గులాబీ దళం.. పక్కా వ్యూహం

ABN , First Publish Date - 2020-11-23T07:50:54+05:30 IST

ఎన్నికలేవైనా అంతుచిక్కని వ్యూహాలు పన్ని ప్రత్యర్థులను మట్టి కరిపించే టీఆర్‌ఎస్‌.. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లోనూ తనదైన

గులాబీ దళం.. పక్కా వ్యూహం

గ్రేటర్‌ డివిజన్లలో వ్యూహాత్మక మోహరింపు

అభ్యర్థులకు తోడుగా ఇన్‌చార్జుల నియామకం

స్థానిక సమీకరణలకు అనుగుణంగా బాధ్యతలు

హైదర్‌నగర్‌కు కేటీఆర్‌.. గాంధీనగర్‌కు కవిత

జూబ్లీహిల్స్‌కు ఇన్‌చార్జిగా అల్లు అర్జున్‌ మామ

బాధ్యుల ఎంపిక కూడా సర్వేల ద్వారానే 

మంత్రులు మొదలు.. మాజీల దాకా బాధ్యతలు

కొన్ని డివిజన్లలో నలుగురు ఇన్‌చార్జులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తనదైన శైలిలో టీఆర్‌ఎస్‌

గ్రేటర్‌ డివిజన్లలో అభ్యర్థులకు తోడుగా ఇన్‌చార్జుల నియామకం

హైదర్‌నగర్‌కు కేటీఆర్‌.. గాంధీనగర్‌కు కవిత

జూబ్లీహిల్స్‌కు ఇన్‌చార్జిగా అల్లు అర్జున్‌ మామ

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రతినిధి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలేవైనా అంతుచిక్కని వ్యూహాలు పన్ని ప్రత్యర్థులను మట్టి కరిపించే టీఆర్‌ఎస్‌.. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లోనూ తనదైన శైలిలో ముందుకెళుతోంది. దుబ్బాకలో తగిలిన ఎదురుదెబ్బ నేపథ్యంలో ఈసారి ప్రతిపక్షాలకు ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వరాదన్న పట్టుదలతో ఉంది. అందుకనుగుణంగానే గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలోనూ భిన్నమైన వ్యూహాలను అమలు చేస్తోంది.

ఓటర్లకు చేరువయ్యేందుకు పార్టీ అభ్యర్థులకు తోడుగా బాధ్యులను నియమించింది. ప్రాంతాల వారీగా, సామాజికవర్గాల వారీగా ఆయా డివిజన్లలో ప్రభావం చూపగల పార్టీ నేతలను రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా తీసుకొచ్చి ప్రచార రంగంలోకి దింపింది. కొన్ని డివిజన్లలోనైతే ఏకంగా నలుగురు ఇన్‌చార్జులను నియమించింది. వివిధ డివిజన్ల బాధ్యుల్లో రాష్ట్ర మంత్రి మొదలు మాజీ ఎమ్మెల్యే దాకా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. గ్రేటర్‌ ఎన్నికల అవసరాలకు ఉపయోగపడతారనుకునే ఏ ఒక్కరినీ వదల్లేదు.


మంత్రి కేటీఆర్‌ సైతం హైదర్‌నగర్‌ డివిజన్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అక్కడి బాధ్యతలను చూసుకునేందుకు కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన సిరిసిల్లకు చెందిన తెలంగాణ కోఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ కె.రవీంద్రరావును నియమించారు. ఆయనతోపాటు డివిజన్‌పై మంచి పట్టున్న నిజాంపేట కార్పొరేషన్‌ మేయర్‌ నీలా గోపాలరెడ్డికి కూడా బాధ్యతలు అప్పగించారు. సిరిసిల్ల నుంచి ఏకంగా 800 మందిని రప్పించారు. డివిజన్‌లోని 76 బూత్‌లలో ఒక్కో బూత్‌కు 15 మందిని నియమించారు. అంతేకాదు.. సిరిసిల్ల నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి 3500 మంది కార్యకర్తలను రప్పించి వివిధ డివిజన్లలో ప్రచారంలోకి దించారు. 


