ఫోన్‌...రేషన్‌!

ABN , First Publish Date - 2020-11-14T05:45:30+05:30 IST

బియ్యం కార్డుదారులందరికీ ఇకపై మొబైల్‌ ఫోన్‌ ఉండాల్సిందే. లేదంటే జనవరి నుంచి బియ్యం తీసుకోవడం కష్టమవుతుంది. ఇకపై రేషన్‌ పంపిణీకి ఒకరోజు ముందు ఆయా కార్డుదారుల మొబైల్‌ ఫోన్లకు ఓటీపీ నంబర్‌ వస్తుంది.

ఫోన్‌...రేషన్‌!

‘ఇంటి వద్దకే బియ్యం పంపిణీ’లో ప్రభుత్వం కొత్త నిర్ణయం

కార్డుదారుల చిరునామా, సెల్‌ఫోన్‌ నంబర్‌ను

మ్యాపింగ్‌ చేస్తున్న వలంటీర్లు

సెల్‌ ఫోన్‌ లేని వారికి ఇరుగుపొరుగు వారి ఫోన్‌ నంబర్‌ నమోదు

రేషన్‌ డెలివరీ ముందురోజు కార్డుదారుల సెల్‌ఫోన్‌కు ఓటీపీ

వలంటీరు సరకులు అందజేసిన తరువాత ఫోన్‌కు మెసేజ్‌

జనవరి నుంచి అమలుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు


విశాఖపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి):

బియ్యం కార్డుదారులందరికీ ఇకపై మొబైల్‌ ఫోన్‌ ఉండాల్సిందే. లేదంటే జనవరి నుంచి బియ్యం తీసుకోవడం కష్టమవుతుంది. ఇకపై రేషన్‌ పంపిణీకి ఒకరోజు ముందు ఆయా కార్డుదారుల మొబైల్‌ ఫోన్లకు ఓటీపీ నంబర్‌ వస్తుంది. ఇంటికి వచ్చి రేషన్‌ అందజేసే వలంటీర్‌కు ఆ ఓటీపీ నంబర్‌ చెప్పాలి. వలంటీర్‌ తన వద్ద వున్న మొబైల్‌ ఫోన్‌లో ఓటీపీ నమోదు చేసుకుని సరకులు ఇస్తారు. తరువాత సరకులు తీసుకున్నట్టు కార్డుదారుని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది.  


బియ్యం కార్డుదారులు రేషన్‌ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇంటి వద్దనే సరకులు అందజేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. దీనిని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బియ్యం కార్డుదారుల వివరాలను, వార్డు/గ్రామ వలంటీర్ల ఐడీకి అనుసంధానం (మ్యాపింగ్‌) చేస్తున్నారు. వలంటీర్లు ప్రస్తుతం తమ పరిధిలో బియ్యం కార్డు వున్న ప్రతి ఇంటికీ వెళ్లి, యాప్‌లో లొకేషన్‌ తీసుకుని కార్డుదారుని కుటుంబ వివరాలు, సెల్‌ఫోన్‌ నంబర్‌ను నమోదుచేసుకుంటున్నారు. అయితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, నిరుపేదలు, వృద్ధ దంపతుల్లో పలువురికి సెల్‌ఫోన్లు లేవు. ఇటువంటి వారికి ఇరుగుపొరుగున వుంటున్న వారి సెల్‌ఫోన్‌ నంబర్‌ తీసుకుని మ్యాపింగ్‌ చేస్తారు. సరకుల పంపిణీకి ఒకరోజు ముందు కార్డుదారుని సెల్‌ఫోన్‌కు ఓటీపీ ద్వారా సమాచారం వస్తుంది. కార్డుదారులు ఈ ఓటీపీ నంబర్‌ను రేషన్‌ అందజేయడానికి వచ్చిన వలంటీర్‌కు చెప్పాలి. వలంటీరు తన ఫోన్‌లో నమోదు చేసుకుని సరకులు ఇస్తారు. కాగా రేషన్‌ డిపో పరిధిలో వున్న కార్డుదారులందరికీ ఒకేరోజు సరకులు అందజేయరు. రోజూ 90 కార్డులకు సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  


అక్రమాలను అరికట్టడానికేనా....

రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసర సరకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికే ప్రభుత్వం నూతన విధానం (హోమ్‌ డెలివరీ) అమల్లోకి తెస్తున్నదని పౌర సరఫరాల అధికారులు చెబుతున్నారు. రేషన్‌ పంపిణీ ప్రారంభమైన వారం, పది రోజుల తరువాత డిపోలకు వెళ్లిన కార్డుదారులకు సరకులు అయిపోయాయని డీలర్లు చెబుతున్నారని, ఇకపై ఇటువంటి వాటికి ఆస్కారం లేదని అంటున్నారు. అంతేకాక రేషన్‌ డిపోల వద్ద సరకుల కోసం గంటల తరబడి వేచివుండాల్సి అవసరం కూడా ఉండదన్నారు. ఆయా రేషన్‌ డిపోల నుంచి కార్డుదారుల నివాస ప్రాంతాలకు సరకులు తరలించడానికి ప్రత్యేకంగా వాహనాలను సమకూరుస్తున్నారు. జిల్లాలో 12,51,513 బియ్యం కార్డులు వుండగా శుక్రవారం నాటికి 6.5 లక్షలు కార్డుల వివరాలను మ్యాపింగ్‌ చేశామని, రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని పౌర సరఫరాల శాఖ రూరల్‌ డీఎస్‌వో రొంగలి శివప్రసాద్‌ తెలిపారు. 


Updated Date - 2020-11-14T05:45:30+05:30 IST