Abn logo
Jul 19 2021 @ 02:07AM

ఇద్దరు కేంద్ర మంత్రుల ఫోన్లు హ్యాక్‌!

  • ముగ్గురు ప్రతిపక్ష ప్రముఖుల ఫోన్లూ
  • రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఫోన్‌ కూడా?
  • 40 మందికిపైగా పాత్రికేయుల ఫోన్లలోనూ
  • ఇజ్రాయెల్‌ సంస్థకు చెందిన స్పైవేర్‌ ఆనవాళ్లు
  • ‘ద వైర్‌’ వార్తాసంస్థ సంచలన కథనం
  • 2019లోనూ వార్తల్లోకి పెగాసస్‌ స్పైవేర్‌


న్యూఢిల్లీ, జూలై 18: భారత పాత్రికేయులు, మేధావులు, హక్కుల నేతల ఫోన్లను ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ ఎన్‌ఎ్‌సవో సంస్థ ‘పెగాసస్‌’ అనే స్పైవేర్‌ ద్వారా హ్యాక్‌ చేసిందంటూ 2019 అక్టోబరులో సంచలన కథనాలు వచ్చాయి గుర్తుందా? దాదాపు 18 నెలల తర్వాత ఆ ‘పెగాసస్‌’ స్పైవేర్‌ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. 40 మందికి పైగా భారతీయ పాత్రికేయులు, విపక్షాలకు చెందిన ముగ్గురు అతి పెద్ద నేతలు, రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక వ్యక్తి, ప్రస్తుత మోదీ సర్కారులోని ఇద్దరు మంత్రులు, వివిధ భద్రతా సంస్థలకు చెందిన మాజీ, ప్రస్తుత అధిపతు లు, పలువురు వ్యాపారవేత్తలు.. ఇలా మొత్తం 300 మంది పెగాసస్‌ ‘నిఘా’ జాబితాలో ఉన్నారంటూ ‘ద వైర్‌’ సంచలన కథనాన్ని ప్రచురించింది. జాబితాలో ఉన్న ఒక నంబరు సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జి పేరుతో నమోదై ఉందని.. అయితే, ఆయన ఆ నంబరును ఉపయోగిస్తున్నదీ లేనిదీ తెలియదని పేర్కొంది. 


ఆ జాబితాలో ఉన్న 10 మంది పాత్రికేయుల ఫోన్లకు ఫోరెన్సిక్‌ పరీక్షలు చేయించగా.. కొన్ని ఫోన్లు పెగాసస్‌ స్పైవేర్‌తో హ్యాక్‌ అయ్యాయని, కొన్నిటిపై హ్యాకింగ్‌కు ప్రయత్నించిన ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడించింది. ఫ్రాన్స్‌కు చెం దిన ఫర్‌బిడెన్‌ స్టోరీస్‌ అనే స్వచ్ఛంద మీడియా సంస్థ, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఈ జాబితాను సంపాదించి ‘ద వైర్‌’ సహా ప్రపంచవ్యాప్తంగా 15 వార్తాసంస్థలకు ఇచ్చినట్టు కథనంలో పేర్కొంది. తొలుత ఈ వార్త గురించి బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆదివారం ట్వీట్‌ చేశారు. కేంద్ర మంత్రుల ఫోన్లు, ఆరెస్సెస్‌ నేతలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఫోన్లూ ‘పెగాసస్‌’ నిఘా నీడలో ఉన్నాయన్నారు.  దీనిపై వాషింగ్టన్‌ పోస్ట్‌, గార్డియన్‌ తదితర పత్రికలు కథనాలను ప్రచురిస్తాయనే వదంతులు వినిపిస్తున్నాయని.. దీన్ని ధ్రువీకరించుకున్నాక ‘జాబితా’ను ప్రచురిస్తానని తెలిపారు. సాయంత్రానికి వాషింగ్టన్‌ పోస్ట్‌ ప్రచురించిన ఒక కథనం లింకును ట్యాగ్‌ చేశారు. అయితే, ఆ కథనం 3 రోజుల నాటిది. ఇజ్రాయెల్‌కు చెందిన ‘కాండిరు’ అనే సంస్థ పశ్చిమాసియా, ఆసియాదేశాల్లోని ప్రభుత్వాలకు నిఘా సాఫ్ట్‌వేర్‌ను విక్రయించిందనేది ఆ కథనం సారాంశం. 


బాధిత పాత్రికేయులు..

హిందుస్థాన్‌, టైమ్స్‌, ద హిందూ, ద వైర్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, న్యూస్‌ 18, ఇండియా టుడే, పయనీర్‌ పత్రికలకు చెందిన ప్రముఖ పాత్రికేయులు, పలువురు ఫ్రీలాన్స్‌ జర్నలిస్టులు, వ్యాసకర్తలు, ప్రాంతీయ భాషల కు చెందిన పలువురు ప్రముఖ పాత్రికేయుల ఫోన్లను ఈ స్పైవేర్‌తో హ్యాక్‌ చేసినట్టు ‘ద వైర్‌’ తెలిపింది. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కుమారుడు జే షా, ప్రధాని మోదీకి సన్నిహితుడైన వ్యాపారవేత్త నిఖిల్‌ మర్చంట్‌ల వ్యాపార కార్యకలాపాల గురిం చి కథనాలు రాసిన రిపోర్టర్‌ రోహిణి సింగ్‌ నంబర్‌ కూడా ఆ జాబితాలో ఉన్నట్టు తెలిపింది. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు వ్యాపారవేత్త అజయ్‌ పిరమల్‌కు మధ్య వ్యవహారాలపై ఆమె పరిశోధన చేస్తున్నప్పుడు ఈ హ్యాకింగ్‌ జరిగినట్టు తెలిపింది. అలాగే ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ మాజీ పాత్రికేయుడు సుశాంత్‌ సింగ్‌ పేరు కూడా 2018లో ‘పెగాసస్‌’ హ్యాకింగ్‌ జాబితాలో ఉన్నట్టు తెలిపింది. అప్పట్లో ఆయన రాఫెల్‌ ఒప్పందంపై పరిశోధన చేస్తున్న సంగతిని గుర్తుచేసింది. 


