పోస్టు కోసం పైరవీలు

ABN , First Publish Date - 2021-10-26T06:12:33+05:30 IST

ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమించేస్తాడని విశ్వసించే దేవదాయ శాఖకు చెందిన కొంతమంది ఉద్యోగులు...కింద పడినా తమదే పైచేయి కావాలని రాజకీయ పైరవీలు చేస్తున్నారు.

పోస్టు కోసం పైరవీలు
సాయిరెడ్డికి దర్బారులో తల్లితో కలిసి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరాజు

విశాఖలో పోస్టింగ్‌ కోసం అధికార పార్టీ పెద్దల చుట్టూ దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరాజు ప్రదక్షిణలు

అనేక ఆరోపణలపై మూడు నెలల క్రితం సస్పెన్షన్‌

విచారణ పూర్తికాకుండా మళ్లీ పోస్టింగ్‌ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న అదే శాఖ సిబ్బంది


విశాఖపట్నం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి):

ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమించేస్తాడని విశ్వసించే దేవదాయ శాఖకు చెందిన కొంతమంది ఉద్యోగులు...కింద పడినా తమదే పైచేయి కావాలని రాజకీయ పైరవీలు చేస్తున్నారు. హుండీల సొమ్ము పక్కదారి, సంబంధం లేని డివిజన్లపై పెత్తనం, ఉన్నతాధికారుల సమావేశాలకు అనధికారికంగా హాజరుతో పాటు అనేక ఆరోపణలపై సస్పెండైన ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరాజు విశాఖపట్నంలోనే మళ్లీ పోస్టింగ్‌ కావాలని పట్టుబడుతున్నారు. ఆయన్ను మూడు నెలల క్రితం (జూలై 19న) నాటి డిప్యూటీ కమిషనర్‌ పుష్పవర్దన్‌ 20కి పైగా అంశాలపై వివరణ కోరుతూ సస్పెండ్‌ చేశారు. అనకాపల్లి డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే శ్రీనివాసరాజుకు స్వప్రయోజనాలు ఆశించి ఉన్నతాధికారులు మూడు పోస్టులు కట్టబెట్టారు. దాంతో ఆయన జిల్లా అంతటా వ్యవహారాలు చక్కబెట్టారు. విశాఖలోనే ఎక్కువ కాలం గడిపారు. తన నుంచి శ్రీనివాసరాజు రూ.8.5 లక్షలు తీసుకొని ఓ అధికారికి ఇచ్చారంటూ...ఇటీవల నర్సీపట్నం ఆలయ ఈఓ శర్మ మీడియా ముందు ఆరోపించారు. ఇలాంటి అనేక ఆరోపణలపై శ్రీనివాసరాజు సస్పెండయ్యారు. మళ్లీ ఆర్డర్‌ వచ్చేంత వరకు హెడ్‌ క్వార్టర్‌ అయిన అనకాపల్లిలో రోజూ రిజిస్టర్‌లో సంతకం చేయాలని డీసీ ఆదేశిస్తే దానిని ఉల్లంఘించారు. కొద్దిరోజులు అక్కడకు వెళ్లి, డీసీఇక్కడ నుంచి వెళ్లిపోగానే విశాఖలోని ఏసీ కార్యాలయంలో సంతకాలు చేస్తున్నారు. తాజాగా అనకాపల్లికి శ్రీధర్‌ను ఇన్‌స్పెక్టర్‌గా నియమించడంతో గత మూడు రోజులుగా శ్రీనివాసరాజు ఇక్కడికే వస్తున్నారు. తన సస్పెన్షన్‌ అక్రమమని, ఎత్తేయాలని ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దీంతో సస్పెన్షన్‌ను ఎత్తేయాలని, విశాఖపట్నంలో ఖాళీగా వున్న ఇన్‌స్పెక్టర్‌ పోస్టు ఇవ్వాలని పైరవీలు చేస్తున్నారు. అధికార పార్టీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీతమ్మధారలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌కు శనివారం తన తల్లితో సహా వెళ్లి...విశాఖపట్నంలో పోస్టింగ్‌ ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. దానికి ఆయన విశాఖలో అంటే కష్టమని, ఎక్కడ ఇస్తే అక్కడే చేసుకోవాలని సూచించారు. శ్రీనివాసరాజు తల్లి కల్పించుకొని, తనకు ఆరోగ్యం బాగుండడం లేదని, తన కుమారుడిని విశాఖపట్నంలోనే వుంచాలని వేడుకున్నారు. దాంతో సాయిరెడ్డి ‘పరిశీలించండి’ అంటూ నోట్‌ రాసి కలెక్టరేట్‌కు పంపించారు. 


జీతాల బిల్లు మళ్లీ చేసింది ఆయనే

శ్రీనివాసరాజు పేరుకు సస్పెన్షన్‌లో ఉన్నా...ఆ శాఖకు సంబంధించిన వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. ఈ విషయం ఇంతకు ముందే ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించింది. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో అదే తంతు కొనసాగుతోంది. తాజాగా అక్టోబరు నెలకు సంబంధించిన సిబ్బంది జీతాల బిల్లును సోమవారం ఆయనే తయారుచేశారు. గతంలో కూడా ఆయన చేతులమీదుగానే ఆ వ్యవహారం నడిచింది. కొద్దిరోజుల క్రితం నగరంలో పనిచేస్తున్న ఆలయ ఈఓలు కొందరిని కలిసి, తనకు విశాఖలో పోస్టింగ్‌ వచ్చేందుకు సహకరిస్తే...బిల్లులన్నీ కొర్రీలు లేకుండా క్లియర్‌ చేస్తానని, ఏమైనా పెట్టుకోవచ్చునని ఆఫర్‌ ఇచ్చారు. అయితే...అన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై విచారణ పూర్తి కాకముందే...మళ్లీ పోస్టింగ్‌ ఎలా ఇస్తారని ఆ శాఖలోని ఉద్యోగులు కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆయన్ను విశాఖలో వేస్తే...మళ్లీ ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు.  

Updated Date - 2021-10-26T06:12:33+05:30 IST