గాంధీనగర్‌ బాధ్యతలు కవితకు..

సీఎం కేసీఆర్‌ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. గాంధీనగర్‌ డివిజన్‌ బాధ్యతలను తన భుజానికెత్తుకున్నారు. అక్కడి అభ్యర్థి నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి కూడా ఆమె హాజరయ్యారు. జాగృతి కార్యకర్తలను వందల సంఖ్యలో డివిజన్‌లో దించి ప్రచారం చేయిస్తున్నారు. ఇక అల్విన్‌ కాలనీ డివిజన్‌కు పార్టీ అభ్యర్థిగా డి.వెంకటేశ్‌ గౌడ్‌ బరిలో ఉండగా.. ఆయనకు సాయంగా వరంగల్‌ అర్బన్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను రంగంలోకి దించింది. మాస్‌ ఓటర్లు ఉన్న డివిజన్‌గా దీనికి పేరుంది. దీంతో మాస్‌ ఓటర్లను ఆకట్టుకుంటాడనే పేరున్న దాస్యం వినయ్‌భాస్కర్‌కు ఇక్కడి బాధ్యతలు అప్పగించింది.


ఇక బంజారాహిల్స్‌ డివిజన్‌ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి బరిలో ఉండగా.. ఆమెకు సాయంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఎంపిక చేశారు. కేకే మూలాలు నిర్మల్‌ జిల్లాలోని మీనవంక మండలంలో ఉండడం, మంత్రి ఇంద్రకరణ్‌ సైతం అక్కడివారే కావడం, డివిజన్‌లో ఆ జిల్లాకు చెందిన ఓటర్లు ఉండటం ఇందుకు కారణం. మంత్రితోపాటు నిర్మల్‌ జిల్లాకు చెందిన జడ్పీ చైర్మన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, ఎంపీటీసీలు, సర్పంచులు సహా 150 మందికి పైనే ఈ డివిజన్‌లో మోహరించారు.


కాగా, జూబ్లీహిల్స్‌ డివిజన్‌లో బరిలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాజా సూర్యనారాయణకు సాయంగా మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రెడ్డిని నియమించారు. ఆయనతోపాటు సినీ నటుడు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డికీ బాధ్యతలు అప్పగించారు. సినీ పరిశ్రమతో ఆయనకు ఉన్న అనుబంధం తమకు కలిసివస్తుందని భావిస్తున్నారు.

ఇక ఈ డివిజన్‌లోని ఫిలింనగర్‌ బస్తీలో రంగారెడ్డి, కరీంనగర్‌, మంచిర్యాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడం, మంచిర్యాల ఎమ్మెల్యేకు వారిని కలుపుకొని వెళ్లే నైపుణ్యం ఉండడంతో ఆయనను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. మొత్తం 150 డివిజన్లలోనూ అభ్యర్థులు, వారి బలాబలాలను పరిగణనలోకి తీసుకొని ఇన్‌చార్జులను నియమించారు. వీరిలో తొమ్మిది మంది ఎంపీలు, 14 మంది చొప్పున మంత్రులు, ఎమ్మెల్సీలు, 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.





ఇన్‌చార్జుల ఎంపికకూ సర్వే 


డివిజన్లకు ఇన్‌చార్జుల నియామకంలోనూ టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఏ డివిజన్‌లో ఏ సామాజిక వర్గాలవారు, ఏ ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారో సర్వే చేయించింది.

అంతేకాదు.. 2016 ఎన్నికల్లో ఇన్‌చార్జులుగా వ్యవహరించిన వారి పనితీరుపై కూడా సర్వే చేయించినట్లు, వారిలో కొందరి పట్ల సానుకూల అభిప్రాయం రాకపోవడంతో వారిని బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలిసింది. 


Updated Date - 2020-11-23T07:50:54+05:30 IST