గ్లామర్‌ పెంచే ఫొటో యాప్స్‌

ABN , First Publish Date - 2020-09-12T05:30:00+05:30 IST

ఒకప్పుడు ఫొటోలను ప్రొఫెషనల్‌గా ఎడిట్‌ చెయ్యాలంటే కంప్యూటర్‌ మాత్రమే వాడేవారు.

గ్లామర్‌ పెంచే ఫొటో యాప్స్‌

ఒకప్పుడు ఫొటోలను ప్రొఫెషనల్‌గా ఎడిట్‌ చెయ్యాలంటే కంప్యూటర్‌ మాత్రమే వాడేవారు. చాలాకాలంగా స్మార్ట్‌ ఫోన్ల కోసం ఫొటో ఎడిటింగ్‌ అప్లికేషన్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే ఎడిట్‌ చేసిన ఫొటోలు కేవలం ఫోన్‌ స్ర్కీన్‌ మీద మాత్రమే మెరుగ్గా కనిపించేవి. కంప్యూటర్‌ లేదా పెద్ద స్ర్కీన్‌ మీద చూసినప్పుడు పిక్సలేట్‌ అయ్యేవి. దాంతో స్మార్ట్‌ఫోన్‌లో ఫొటో ఎడిటింగ్‌ జోలికి పెద్దగా వెళ్లేవారు కాదు. అయితే శక్తిమంతమైన గ్రాఫిక్స్‌ ప్రాసెసర్‌లతో కూడిన మొబైల్‌ ప్లాట్‌ఫారాలు అందుబాటులోకి రావటం, ర్యామ్‌ కూడా భారీగా పెరగడంతో ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ ఫొటో ఎడిటింగ్‌ ఊపందుకుంది. ఒక మామూలు వ్యక్తి మొదలుకొని ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ వరకు ఫొటోలను నాణ్యంగా ఎడిట్‌ చేయడం కోసం తమ దగ్గర కంప్యూటర్‌ లేకపోయినా ఎలాంటి సందేహం లేకుండా స్మార్ట్‌ ఫోన్‌ మీద పని చేసుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఫొటో ఎడిటింగ్‌ కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌లో లభించే కొన్ని అద్భుతమైన అప్లికేషన్స్‌ ఇప్పుడు చూద్దాం.



SnapSeed

గూగుల్‌ సంస్థ స్వయంగా తయారు చేసిన ఫొటో ఎడిటింగ్‌ అప్లికేషన్‌ ఇది. కెమెరా ద్వారా తీసిన ‘రా’ ఫైళ్లని కూడా ఇది ఎడిట్‌ చేయగలుగుతుంది. ఫొటోలో ఉండే లోపాలను సరిచేస్తుంది. లైటింగ్‌, ఎక్స్‌పోజర్‌ సరిగా లేకపోవడంతో కోల్పోయిన డీటెయిల్‌ను తిరిగి వెనక్కి తీసుకొచ్చి, ఫొటో మరింత మెరుగ్గా కనిపించేలా చేస్తుంది. మనకు నచ్చిన విధంగా పలురకాల ఎఫెక్టులతో టెక్స్ట్‌ జత చేస్తుంది. ఈ అప్లికేషన్‌లో భారీ మొత్తంలో ఫిల్టర్స్‌ ఉన్నాయి. ఫొటో ఎడిటింగ్‌ కోసం అందుబాటులో ఉన్న అత్యద్భుతమైన అప్లికేషన్‌గా దీన్ని పరిగణించవచ్చు. http://bit.ly/snapseedaj లింకు నుంచి ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్‌ చేసుకోవచ్చు.


Air Brush

సెల్ఫీలు ఎక్కువగా తీసుకునేవారికి ఉపయోగపడే అప్లికేషన్‌ ఇది. సెల్ఫీ తీసినప్పుడు మొహం మీదకు ముంగురులు వస్తే వాటిని చాలా సులభంగా సరి చేయవచ్చు. మొహంలో ఏమైనా చిన్నచిన్న లోపాలు ఉంటే వాటిని సరి చేయవచ్చు. మీ నువ్వు మరింత ఆకర్షణీయంగా ఉండేలా మార్చవచ్చు. ఇటువంటి ఎన్నో రకాల ఆప్షన్లు దీంట్లో లభిస్తాయి. మిగతా అప్లికేషన్లకు మించి భారీ మొత్తంలో బ్యూటీ ఫిల్టర్లు ఇందులో ఉన్నాయి. నచ్చిన విధంగా మేకప్‌ చేయటం మొదలుకుని కావలసిన విధంగా బ్యాక్‌ గ్రౌండ్‌ మార్చడం వంటి ఫలితాలను అందిస్తాయి. అయితే పూర్తి స్థాయి ఫొటో ఎడిటింగ్‌ సదుపాయాలు దీంట్లో ఉండవు. సెల్ఫీలను మెరుగ్గా తయారు చేసుకోవాలి అనుకునే వారి కోసమే ఈ అప్లికేషన్‌ బాగా ఉపయోగపడుతుంది.


