పైలట్‌ ఎవరో..?

ABN , First Publish Date - 2021-09-16T08:06:39+05:30 IST

ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు పలు సంస్థలు ఫైనాన్షియల్‌ బిడ్లు సమర్పించాయని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. బిడ్ల దాఖలుకు గడువు బుధ వారంతో ముగిసింది.

పైలట్‌ ఎవరో..?

ఎయిర్‌ ఇండియా బరిలో టాటా, అజయ్‌ సింగ్‌ 

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా కొనుగోలుకు పలు సంస్థలు ఫైనాన్షియల్‌ బిడ్లు సమర్పించాయని కేంద్రప్రభుత్వం వెల్లడించింది. బిడ్ల దాఖలుకు గడువు బుధ వారంతో ముగిసింది. ఎయిర్‌ ఇండియాకు తామూ బిడ్‌ సమర్పించామని టాటా సన్స్‌ ప్రతినిధి ధ్రువీకరించారు. స్పైస్‌జెట్‌ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ సైతం బరిలో ఉన్నట్లు తెలిసింది. ఇతరులతో కలిసి కన్సార్షియంగా ఏర్పడి అజయ్‌ సింగ్‌ బిడ్‌ సమర్పించినట్లు సమాచారం. ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణ ప్రక్రియ ఇక ముగింపు దశకు చేరుకుందని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఎయిర్‌ ఇండియాను విక్రయించేందుకు తొలి ప్రయత్నంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం.. 2020 జనవరిలో మరోసారి ఆసక్తి వ్యక్తీకరణలను (ఈఓఐ) ఆహ్వానించింది. కరోనా సంక్షోభం కారణంగా ప్రక్రియ జాప్యమవుతూ వచ్చింది. గత ఏడాది డిసెంబరులో టాటా సన్స్‌, స్పైస్‌జెట్‌ సహా పలు సంస్థలు ఈఓఐలను సమర్పించాయి. ప్రాథమిక బిడ్డింగ్‌లో అర్హత సాధించిన సంస్థల నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో దీపం ఫైనాన్షియల్‌ బిడ్లను ఆహ్వానించింది.  


తిరిగి టాటాల చేతికేనా..? 

టాటా సన్స్‌ 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించింది. 1946లో దాని పేరును ఎయిర్‌ ఇండియాగా మార్చా రు. 1953లో కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌ ఇండియాను తన ఆధీనంలోకి తీసుకుంది. దాదాపు 7 దశాబ్దాల తర్వాత (68 ఏళ్లు) ఏఐని తిరిగి దక్కించుకునేందుకు టాటా సన్స్‌ బరిలోకి దిగింది. 1995లోనే టాటా గ్రూప్‌ కొత్త ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రారంభించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. 2001లోనూ టాటాలు ఎయిర్‌ఇండియాను తిరిగి దక్కించుకునేందుకు బిడ్‌ వేసినప్పటికీ.. ప్రభుత్వం వాటా విక్రయ ప్రతిపాదనను ఉపసంహరించుకోవడంతో సాధ్యపడలేదు. ప్రస్తు తం టాటా సన్స్‌ రెండు విమాన సంస్థలను నిర్వహిస్తోంది. మలేషియాకు చెందిన ఎయిర్‌ ఏషియా గ్రూప్‌తో కలిసి ఎయిర్‌ ఏషియా ఇండియాను ఏర్పాటు చేసింది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తారాను లాంచ్‌ చేసింది. ఈ రెండు ఎయిర్‌లైన్స్‌ల్లోనూ టాటా సన్స్‌దే మెజారిటీ (51 శాతం) వాటా. 

Updated Date - 2021-09-16T08:06:39+05:30 IST