సుశాంత్‌ సింగ్‌ ఫోన్‌కు ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించగా.. ఈ ఏడాది మొదట్లో పెగాసస్‌ ఇన్ఫెక్షన్‌కు గురైన ఆనవాళ్లు కనిపించాయని తెలిపింది. అలాగే.. హిందుస్థాన్‌ టైమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ శిశిర్‌ గుప్తా, ఎడిటోరియల్‌ పేజ్‌ ఎడిటర్‌ ప్రశాంత్‌ ఝా, డిఫెన్స్‌ కరస్పాండెంట్‌ రాహుల్‌ సింగ్‌, కాంగ్రెస్‌ బీట్‌ చూసిన మాజీ పొలిటికల్‌ రిపోర్టర్‌ ఔరంగజేబ్‌, ఇండియన్‌ ఎక్స్‌ప్రె్‌సకు చెందిన రితికా చోప్రా, ముజమ్మిల్‌ జమీల్‌, ఇండియాటుడేకు చెందిన సందీప్‌ ఉన్నిథన్‌, టీవీ18కు చెందిన మనోజ్‌ గుప్తా, ద హిందూకు చెందిన విజైతా సింగ్‌, ద వైర్‌కు చెందిన సిద్ధార్థ్‌ వరదరాజన్‌, ఎంకే వేణు, దేవీరూప మిత్ర, ద వైర్‌కు వ్యాసాలు రాసే సీనియర్‌ కాలమిస్ట్‌ ప్రేమ్‌ శంకర్‌ ఝా, ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ స్వాతి చతుర్వేది, ఇంకా.. సైకత్‌ దత్తా, పరాంజయ్‌ గుహ, స్మిత శర్మ, ఎస్‌ఎన్‌ఎం అబ్ది, ఇఫ్తికార్‌ గిలానీ తదితరుల పేర్లు పెగాసస్‌ హ్యాకింగ్‌కు గురైనట్టుగా అనుమానిస్తున్న జాబితాలో ఉన్నట్టు పేర్కొంది. వీరిలో చాలా మంది ఫోన్లు 2018-19 మధ్య (2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు) హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలిపింది. కాగా, ఫోన్ల హ్యాక్‌పై కేంద్రం స్పందించింది. ‘‘వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లును ప్రవేశపెట్టాం. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి లేకుండా ఏజెన్సీలు నిఘా పెట్టవు. 2019లోనూ పెగాస్‌సతో హ్యాకింగ్‌ ఆరోపణలొ చ్చాయి. అవి నిరాధారమని వాట్సాప్‌ వంటి సంస్థలు సుప్రీంకోర్టుకు తెలిపాయి’’ అని ఐటీ శాఖ తెలిపింది. 

ఏమిటీ పెగాసస్‌?

ప్రభుత్వాలు ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తాయనే భయంతో చాలా మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు వాట్సాప్‌(ఆండ్రాయిడ్‌ ఫోన్లలో), ఫేస్‌టైమ్‌(ఐ ఫోన్లలో) వంటివాటి ద్వారా కాల్స్‌ చేస్తుంటారు. అలాంటి పటిష్ఠమైన ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌లనే ఎన్‌ఎ్‌సవో లక్ష్యంగా చేసుకుని వాటిలో ఉన్న లోపాల ఆధారంగా ఫోన్‌లో చొరబడే లా పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఇదంతా 2019 నాటి సంగతి. ఆ విషయం బయటపడ్డాక యాపిల్‌, వాట్సా్‌పలు తమ సాఫ్ట్‌వేర్‌లలోని సమస్యలను సవరించుకున్నా యి. కాబట్టి ఇప్పటి ఫోన్లకు పెగాస్‌సతో బాధ లేదు. పెగాసస్‌ స్పైవేర్‌ను కూడా ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా అప్‌డేట్‌ చేస్తే ప్రమాదమేగానీ.. అది సామాన్యులకు కాదు. బాగా ప్రముఖులు, వివాదాస్పద వ్యక్తులకే దాంతో ముప్పు. 


మన ఫోను మనది కాదు!

పెగాసస్‌ స్పైవేర్‌ చొరబడితే మన ఫోన్‌ మనది కానట్టే లెక్క! అది మన చేతిలోనే ఉన్నా హ్యాకర్లు దాన్ని పూర్తి గా నియంత్రించగలరు. మన ఫోన్‌లోని కెమెరాను యాక్టివేట్‌ చేసి, ఫొటోలు తీసుకోగలరు. మైక్రోఫోన్‌ను ఆన్‌ చేసి మన మాటలు వినొచ్చు. 2019లో ఇజ్రాయెల్‌ నిఘా సంస్థ ఎన్‌ఎ్‌సవో ఈ స్పైవేర్‌ను సౌదీఅరేబియా కోసం తయారు చేసినట్లు అనుమానించినా 20 దేశాలకు చెం దిన 1,400 మందిని టార్గెట్‌ చేశారు.