Fotor

Pixlr మాదిరిగానే ఇది కూడా క్లౌడ్‌ ఆధారంగా పనిచేసే ఫొటోషాప్‌ లాంటి అప్లికేషన్‌. దాదాపు దీని స్వరూపం, లభించే సదుపాయాలు కంప్యూటర్లో మనం వాడే ఫొటోషాప్‌లానే ఉంటాయి. ఈ అప్లికేషన్‌తో ఫొటోల బ్రైట్నెస్‌, కాంట్రాస్ట్‌, శాట్యురేషన్‌, షాడోస్‌, హైలెట్స్‌, వాయిస్‌ వంటి వాటిని తగిన విధంగా సర్దుబాటు చేసుకోవచ్చు. ఫొటోలకు బోర్డర్‌లు, స్టిక్కర్లు జత చేసుకోవచ్చు. భారీ మొత్తంలో ఎఫెక్టులను దీంట్లో అందించారు. పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండానే ఒకే ఒక్క క్లిక్‌తో కావలసిన ఫలితాలు పొందే విధంగా 13 భిన్నమైన ఆప్షన్లు లభిస్తాయి. కచ్చితంగా ప్రయత్నించాల్సిన అప్లికేషన్‌ ఇది. గూగుల్‌ ప్లే స్టోర్‌ లో  ÌZ http://bit.ly/fotorajలింక్‌ నుంచి ఈ అప్లికేషన్‌ డౌన్లోడ్‌ చేసుకోవచ్చు.


ఎడిట్‌ చేసే ముందు!

ఫొటో ఎడిటింగ్‌ అప్లికేషన్ల ద్వారా ఫొటోల్లో ఉండే లోపాలు సరిచేసుకోవచ్చు. అంతే తప్పించి అసలు వాటి నాణ్యత బాగా లేకపోతే ఆశించినంత ఫలితాలు పొందలేం. అందుకే మీ ఫోన్‌ లో ఫొటోలు క్యాప్చర్‌ చేసేటప్పుడే హడావిడి పడకూడదు. లైటింగ్‌ మొదలుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తరవాత క్యాప్చర్‌ చేస్తే మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ఫొటో ఎడిటింగ్‌ అప్లికేషన్స్‌ మీద పూర్తిగా ఆధారపడితే కొన్ని సందర్భాల్లో అవి చూడటానికి కృత్రిమంగా అనిపిస్తాయి. ఫొటో ఎడిటింగ్‌ అప్లికేషన్లలో కనిపించిన ప్రతి ఫిల్టర్‌ ఇష్టమొచ్చినట్లు ఉపయోగించ కూడదు. కేవలం అవసరాన్ని బట్టి స్వల్ప     స్థాయిలో మాత్రమే వాటిని ఉపయోగించడం శ్రేయస్కరం. ఒరిజినల్‌ ఫొటోను జాగ్రత్తగా సేవ్‌ చేసుకోవాలి. కొన్నిసార్లు ఎడిటింగ్‌ తరవాత లభించిన ఫలితాలు కన్నా ఒరిజినల్‌ ఫొటోలు సహజ సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తాయి. అందుకే మీరు క్యాప్చర్‌ చేసిన ఒరిజినల్‌ ఫొటోలను జాగ్రత్తగా ఉంచుకోండి. 


మీ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తే ‘రా’ ఫార్మేట్‌లోని ఫొటోలను బైటకుతీసిన తరవాతే ఎడిటింగ్‌ చేయాలి. అప్పుడే పూర్తిస్థాయిలో అడ్జస్ట్‌మెంట్‌లు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.



