మీనం.. ఉపాధి మార్గం

ABN , First Publish Date - 2022-08-28T06:18:15+05:30 IST

జిల్లాలో మత్స్యకారుల సంక్షేమం కోసం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

మీనం.. ఉపాధి మార్గం

- చేప పిల్లలను వదలడానికి అధికారులు సిద్ధం

- నిండు కుండలా చెరువులు, కుంటలు

- అనువైన చెరువులను గుర్తించిన మత్స్య శాఖ

- జిల్లాలో 185 చెరువులు, 712 కుంటలు


జగిత్యాల, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మత్స్యకారుల సంక్షేమం కోసం చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను వదిలేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. చెరువులు జలకళను సంతరించుకోవడంతో ప్రభుత్వం చేపపిల్లలను ఉచితంగా వదలడానికి సమాయత్తం అవుతోంది. జిల్లాకు అవసరమైన చేప పిల్లలను సేకరించడానికి నిర్ణయించారు. ప్రభుత్వం ఇందుకు సుమారు రూ. 2.25 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది జిల్లాలోని 185 చెరువులు, 712 కుంటల్లో 1.11 కోట్ల చేప పిల్లలను పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత ఏడాది చేపల దిగుబడి ఆశించిన దానికంటే ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. 

- జిల్లాలో 202 మత్స్య పారిశ్రామిక సంఘాలు..

జిల్లాలో 712 గ్రామ పంచాయతీ చెరువులు 3,174 హెక్టార్లలో, 185 డిపార్ట్‌మెంట్‌ చెరువులు 15,162 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. జిల్లాలో 202 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల్లో 11,622 మంది సభ్యులున్నారు. ఇందులో 29 మహిళా మత్స్యపారిశ్రామిక సహకార సంఘాల్లో 824 మంది మహిళా మత్స్యకారులున్నారు. 173 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 10,798 మంది పురుష మత్స్యకారులున్నారు. జిల్లాలో మత్స్యశాఖ పరిదిలో 180 చెరువులున్నాయి. ఈ చెరువులను మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు కౌలుకు ఇస్తున్నారు. ప్రతీ యేడాది కౌలు ద్వారా సుమారు రూ. 15.02 లక్షల ఆదాయం వస్తోంది. జిల్లాలో 2021-22 సంవత్సరానికి గానూ చేపలు పట్టడానికి సుమారు 729 మందికి లైసెన్స్‌లను అధికారులు అందించారు.

- 1.11 కోట్ల చేపపిల్లలు విడుదల లక్ష్యం..

జగిత్యాల జిల్లాలో ప్రస్తుత యేడాది అనుకూలంగా ఉన్న 185 చెరువులు, 712 కుంటల్లో 1.11 కోట్ల చేప పిల్లలను వదలడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇందుకు అవసరమైన చెరువులను గుర్తించడం, చేప పిల్లల సంఖ్యను నిర్ణయించడం వంటివి పూర్తి చేశారు. గత యేడాది జిల్లాలో వంద శాతం సబ్సిడీపై 617 చెరువుల్లో 1.38 కోట్ల చేప పిల్లలను వదలారు. వీటితో పాటు రొయ్య పిల్లలను సైతం చెరువుల్లో వదిలారు. జిల్లాలోని ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌, స్తంబంపల్లి కొంపెల్లి చెరువు, నర్సింహులపల్లి రోళ్లవాగు ప్రాజెక్టులలో 7.80 లక్షల రొయ్య పిల్లలను వదిలారు. 

- దిగుబడి పెరుగుతుందని  అంచనా..

జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఏడాది అధిక దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చెరువుల్లో నిండుగా నీరు ఉండడం, వాతావరణం అనుకూలిస్తుండడంతో దిగుబడి పెరుగుతుందన్న అభిప్రాయాలున్నాయి. ఇందుకు అనుగుణంగా 35-40 ఎంఎం సైజులో, 80-100 ఎంఎం సైజులలో చేప పిల్లలను చెరువుల్లో విడుదల చేయడానికి నిర్ణయించారు. పెద్ద చెరువుల్లో 8 నుంచి 10 నెలల్లో, చిన్న చెరువుల్లో 9 నుంచి 12 నెలల్లో ఆశించిన స్థాయిలో చేపల ఉత్పత్తి జరుగుతుందన్న అంచనా ఉంది. జిల్లాలో ప్రధానంగా రవ్వ, బొచ్చ, బంగారు తీగ, మిరిగ్ర చేపలు విడుదల చేయాలని నిర్ణయించారు. 2022-23 సంవత్సరానికి గానూ 7,642 టన్నుల చేపలు, 402 క్వింటాళ్ల రొయ్యల ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. 

- మత్స్య కారులకు ఉపాధి..

గడిచిన రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తుండడంతో మత్స్యకారుల ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. సహజ సిద్దంగా పెరిగే చేపలకు తోడుగా మత్స్య శాఖ చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. మరోవైపు గ్రామాల్లో పలువురు మత్స్యకారులకు ఇప్పటికే సబ్సిడీపై వాహనాలను పంపిణీ చేశారు. దీంతో వారికి చేపలు పట్టిన అనంతరం రవాణా చేయడం, విక్రయించడం వంటివి సులభతరంగా మారాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం, చేప పిల్లలను వంద శాతం సబ్సిడీపై వదులుతుండడంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి.


Updated Date - 2022-08-28T06:18:15+05:30 IST