వ్యాక్సిన్‌ వేసుకునే తొలి రోజు ల్లో ఈ సమస్య తీవ్రత తెలియలేదు. కానీ ఇప్పుడు ప్రజలు వ్యాక్సిన్‌ వేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ దశలో సెంటర్లలో వ్యాక్సిన్‌ కోసం వచ్చే వారి సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు కొద్ది అడుగుల దూరంలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. ఇది అత్యంత ప్ర మాదకరంగా మారింది. నిర్ధారణ పరీక్షల్లో చాలామందికి పాజిటివ్‌ రిపోర్టు వస్తోంది. ఈ క్రమంలో అ పక్కగానే వ్యాక్సిన్‌ కోసం నిలుచున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. తమకు కరోనా సోకుతుందనే ఆందోళనకు గురవుతున్నారు. 

పక్క పక్కనే..

పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌, కరోనా నిర్ధారణ పరీక్షల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఒకే సెంటర్‌లో అత్యంత సమీపంలో జరగడం వల్ల వ్యాక్సిన్‌ వేసుకునేందుకు వ రుసలో నిలుచునే వారు భయం భయంగా గడుపుతున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లకు పైబడిన వారు, వృద్ధులకు ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్ధారణ పరీక్షలకు కోసం వచ్చిన వారు పాజిటివ్‌తో ఉన్నట్లైతే వారి నుంచి కరోనా సోకే అవకాశం ఉంటుందంటున్నారు. పైగా సెంటర్లలో మాస్కు వేసుకోకుండా తుమ్మినా, దగ్గినా తుంపర్లు పడితే రిస్క్‌ ఎక్కువగానే ఉంటుందని వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఇంటికి వెళ్లినా ఎవరి నుంచి అయినా కరోనా సోకుతుందేమో అనే సందేహాలతో కొట్టుమిట్టాడే పరిస్థితికి గురవుతున్నారు. 

కర్ణాటక తరహా..

వ్యాక్సిన్‌, కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపే సెంటర్లను కర్ణాటక ప్రభుత్వం వేరు వేరుగా నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని వైద్య నిపుణులు రేకెత్తుతున్నారు. ఈ విధానం సురక్షితమైనదని స్పష్టం చేస్తున్నారు.  అక్కడి కళాశాలలు, పాఠశాలలు ఇతర భవనాలను సెంటర్లుగా ఏర్పాటు చేసి వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు చెబుతున్నారు. దీని ద్వారా బహుళ ప్రయోజనాలను ప్రస్తావిస్తున్నారు. ఉన్నతాధికారులు సత్వరమే చర్యలు తీసుకోని కర్ణాటక తరహాలో చర్యలు తీసుకుంటే జనానికి ప్రయోజనకరంగా ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2021-05-17T05:41:04+05:30 IST