Photo Director

కొన్నేళ్లుగా బాగా ప్రాచుర్యం చెందిన ఆండ్రాయిడ్‌ ఫొటో ఎడిటింగ్‌ అప్లికేషన్‌ ఇది. దీంట్లో అన్ని రకాల ప్రాథమికమైన ఫొటో ఎడిటింగ్‌ సదుపాయాలతో పాటు ఫొటో యానిమేషన్‌, గ్రేడియంట్‌ మాస్కులు ఉన్నాయి. ఈ అప్లికేషన్‌లో అంతర్గతంగానే స్టిక్కర్‌ మేకర్‌ వంటి అనేక శక్తిమంతమైన సదుపాయాలు కూడా లభిస్తుంటాయి. అలాగే ఫొటో ఎడిటింగ్‌ మీద పెద్దగా అవగాహన లేని వారి కోసం చాలా సులభంగా ఫలితాలు పొందడం కోసం ఒకే ఒక్క క్లిక్‌లో ఫొటోలను సరి చేసుకునే వెసులుబాటు కూడా దీంట్లో ఉంది. సుదీర్ఘకాలంగా కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లను అందిస్తున్న సైబర్‌ లింక్‌ సంస్థ సమకూర్చిన అత్యంత నాణ్యమైన అప్లికేషన్‌ ఇది. ప్రీమియం యూజర్ల కోసం భారీ మొత్తంలో ఫిల్టర్లు, ఎఫెక్టులు, స్టిక్కర్లు, ఫ్రేమ్‌లను అందిస్తోంది. ఒక ఫొటోలో ఉండే అవాంఛిత భాగాలను సులభంగా తొలగించటం, క్లోనింగ్‌ వంటి పలు రకాల ఆప్షన్లు దీంట్లో ఉంటాయి.http://bit.ly/photodirectoraj లింకులో ఈ అప్లికేషన్‌ మనకు లభిస్తుంది.


Pixlr

ఆండ్రాయిడ్‌ ఫోన్లు వాడే వారికి ఫొటోషాప్‌ మాదిరిగా పనితీరు అందించే మరో యాప్‌ Pixlr. దీంట్లో భారీ మొత్తంలో ఫిల్టర్లు, ఎఫెక్టులు, ఓవర్‌లేలు పొందుపరిచి ఉంటాయి. ఫొటోలను క్రాప్‌ చేయడం, రొటేట్‌ చేయడం, రెడ్‌ ఐ లోపాలను సరి చేయడం వంటి ప్రాథమికమైన ఫొటో ఎడిటింగ్‌ సదుపాయాలు అన్నీ దీంట్లో లభిస్తాయి. అంతే కాదు, పలు ఫొటోలను కలిపి ఫొటో కొలాజ్‌లు తయారు చేసుకోవడం, ఫొటోలకు నచ్చిన బోర్డర్స్‌ అమర్చుకోవడం వంటి సదుపాయాలు కూడా లభిస్తాయి. ఉచిత అలాగే పెయిడ్‌ వెర్షన్స్‌ ఇందులో ఉంటాయి. http://bit.ly/pixlraj అనే లింకులో మనకు ఈ అప్లికేషన్‌ లభిస్తుంది.


Photo Layers

కొన్ని సార్లు మనం తీసిన ఫొటోల్లో మనం వద్దు అనుకున్న అంశాలు కూడా వస్తూ ఉంటాయి. అలాటప్పుడు ఫొటోషాప్‌ వంటి సాఫ్ట్‌వేర్లతో కష్టపడి అలాంటి వాటిని తొలగించాల్సిన పనిలేదు. ఈ అప్లికేషన్‌తో ప్రయత్నించవచ్చు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌       

మొత్తాన్ని మార్చేయవచ్చు. ఆ స్థానంలో మనకు నచ్చిన బ్యాక్‌ గ్రౌండ్‌ను సులభంగా అమర్చుకోవచ్చు. గరిష్ఠంగా పదకొండు ఫొటోలను ఒకదానితో మరొకటి కలిపి ఫొటో మాంటేజ్‌ తయారు చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. కేవలం ఫొటో బ్యాక్‌గ్రౌండ్‌  విషయంలో మాత్రమే ఈ అప్లికేషన్‌ ఉపయోగపడుతుంది. పూర్తిస్థాయి ఫొటో ఎడిటింగ్‌ ఆప్షన్లు కావాలంటే ఇంతకు ముందు చెప్పిన అప్లికేషన్స్‌ మెరుగ్గా ఉంటాయి.  http://bit.ly/photolayersaj  లింక్‌ నుంచి ఈ అప్లికేషన్‌ డౌన్లోడ్‌ చేసుకోవచ్చు.



నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar

Updated Date - 2020-09-12T05:30:00+05:30 IST