Abn logo
Sep 25 2021 @ 23:28PM

ఊహించిన ‘విజయ’ం!

జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, వైస్‌ చైర్మన్‌ జగన్మోహన్‌రావు, వైస్‌ చైర్‌పర్సన్‌ శ్రావణిలతో డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌, మంత్రి అప్పలరాజు తదితరులు

- జడ్పీ చైర్‌పర్సన్‌గా పిరియా విజయ

- వైస్‌ చైర్మన్‌గా జగన్మోహన్‌రావు

- వైస్‌ చైర్‌పర్సన్‌గా శ్రావణి 

- ఏకగ్రీవంగా ఎన్నిక

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 25 : జడ్పీ పీఠం పిరియా విజయను వరించింది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా కవిటి జడ్పీటీసీ సభ్యురాలు విజయ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ సమక్షంలో ఎన్నికల పరిశీలకులు చక్రవర్తి ఆధ్వర్యంలో జడ్పీటీసీ సభ్యులు ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వైసీపీ నుంచి పార్టీపరంగా డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌, పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు బీ-ఫారాలను పిరియా విజయ, పాలిన శ్రావణి, సిరిపురం జగన్మోహన్‌రావులకు అందజేశారు. ముందుగా శ్రీకాకుళం జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యులుగా సవర లక్ష్మి, షేక్‌ బాబ్జీలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  తర్వాత జడ్పీ చైర్‌పర్సన్‌, ఇద్దరు వైస్‌ చైర్‌పర్సన్‌ల ఎన్నిక మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభమైంది. కవిటి జడ్పీటీసీ సభ్యురాలు పిరియా విజయను జడ్పీ చైర్‌పర్సన్‌గా కంచిలి జడ్పీటీసీ సభ్యురాలు ఇప్పిలి లోలాక్షి, రేగిడి ఆమదాలవలస జడ్పీటీసీ పాలవలస ఇందుమతి ప్రతిపాదించారు. మిగిలిన జడ్పీటీసీ సభ్యులు బలపరిచి ఆమోదించారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా విజయను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

- వైస్‌చైర్మన్‌గా సంతకవిటి జడ్పీటీసీ సిరిపురపు జగన్మోహన్‌రావు పేరును పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణచైతన్య, టెక్కలి జడ్పీటీసీ దువ్వాడ వాణి ప్రతిపాదించారు. రెండో వైస్‌ చైర్‌పర్సన్‌గా వజ్రపుకొత్తూరు జడ్పీటీసీ పాలిన శ్రావణి పేరును పాలకొండ జడ్పీటీసీ గౌరీపార్వతి, జి.సిగడాం జడ్పీటీసీ కాయల రమణ ప్రతిపాదించారు. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో వీరిద్దరి ఎన్నిక కూడా ప్రశాంతమైంది. అనంతరం జడ్పీచైర్‌పర్సన్‌ విజయ, ఆమె భర్త పిరియా సాయిరాజ్‌లను స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, సీదిరి అప్పలరాజు, కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌, ఎమ్మెల్యేలు కళావతి, కిరణ్‌కుమార్‌, జోగులు, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి సత్కరించారు. వైస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌లను కూడా అభినందించారు. జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌, మంత్రి సీదిరి అప్పలరాజులు వారికి సూచించారు. జిల్లాను ప్రగతిపథంలో నడిపిద్దామని పిలుపునిచ్చారు.


- ఆలస్యంగా ఇద్దరు జడ్పీటీసీలు...

ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఇద్దరు జడ్పీటీసీలు కాస్త ఆలస్యంగా జిల్లా పరిషత్‌ సమావేశ మందిరానికి వచ్చారు. రేగిడి ఆమదాలవలస జడ్పీటీసీ పాలవలస ఇందుమతి, పాలకొండ జడ్పీటీసీ పాలవలస విజయగౌరి ఆలస్యంగా చేరుకున్నారు. జడ్పీ సీఈవో లక్ష్మీపతి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. 


జిల్లా అభివృద్ధికి కృషి 

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నా వంతు కృషి చేస్తా. సిక్కోలుపై సీఎం జగన్‌ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో అన్ని సమస్యలు స్వయంగా చూశారు. ఉద్దానం ప్రాంత కిడ్నీరోగుల కోసం పలాసలో ఆస్పత్రి నిర్మిస్తున్నారు.  పదవుల కేటాయింపులో మహిళలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటా. ఆదరించిన ప్రజలకు మరింత సేవ చేస్తా. 

- పిరియా విజయ, జడ్పీ చైర్‌పర్సన్‌