మార్గదర్శకులు

ABN , First Publish Date - 2020-12-16T09:05:12+05:30 IST

రైతులను భయపెడుతున్నారు, మీ భూములు పోతాయని చెబుతున్నారు, పక్కదోవ పట్టిస్తున్నారు–అంటూ సాక్షాత్తూ...

మార్గదర్శకులు

రైతులను భయపెడుతున్నారు, మీ భూములు పోతాయని చెబుతున్నారు, పక్కదోవ పట్టిస్తున్నారు–అంటూ సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ప్రచారయుద్ధంలోకి దిగారు. తమ హయాంలో ఇటువంటి సంస్కరణలను తలపెట్టినవారే, ఇప్పుడు రైతులను ఎగదోస్తున్నారని ఆయన అంటున్నారు. మంగళవారం నాడు గుజరాత్‌లోని కచ్‌లో విద్యుత్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో రైతుల ఉద్యమాన్ని ఆయన తప్పు పట్టారు. ‘‘వ్యవసాయ సంస్కరణల వల్ల భూములే అన్యాక్రాంతమవుతాయని దుష్ప్రచారం చేస్తున్నారు, పాడిపశువుల దగ్గర డెయిరీ ఫామ్ పాలు కొనుక్కుంటుంది తప్ప, పశువులనే తీసుకువెళ్లిపోదు కదా’’ అని వివరిస్తూ, గుజరాత్ రాష్ట్రం వ్యవసాయోత్పత్తులలో, పాడి ఉత్పత్తులలో అగ్రస్థానంలో ఉండడానికి కారణం ప్రభుత్వ ప్రమేయం అత్యల్పస్థాయిలో ఉండడమే అని వ్యాఖ్యానించారు. 


దేశరాజధానిలో సాగుతున్న రైతు ఆందోళనల గురించి ప్రజల కళ్లు తెరిపించడానికి భారతీయ జనతాపార్టీ, కేంద్రప్రభుత్వం తలపెట్టిన అవగాహనాకార్యక్రమాల విధానానికి అనుగుణంగానే ప్రధాని ప్రసంగం కూడా ఉన్నది. వ్యవసాయ సంస్కరణల చట్టాల మంచిచెడ్డలను పక్కనబెడితే, ఆందోళనను ఎదుర్కొనడానికి ప్రభుత్వం, అధికారపక్షం అనుసరిస్తున్న వ్యూహం ఒకటే. రైతులు అమాయకులు, వారిని ఇతరులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ ఇతరులు ఎవరు? కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు, అదే సమయంలో ఖలిస్థానీ తీవ్రవాదులు, లేదంటే, మావోయిస్టులు. 


ఈ అందరూ కలిసి తప్పుదోవ పట్టిస్తున్నారా, లేక ఎవరికి వారు విడివిడిగా తప్పదోవ పట్టిస్తున్నారా తెలియదు. ఒక మంత్రిగారుఅంటారు, రైతుల ఆందోళనపై మాకు గౌరవం ఉన్నది, కానీ తుక్డే తుక్డే గ్యాంగ్తో కఠినంగా వ్యవహరిస్తాం, అట. ఇక సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే దుష్ప్రచారం మరో స్థాయిలో ఉంటుంది. రైతుల ఉద్యమానికి చైనా నుంచి పాకిస్థాన్ నుంచి నిధులు వస్తున్నాయట. ఇందిరాగాంధీ హయాంలో ప్రతి అంతర్గత సమస్యకీ విదేశీ హస్తమే కారణమన్న ప్రచారం జరిగేది. ఇప్పుడూ అదే జరుగుతోంది. ఉద్యమంలో 550 దాకా రైతు సంఘాలు పాలుపంచుకుంటున్నాయని చెబుతున్నారు. ఏ సంఘం ఎవరి ద్వారా ప్రేరితమయిందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పవచ్చు. ఉద్యమంలో భాగంగా ఉండడానికి అర్హత లేనివారు ఎవరైనా ఉంటే వేలెత్తి చూపవచ్చు. అవేవీ చేయరు, ఎందుకంటే, తమ ఆరోపణలు ప్రచారం కోసమేనని, నిరూపించేవి కావని వారికి తెలుసు. నిజానికి, అధికార రాజకీయాల ప్రమేయం లేనందువల్లనే, రైతుల ఆందోళన ఇంతకాలం స్థిరంగానూ, దృఢంగానూ కొనసాగుతున్నది. వారి నిశ్చయాన్ని చూసి, తమకు కొంత రాజకీయ భిక్ష దొరుకుతుందేమోనని వివిధ పార్టీలు వారికి మద్దతు ఇస్తున్నాయి. సకల శక్తులు ఉడిగిపోయి, నామమాత్రంగా మిగిలిపోయిన ప్రతిపక్ష పార్టీలకు మార్గదర్శనం చేస్తున్నదే రైతాంగం అయితే, వారేదో అర్భకులూ అమాయకులూ అని, వారిని ఇతరులు తప్పుదోవ పట్టిస్తున్నారనీ అనడం హాస్యాస్పదం. కట్టుబాటుతో, పట్టుదలతో ఉద్యమిస్తున్న రైతుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం, లేదా, వివిధ సంఘాల మధ్య పొరపొచ్చాలు తెచ్చి బలహీనపరచడం వంటి వ్యూహాలను కూడా ప్రభుత్వం అనుసరిస్తున్నది. 


