బెంచ్‌కి ఒక్కరే..

ABN , First Publish Date - 2020-05-30T09:20:57+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన పదో తరగతి పరీక్షలు పునఃప్రారంభం కానున్నాయి.

బెంచ్‌కి ఒక్కరే..

టెన్త్‌ పరీక్షల్లో పాటించనున్న భౌతికదూరం

ఉన్న పరీక్షా కేంద్రాలు రెట్టింపు

హాజరు కానున్న 48,252 మంది విద్యార్థులు

విద్యార్థుల కోసం 50 వేల కాటన్‌ మాస్క్‌లు 

ప్రతి కేంద్రానికి ఎఎన్‌ఎం ఏర్పాటు

థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేశాకే హాలులోకి అనుమతి

టెంపరేచర్‌ ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక రూం


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన పదో తరగతి పరీక్షలు పునఃప్రారంభం కానున్నాయి. జూన్‌ 8న మొదలై జూలై 5వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9-30 నుంచి 12-14 గంటల వరకు పరీక్ష జరగనుంది. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఇచ్చారు. మార్చిలో కేవలం తెలుగు, హిందీ పరీక్షలు జరిగాయి. కరోనా ఉధృతి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకనుగుణంగా, కొవిడ్‌-19 నిబంధనలకు లోబడి తిరిగి పది పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.


ఈమేరకు జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న 208 సెంటర్లకు అదనంగా మరో 208 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రాల భవనాల్లోనూ, అలాగే గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రానికి అరకిలోమీటర్‌ లోపల కొత్తగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 416 కేంద్రాల్లో 48,252 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. గతంలో బేంచ్‌కి ఇద్దరు విద్యార్థులను కూర్చోబెట్టగా.. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఒక్కరినే కూర్చోబెట్టనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు భౌతికదూరం పాటించాలనే నిబంధన అమలు చేసేందుకు పరీక్షా కేంద్రాలను పెంచి ఒక్కో గదికి 10-12 మంది విద్యార్థులు కూర్చోబెట్టనున్నారు.


ప్రతిరోజూ శానిటైజ్‌

పరీక్షా కేంద్రాలను ప్రతిరోజూ శానిటైజ్‌ చేయడంతోపాటు విద్యార్థులకు మాస్కులను అందజేస్తారు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసిన తరువాతే పరీక్షా కేంద్రం లోపలికి పంపిస్తారు. విద్యార్థులను గంట ముందే సెంటర్‌లోకి అనుమతించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్‌-19తో విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహన కల్పించనున్నారు. స్టూడెంట్స్‌ సెంటర్లకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను నడపడానికి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ చర్యలు తీసుకుంటున్నారు. 


ప్రతి కేంద్రానికి ఏఎన్‌ఎం 

పరీక్షకు హాజరయ్యే విద్యార్థి ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరంతో ఉన్నట్లయితే వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్షలు రాయించనున్నారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఏఎన్‌ఎంను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది ప్రత్యేక మాస్కులు, గ్లౌజ్‌లను ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులకు మాస్క్‌లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కాటన్‌ దుస్తులతో కుట్టించిన 50 వేల మాస్కులను సిద్ధం చేశారు. ప్రతి కేంద్రం వద్ద శానిటైజర్లు, సబ్బులు అందుబాటులో ఉంచనున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్‌, తాగునీటి వసతితోపాటు ఇతర ఏర్పాట్లను చేస్తున్నారు. 


ఆన్‌లైన్‌లో పాఠాలు

పదో తరగతి విద్యార్థులు రెండు సబ్జెక్టుల పరీక్షలు రాసి మిగిలిన పరీక్షలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ విరామ సమయంలో స్కూళ్ల యాజమాన్యం విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు రివిజన్‌ చేస్తున్నారు. యూట్యూబ్‌తోపాటు టీశాట్‌ ద్వారా ఉదయం, సాయంత్రం వేళలో గంట చొప్పున పాఠాలు బోధిస్తున్నారు. ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులో లేని పిల్లలకు కేబుల్‌ ఆపరేటర్ల సహాయంతో లోకల్‌ ఛానల్‌లో పాఠాలు బోధిస్తున్నారు. జిల్లాలోని పది మండలాల్లో డిష్‌ ద్వారా సబ్జెక్టులు బోధించేలా చర్యలు తీసుకుంటున్నారు.


‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి: జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

వచ్చేనెల 8వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. టెన్త్‌ పరీక్షలపై శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో వాయిదా పడిన పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో హెల్ప్‌డె్‌స్కలను ఏర్పాటు చేయాలని, ప్రతి పరీక్షా సెంటర్‌కు ఒక ఏఎన్‌ఎంను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.


ప్రతి విద్యార్థికి థర్మల్‌ స్ర్కీనింగ్‌ తప్పనిసరిగా చేయాలని సూచించారు.  అన్ని రెసిడెన్షియల్‌ పాఠశాలల విద్యార్థుల కోసం పరీక్ష కేంద్రాల వరకు ఆర్టీసీ బస్సులను నడిపించాలన్నారు. పది పరీక్షలకు అదనంగా సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాలను రెండు రోజుల ముందుగానే విద్యార్థుల తల్లిదండ్రులు చూసుకోవాలని చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు. 


టెన్త్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నాం

వచ్చే నెలలో నిర్వహించే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈసారి మంచి ఫలితాలు సాధిస్తాం. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న పరీక్షా కేంద్రాలు రెట్టింపయ్యాయి. బేంచ్‌కి ఒకరు మాత్రమే కూర్చునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 50 వేల మాస్క్‌లు, శానిటైజర్లు, పరీక్షా కేంద్రానికి ఒక టెస్టింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేస్తున్నాం. టెంపరేచర్‌ ఎక్కువగా ఉన్న పిల్లలకు ప్రత్యేకంగా ఒక రూము ఏర్పాటు చేస్తున్నాం.

Updated Date - 2020-05-30T09:20:57+05:30 IST