Abn logo
Sep 26 2021 @ 00:59AM

సీమ అస్తిత్వ చరిత్రలో ‘పినాకిని’

కైపా సుబ్రహ్మణ్య శర్మ సోదరులు, పాలకొండ రామచంద్ర శర్మ కలసి అనంతపురంలో 1922 సెప్టెంబరు 16న, ‘పినాకిని పత్రిక’ను ప్రారంభించారు. అస్తిత్వాన్ని ప్రతిపాదించే రీతిలో పెన్నానదికి మరో పేరైన ‘పినాకిని’ పేరుతో ఆనాడు ఒక వారపత్రిక మొదలై 1926 మార్చి వరకు కొనసాగింది. ఈ పత్రికా నిర్వహణలో కీలకంగా ఉన్న పప్పూరు రామాచార్యులు తర్వాతికాలంలో సుమారు మూడున్నర దశాబ్దాల పైగా ఉజ్వలంగా ‘శ్రీ సాధన పత్రిక’ నిర్వహించారు.


రాయలసీమకు ప్రాతినిధ్యం వహించే అనేక అస్తిత్వ సృజనాత్మక ప్రయత్నాల గురించి అవలోకించినపుడు చరిత్ర పుటల్లో ‘పినాకిని’ అనే పత్రిక కూడా తారసపడుతుంది. పెన్నానదికి మరో పేరు పినాకిని! కేవలం నాలుగేళ్ళు నడిచిన ‘పినాకిని’ పత్రిక మొదలై నూరేళ్ళు అవుతున్న సందర్భంగా మనం దాన్ని స్మరించుకోవాల్సి ఉంది. ఈ పత్రిక సంచికలో ఒక్కటి కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్టు దాఖలాలు లేవు. 1926 ఆగస్టు 14న వెలువడిన పప్పూరు రామాచార్యుల ‘శ్రీ సాధన పత్రిక’ తొలి సంచిక తరువాతి రెండు సంచికల్లో ‘పినాకిని’ పత్రిక గురించి ఆయనే రాసిన కొన్ని విషయాలు మనకు కనబడతాయి. 


అనంతపురం పట్టణానికి సుమారు పాతిక, ముప్పయి కిలోమీటర్ల దూరంలో ఉండే ఇల్లూరులో తొలుత 1920–21 ప్రాంతంలో ‘పినాకిని’ పత్రిక స్థాపించాలనే యోచన మొదలైంది. వాస్తవానికి ఈ పత్రికను ప్రారంభించాలనుకున్నప్పుడు వారు స్థిరపరుచుకున్న పేరు ‘స్వరాజ్యోదయం’. నీలం సంజీవరెడ్డి సొంత ఊరే ఇల్లూరు. ఆయన తండ్రి నీలం చిన్నపురెడ్డి అక్కడ పెద్ద భూస్వామి. అదే ఇల్లూరులో కైపా సుబ్రహ్మణ్య శర్మ పేరు పొందిన ఆయుర్వేద వైద్యుడు. ఆ గ్రామ కరణం ఐతరాజు నరసప్ప సుబ్రహ్మణ్య శర్మకు సన్నిహిత మిత్రుడు. శర్మ తమ్ముడు మహానందయ్యకు కూడా ఒక పత్రిక నడపాలనే అభిలాష ఉండేది.


ఈ అన్నదమ్ములు అంతక్రితం విడివిడిగా రెండు పత్రికలు (శివంకరి, విద్యార్థి) నడిపి ఉన్నారు. అప్పటికి మహాత్మాగాంధీ తొలిసారిగా రాయలసీమ పర్యటన చేసి ఎంతోకాలం కాలేదు. కనుక అందరిలో స్వాతంత్ర్యోద్యమ చైతన్యం, విముక్తి కోసం ఆకాంక్ష ఉండేవి. ఐతరాజు నరసప్ప అల్లుడు పాలకొండ రామచంద్ర శర్మ ఆదోని ప్రాంతపు వ్యక్తి. కైపా సుబ్రహ్మణ్య శర్మ సోదరులు రామచంద్ర శర్మతో కలిసి ఒక పత్రికను ప్రారంభించాలని సంకల్పించారు, దీనికి ఆర్థికపరమైన సాయం చేయడానికి ఐతరాజు నరసప్ప ముందుకు వచ్చారు. అలా ‘స్వరాజ్యోదయము’ అనే పేర పత్రిక నడపడానికి, అలాగే ఒక ప్రింటింగ్ ప్రెస్‌ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి సాధించారు. 


