శిలలపై జగనన్న చిత్రాలు

ABN , First Publish Date - 2020-10-22T08:53:50+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను చరిత్రలో చిరస్థాయిగా నిలిపేలా సర్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమ య్యే సమగ్ర

శిలలపై జగనన్న చిత్రాలు

గ్రాండ్‌లుక్‌ కోసం గ్రానైట్‌ రాళ్లపై చెక్కిస్తున్న సర్వే విభాగం అధికారులు

సర్వే హద్దులకు ఈ రాళ్లు వినియోగం!

నేడు సీఎం సమక్షంలో సర్వేపై సమీక్ష


(ఒంగోలు-ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను చరిత్రలో చిరస్థాయిగా నిలిపేలా సర్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమ య్యే సమగ్ర భూసర్వేలో జగన్‌ బొమ్మలతో కూడి న సరిహద్దు రాళ్లను డిజైన్‌ చేయించారు. అవి అలాంటివీ, ఇలాంటివీ కాదు. ప్రకాశంజిల్లాలో పేరుమోసిన చీమకుర్తి గ్రానైట్‌ రాయిపై జగన్‌ బొమ్మలను చిత్రించి ప్రత్యేక ఆకర్షణగా రూపొందించారు. గురువారం అమరావతిలో సీఎం జగన్‌ వద్ద జరిగే రీ సర్వే సమావేశంలో వీటిని ప్రదర్శించేందుకు కొన్ని మోడల్స్‌ను తీసుకెళ్లారు. వీటికి సీఎం జగన్‌, ఆయన కార్యాలయం ఆమోదం ఉం దా? లేక సీఎం మెప్పు కోసం సర్వే అధికారులే ఇ లాంటివి చేయించారా? అన్నది తేలాల్సి ఉంది. గతంలోనూ ఇంటిస్థలాల లేఅవుట్‌లపై మండలం వారీగా ఖరీదైన కరిజ్మా ఫొటో అల్బమ్‌లు తయా రు చేయించి పంపించాలని, వాటిని సీఎంకు నివేదించాల్సి ఉంటుందని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సమగ్ర భూసర్వే పైలెట్‌ ప్రాజెక్టును కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మం డలం తక్కెళ్లపాడులో నిర్వహించింది. ఈ పైలెట్‌ ఫలితాల్లో 90శాతంపైగా తప్పులు వచ్చినట్లుగా అధికారులు ఇచ్చిన నివేదికే చెబుతోంది. సర్వే పుణ్యమాని, చివరకు ప్రభుత్వ భూమీ కొంత మేర తగ్గిపోయింది. ఇ క రైతుల భూముల విస్తీర్ణం లో భారీ తేడాలు చూపించా రు.


ఈ సమస్యలను పరిష్కరించాలని, మరోవైపు వచ్చే జనవరి నుంచి రాష్ట్రమంతా సమగ్ర సర్వే చేపట్టాలని సీఎం పిలుపునిచ్చారు. పైలెట్‌ ప్రాజెక్టులో దొర్లిన తప్పులను సరిదిద్ది రైతులకు ఉపశమనం కల్పించాల్సిన అధికారులు.. అది వదిలేసి సీఎంను ప్రసన్నం చేసుకోవడంపైనే శ్రద్ధ పెట్టినట్టు ఉంది. సర్వే సరిహద్దు రాళ్లపై ఆయన బొమ్మలను చిత్రించాలని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినట్లుగా తెలిసింది. రెండు పెద్దవి, మరో మూడు చిన్న రాళ్లను డిజైన్‌ చేయించారు. 


ఐదు కోట్ల రాళ్లు కావాలేమో!

సహజంగా సరిహద్దులకోసం కొండలు, గుట్టల నుంచి తీసే రాళ్లను డిజైన్‌ చేయిస్తుంటారు. ఈ రాతి రాళ్ల ఖరీదు చాలా తక్కువ. కానీ సీఎం గుడ్‌లుక్స్‌లో పడేందుకు ప్రకాశంలో ప్రసిద్ధిచెందిన గ్రానైట్‌ రాళ్లను ఎంచుకున్నారు. అధికారుల హడావుడి చూస్తుంటే జగన్‌ ఫొటోల కోసం రాష్ట్రమంతా గ్రానైట్‌ రాళ్లనే సరిహద్దులకోసం ఉపయోగించుకుంటారా? అన్న చర్చసాగుతోంది. నాలుగు అడుగుల పొడవు ఉన్న ఒక పెద్ద రాయిపై ఏపీ ప్రభుత్వ ఎంబ్లమ్‌ బొమ్మ వేశారు. అదే రాయిపై ఒక వైపున బాణం గుర్తు, మరోవైపున సమగ్ర భూ సర్వే 2021 అని రాయించారు. మరో రాయిని ప్రత్యేకంగా సీఎం జగన్‌ బొమ్మతో డిజైన్‌ చేయించారు. ముందుభాగాన సీఎం ఫొటో, ఎడమ భాగాన బాణం గుర్తు, కుడివైపు సమగ్ర  భూ సర్వే-2021 అని రాయించారు. రెండున్నర అడుగులు పొడవు ఉన్న 3 చిన్న గ్రానైట్‌ రాళ్లపై ఏపీ ప్రభుత్వం, సమగ్ర భూ సర్వే-2021 అని రా యించారు. రాష్ట్రంలో 1.35 కోట్ల సర్వే నంబర్లు న్నాయి. 49 లక్షల భూమి చిత్రపటాలు, 1.59 కోట్ల సబ్‌ డివిజన్‌లున్నాయి.


సగటున ఒక్కో సర్వే నంబర్‌కు 4 సరిహద్దు రాళ్లు వేసినా 1.35 కోట్ల సర్వే నంబర్లకు కనీసం 5 కోట్లపైనే సరిహద్దు రా ళ్లు కావాలి. ఇవి కాకుండా అటవీ, ప్రభుత్వ భూ ములతోపాటు గ్రామ సరిహద్దులకూ అవసరమే. వీటన్నింటికి గ్రానైట్‌ రాళ్లనే వినియోగిస్తారా? అన్న చర్చసాగుతోంది. సాధారణ రాళ్లపై మనుషుల ఫొటోలు, గుర్తులు సరిగ్గా కనిపించవు. మనుషుల చిత్రపటాలు, ప్రభుత్వ గుర్తులు గ్రానైట్‌ రాళ్లపైనే బాగా కనిపిస్తాయి. ఒక్కో రాయి ఖరీదు వేలల్లోనే ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు సమగ్ర సర్వేకు గ్రానైట్‌ సరిహద్దు రాళ్లను ఎంపిక చేస్తుందా? ఇంత ఖర్చును భరించే శక్తి ఉందా? అన్న చర్చ సాగుతోంది. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు ఖరీదైన గ్రానైట్‌ రాయితో శిలాఫలకం ఏర్పాటు చే స్తుంది. దానిపై పేర్లు, చిత్రపటాలు వేస్తారు.  ఇప్పుడు సర్వేకు ఉపయోగించే సరిహద్దురాళ్లపై కూడా అధికారులు సీఎం ఫొటో వేయడం చర్చనీయాంశంగా మారింది. సీఎంవో నుంచి ఎలాంటి ఆదేశాలు రాకుండానే ఓ సర్వే అధికారి అత్యుత్సాహంతో వీటిని తయారు చేయించారన్న చర్చ నడుస్తోంది. 

Updated Date - 2020-10-22T08:53:50+05:30 IST