వారం రోజుల్లో పందులను తరలించాలి

ABN , First Publish Date - 2021-10-22T05:50:30+05:30 IST

జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలో పందుల బెడద నివారణకు మునిసిపల్‌ పాలకవర్గం చర్యలు చేపట్టింది.

వారం రోజుల్లో పందులను తరలించాలి
పందుల పెంపకందారులతో మాట్లాడుతున్న చైర్‌పర్సన్‌ లక్ష్మీరవీందర్‌

- రెండెకరాల స్థలం, నీటి వసతి ఇస్తాం  - పందుల పెంపకందారులతో మునిసిపాలిటీ పాలకవర్గం, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు 

జడ్చర్ల, అక్టోబరు 21 : జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలో పందుల బెడద నివారణకు మునిసిపల్‌ పాలకవర్గం చర్యలు చేపట్టింది. మునిసిపాలిటీ కార్యాల యంలో చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మీరవీందర్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకు లు గురువారం పందుల పెంపకందారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ మునిసిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పందులు స్వైరవిహారం చేస్తున్నాయని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతు న్నారన్నారు. ప్రజల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయని, అనారోగ్యం పాలవుతున్నారని వివరించారు. జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి ఆదేశాను సారం పట్టణంలో పందుల తరలింపు కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. మున్సిపాలిటీలోని పందులను వారం రోజుల వ్యవధిలో ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మునిసిపాలిటీ పరిధిలో రెండు ఎకరాల స్థలం కేటాయిస్తామని, నీటి వసతి సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. పందుల తర లింపు అంశంలో కొంత సమయం ఇవ్వాలని, వారం రోజుల వ్యవధి సరిపో దంటూ పెంపకందారుల సంఘం నాయకుడు బాలస్వామి చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే లక్షల రూపాయల విలువగల పందులను ఇతర ప్రాం తాలకు తరలించడంతో నష్టాలకు గురయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై చర్చ జరుగుతున్నప్పుడు పందుల పెంపకం దారులకు, పాలక వర్గం, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య తీవ్రవాగ్వివాదం చోటుచేసుకుంది. పందుల తరలింపు అంశంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ తగ్గేదిలేదంటూ ఈ సందర్భంగా పందుల పెంపకం దారులకు పాలకవర్గం సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నందకిశోర్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి, చైతన్యచౌహాన్‌, సతీష్‌, కుమ్మరి రాజు, శశికిరణ్‌, బుక్క మహేష్‌, రమేశ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు దోరేపల్లి రవీందర్‌, పాలాదిరాంమోహన్‌, నరసింహ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T05:50:30+05:30 IST