దాదాపు అదే సమయంలో కైపా సుబ్రహ్మణ్య శర్మ సహాయంతో పప్పూరు రామాచార్యులు ఇల్లూరు రావలసి వచ్చింది. అనంతపురం కళాశాలలో బి.ఎ. చదువుతూ దాన్ని అర్ధంతరంగా ఆపేసి ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన రామాచార్యులు ఎంతోకాలం ఆ ఉద్యోగంలో సాగలేదు. ఇటువంటి సమయంలో నీలం చిన్నపరెడ్డి కుమారులకు, మరో ఇద్దరు పిల్లలకు విద్యాబోధన చేసే నిమిత్తం ఆయన ఇల్లూరు వచ్చారు. సుబ్రహ్మణ్య శర్మకు మిత్రుడు కనుక పత్రికా సంబంధమైన పనులలో ఆయన కూడా సాయపడ్డారు. 


నరసప్ప పెట్టుబడితో సుబ్రహ్మణ్య శర్మ సోదరులు, పాలకొండ రామచంద్ర శర్మ కలసి అనంతపురంలో (ఇప్పటి రైల్వేస్టేషనుకు సమీపంలో) 1922 సెప్టెంబరు 16న, ‘పినాకిని పత్రిక’ను ప్రారంభించారు. అస్తిత్వాన్ని ప్రతిపాదించే రీతిలో పెన్నానదికి మరో పేరైన ‘పినాకిని’ పేరుతో ఆనాడు ఒక వారపత్రిక మొదలై 1926 మార్చి వరకు కొనసాగింది. ఈ పత్రికా నిర్వహణలో కీలకంగా ఉన్న పప్పూరు రామాచార్యులు తర్వాతికాలంలో సుమారు మూడున్నర దశాబ్దాలకు పైగా ఉజ్వలంగా ‘శ్రీ సాధన పత్రిక’ నడిపిన కారణంగా ‘పినాకిని’ పత్రిక గురించి సహజంగానే ఆసక్తి కలుగుతుంది.


‘స్వరాజ్యోదయం’ అని ఎన్నో ప్రాంతాలకు వర్తించే పేరు కాకుండా, ‘పినాకిని’ అనే పేరు ఎంపిక చేసుకోవడం ఒక ప్రాంతాన్ని కార్యక్షేత్రంగా చేసుకోవడం వల్ల కూడా కావచ్చు. ఈ పేరు మార్పు గురించి మనకు పూర్తిస్థాయి ఆధారాలు లేవు. కానీ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు ‘స్వరాజ్య’ పేరిట వెలువడిన పత్రిక సంపాదకుడుగా 1908లో వ్యాసాలు రాసి, జైలుశిక్ష అనుభవించడం ఆ సమయంలో సంచలనం. ఈ విషయం అనంతపురం వాసి, రాజమండ్రి, మదరాసులో చదువుకున్న పప్పూరు రామాచార్యులకు బాగా తెలిసి ఉంటుంది. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనకుండా ముందస్తువ్యూహంగా కూడ పేరు ఆయన ప్రతిపాదించి ఉండవచ్చు!


1917–18 సంవత్సరాలలో అనంతపురంలో బి.ఎ. చదువుతూ రామాచార్యులు, మిత్రులు కర్నమడకల (రాళ్ళపల్లి) గోపాలకృష్ణమాచార్యులు, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ ఇత్యాదులతో ‘వదరుబోతు’ పేరున పక్షానికి ఒకసారి కరపత్రాలు ముద్రించిన నేపథ్యం కూడా ఉంది. రిచర్డ్ స్టీల్ ‘ది టాట్లర్’ రాతలను అనుకరిస్తూ ‘వాగ్మి’ అనే అర్థాన్ని స్ఫురించేలా అప్పటి సామాజిక సమస్యలను మంచి వాదనా పటిమతో సాహిత్య సమ్మిళితమైన శైలితో, హాస్యాన్ని రంగరించి విమర్శించారు. ఆ ‘వదరుబోతు’ కరపత్రాలను స్టూడెంట్స్ క్లబ్, అనంతపురం ప్రచురించింది. ఆ కరపత్రం పైన మహాభారతంలోని ఒక పద్యం ఉండేది. ఆ సాంప్రదాయాన్నే కొనసాగిస్తూ భారతంలోని–


‘ఆరంభరహితు బొందునె

యారయ సంపదలు హీనుడయ్యును పురుషుం 

డారంభశీలుడై యకృ

తారంభుల నోర్చు నెంత అధికులనైనన్’ 


పద్యాన్ని ‘పినాకిని పత్రిక’లో ముందు పేజీలో ప్రచురించేవారు. 


-డా. నాగసూరి వేణుగోపాల్