ఆధ్యాత్మిక సౌరభం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం

ABN , First Publish Date - 2020-11-21T04:42:03+05:30 IST

కార్తీక మాసం వచ్చిందంటే మండలంలోని ఆరిపాక శివారు యాతపాలెం ధర్మకోనేరులోని గౌరీ పరమేశ్వరుల సహిత జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం భక్తులతో కళకళలాడు తుంటుంది.

ఆధ్యాత్మిక సౌరభం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం

 కార్తీక మాసంలో విశేష పూజలు

 20 అడుగుల గౌరీ పరమేశ్వరుల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణ

 పిక్నిక్‌ స్పాట్‌గా ప్రసిద్ధి


సబ్బవరం, నవంబరు 20 : కార్తీక మాసం వచ్చిందంటే మండలంలోని ఆరిపాక శివారు యాతపాలెం ధర్మకోనేరులోని గౌరీ పరమేశ్వరుల సహిత జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం భక్తులతో కళకళలాడు తుంటుంది. విశాఖతో పాటు మండలంలోని నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ధర్మకోనేరులో ఏర్పాటు చేసిన 20 అడుగుల ఎత్తులో గల గౌరీ పరమేశ్వరుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు కోనసీమను తలపించేలా కోనేరు చుట్టూ కొబ్బరి చెట్లు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. కార్తీక మాసంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి పిక్నిక్‌కు వస్తుంటారు. గత మూడేళ్లుగా ఈ క్షేత్రం విశేష ప్రాచుర్యం పొందింది. 


ఎక్కడా లేని విధంగా.. 

ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా కాశీ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన శ్రీసోమనాథుడు, మల్లికార్జునుడు, మహా కాళేశ్వరుడు, ఘృషేశ్వరుడు, ఓం కారేశ్వరుడు, కేదారేశ్వరుడు, శ్రీత్రయంబకేశ్వరుడు, వైద్యనాఽథుడు, భీమశంకరుడు, విశ్వేశ్వరుడు, నాగేశ్వరుడు, శ్రీరామేశ్వరుడు( ద్వాదశ జ్యోతిర్లింగాలు) ధర్మకోనేరుకు ఒక వైపున గౌరీ పరమేశ్వరుల ప్రతిమలకు ఎదురుగా ప్రతిష్ఠించడంతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. చుట్టూ పంట పొలాలు, కొబ్బరితోటలతో పచ్చదనం పరిఢవిల్లుతుండడంతో అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. కార్తీక మాసంలో రోజూ వేకువజామున నాలుగు గంటల నుంచి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయని నిర్వాహకులు తెలిపారు.


ఎలా చేరుకోవాలంటే.. 

గౌరీ పరమేశ్వరుల ద్వాదశ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రానికి విశాఖ నుంచి 300 నంబరు గల ఆర్టీసీ బస్సు, చోడవరం వెళ్లే అన్ని బస్సుల ద్వారా చేరుకోవచ్చు. ఆరిపాక సమీపంలో చినయాతపాలెం వద్ద బస్సు దిగితే ఒక కిలో మీటరు దూరంలో ఈ పుణ్యక్షేత్రం దర్శనమిస్తుంది. సబ్బవరం నుంచి అన్ని వేళల్లో ఆటోలు అందుబాటులో ఉంటాయి. 

Updated Date - 2020-11-21T04:42:03+05:30 IST