పిగ్‌బాసులు

ABN , First Publish Date - 2021-06-17T05:34:17+05:30 IST

పిగ్‌బాసులు

పిగ్‌బాసులు

పందులను పట్టుకోవడంతో ప్రత్యేక గుర్తింపు

రాష్ట్రంలోని అన్ని నగరాల్లో చెన్నై-ఆపరేషన్‌

నగరంలో మూడు రోజులుగా పందుల ఏరివేత ప్రక్రియ

వారు బలవంతులు కాదు. బక్క పలచగా ఉంటారు. చిన్న గాయమైనా తట్టుకోలేనంతగా వారి శరీరతత్వం ఉంటుంది. వాళ్ల పరుగు చూస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. తుప్పలు ఉన్నా.. బురద పారుతున్నా.. అవలీలగా అడుగులు వేసేస్తారు. వల బరువెక్కే వరకూ విశ్రమించరు. చెన్నై పిగ్‌ పికర్స్‌ స్టైల్‌ ఇది. వల పట్టుకుని బరిలోకి దిగారంటే ఎంతటి బలమైన పందులనైనా అవలీలగా ఎత్తుకొస్తారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న పందులను ఏరివేయడానికి తమిళనాడు నుంచి వచ్చింది ఈ టీమ్‌. 

ఆంధ్రజ్యోతి, విజయవాడ సిటీలైఫ్‌ : నగరంలో చెన్నై ‘పిగ్‌ ఆపరేషన్‌’ మొదలైంది. మూడు రోజులుగా సుమారు 400 పందులను పట్టుకుని చెన్నైకు తరలించారు. ఈ బ్యాచ్‌లో ఉన్న వారంతా పందుల పెంపకందారులే. పందులను పట్టుకోవడంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. పెంపకంలో ఉన్న అనుభవమే వాటిని పట్టు కోవడంలో నైపుణ్యాన్ని తీసుకొచ్చింది. ఉదయం ఎనిమిది గంటలకు రంగంలోకి దిగితే సాయంత్రానికి కనీసం 100 పందులకు తక్కువ కాకుండా పట్టుకుంటారు. పందులు, వాటి వయస్సును బట్టి బరువును కలిగి ఉంటాయి. గరిష్టంగా పెద్ద పందులు 200 కిలోల వరకు ఉంటాయి. అటువంటి పందులనూ అవలీలగా ఎత్తుకొస్తారు. ఇలా పట్టుకున్న పందులను భద్రత మధ్య తమిళ నాడుకు తరలిస్తారు. పందులతో ఇక్కడి నుంచి వెళ్లే వ్యాన్‌కు విజయవాడ పోలీసులు ఎస్కార్ట్‌ ఇస్తున్నారు. నెల్లూరు సరిహద్దు వరకు ఈ సదుపాయం ఉంటుంది. అక్కడి నుంచి తమిళనాడులో ఉన్న వివిధ అడవుల్లో ఈ పందులను వదిలిపెడతారు. 

నగరంలో 3వేల వరాహాల సంచారం

నగరంలో పందుల సంఖ్య 3వేలకు పైగా ఉంటుందని అంచనా. అజిత్‌సింగ్‌నగర్‌, వాంబేకాలనీ, న్యూ ఆర్‌ఆర్‌పేట, రాజీవ్‌నగర్‌, ఉడా కాలనీ, కండ్రిక, భవానీపురం, ఉర్మిళానగర్‌, చిట్టినగర్‌, గొల్లపూడి కూడలి ప్రాంతాల్లో పందుల బెడద ఎక్కువగా ఉంది. పెంపకందారులు ఆయా ప్రాంతాల్లో శివారున మకాం ఏర్పాటు చేసుకుని ఈ సంపదను పెంచుతున్నారు. ఇక్కడి నుంచి ఈ పందులు జనావాసాల మధ్యలోకి వచ్చి అపరిశుభ్రం చేస్తున్నాయి. రహ దారులను మురికిమయం చేస్తున్నాయి. ప్రతి సోమవారం వీఎంసీ కమిషనర్‌ నిర్వహించే డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమంలో అధిక ఫిర్యాదులు పందుల సమస్యపైనే ఉంటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికే ‘ఆపరేషన్‌ పిగ్‌’ మొదలుపెట్టారు. నగరంలో మూడు రోజులుగా సుమారు 400 పందులను పట్టుకున్నారు. 







Updated Date - 2021-06-17T05:34:17+05:30 IST