ఎన్నిసార్లయినా చర్చలకు సిద్ధం అని వ్యవసాయ మంత్రి ప్రకటిస్తున్నప్పుడు, మరో వైపు ప్రధానమంత్రే ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నప్పుడు సంప్రదింపులపై విశ్వాసం ఎట్లా కుదురుతుంది? ముందస్తుగా దేశవ్యాప్తంగా సంప్రదింపులు లేకుండా చట్టాలు తేవడమే పొరపాటు. పార్లమెంటులో విస్తృత చర్చ లేకుండా బిల్లులను ఆమోదించడం మరొక పొరపాటు. సరిదిద్దుకోవడానికి వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం ఇప్పుడు జరుగుతున్న మరో పొరపాటు. ఇక్కడ అసలు సమస్య అవిశ్వాసం. ఆ చట్టాలలో సూచించిన సంస్కరణలు తమకు మేలు చేయవని, నష్టం చేస్తాయని రైతులు భయపడుతున్నారు. బడా బడా కార్పొరేట్ సంస్థలతో సమాన స్థాయిలో తాము కాంట్రాక్టు సేద్యం చేయలేమని వారు చెబుతున్నారు. ప్రభుత్వం ఆ కార్పొరేట్లకు మేలు చేయడానికే ఈ చట్టాలు తెచ్చిందని నమ్ముతున్నారు. మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పించాలన్న తమ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించకపోవడం- రేపు తమను మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు వదిలివేయడానికే అని కూడా వారు అనుకుంటున్నారు. ఈ అవిశ్వాసాన్ని ఎట్లా పోగొట్టాలో ఆలోచించవలసిన ప్రభుత్వం, రైతాంగంపై అనుమానాలు కలిగేట్టు వ్యవహరించడం విషాదం. 


రైతాంగం వ్యక్తం చేస్తున్న భయాందోళనలు కేవలం గిట్టుబాటు ధరకు సంబంధించినవి కావు. ఆహారభద్రతకు సంబంధించినవి కూడా. గుత్త కార్పొరేట్ ఆధిపత్యంలోకి కీలకమయిన రంగాలు వెడితే, అట్లా వెళ్లడానికి ప్రభుత్వాలే రాచబాట వేస్తే, ఇక ప్రజల జీవనాధారాలు ఎట్లా? కనీసమైన మనుగడ ఎట్లా? మార్కెట్ ఆటుపోట్లకు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగానికి ఒక ఆశావహమైన భవితవ్యాన్ని రచించవలసింది పోయి, మరింతగా దైవాధీనపు బతుకును అందించే సంస్కరణలు తేవడం ఏమి న్యాయం? నిజంగా, ప్రభుత్వం చెబుతున్నట్టు, ఈ సంస్కరణలు రైతులకు మంచివే అనుకుందాం పోనీ, ఆ మంచిని అందుకోవడానికి షరతులు– ఆర్థికబలం, బేరమాడే శక్తి, నిరంతర నష్టాలను తట్టుకోగలిగే నిబ్బరం– అయినప్పుడు సంస్కరణల వల్ల ఉపయోగం ఏమిటి? ప్రజలు ప్రభుత్వాలను అనుమానించడం సహజం, ఒక్కోసారి అవసరం కూడా. కానీ, ప్రభుత్వాలు నోరు తెరిచి అడుగుతున్న ప్రజలను అనుమానించడం తప్పు. సమస్య ఏమిటో అర్థం చేసుకోవాలి, రైతు గుండె మీద చెవి పెట్టి వినాలి. శత్రువుని వెదకడం మాని సానుభూతితో పరిష్కరించాలి.

Updated Date - 2020-12-16T09:05:12+05:30 IST