గోడలపై అత్యాచార దోషుల ఫొటోలు

ABN , First Publish Date - 2020-09-25T06:51:56+05:30 IST

మహిళలపై నేరాలను కట్టడి చేయడంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది...

గోడలపై అత్యాచార దోషుల ఫొటోలు

మహిళలపై నేరాల కట్టడికి యూపీ సీఎం నిర్ణయం 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: ఉత్తరప్రదేశ్‌లో ఇక మహిళవైపు చూడాలంటేనే నేరగాళ్లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారేమో! ఎందుకంటే అక్కడ ఎవరైనా నేరానికి పాల్పడితే వారి గురించి ప్రజలందరికీ తెలిసిపోయి ఛీత్కారాల వెల్లువను భరించక తప్పదు. ఈవ్‌ టీజర్లు, అత్యాచార కేసుల్లో దోషులుగా ఎవ్వరు తెలినా వారి ఫొటోలు యూపీ రోడ్ల ప్రధాన కూడళ్లలోని గోడలపై ప్రత్యక్షం కానున్నాయి. గోడలకు అతికించిన ఫొటోల కింద నిందితుడి పేరు, ఇతర వివరాలను రాస్తారు. ఆ ఫొటోలను చూసిన ప్రజలకు సమాజానికి చీడపురుగులుగా దాపురించిన నేరస్తుల గురించి తెలుస్తుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. మహిళలపై నేరాలను కట్టడి చేయడంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళలపై నేరాలకు పాల్పడేవారి కోసం ‘ఆపరేషన్‌ దురాచారి’ కార్యక్రమాన్ని చేపట్టాలని పోలీసులను సీఎం యోగి ఆదేశించారు. రాష్ట్రంలో మహిళపై నేరాలు జరిగితే బీట్‌ ఇన్‌చార్జి, చౌకీ ఇన్‌చార్జి, స్టేషన్‌ అధికారిని బాధ్యత వహించాలని యోగి స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం పనిచేస్తున్న యాంటీ రోమియో స్వాడ్స్‌ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. 

Updated Date - 2020-09-25T06:51:56+05:30 IST