బాగున్న రహదారిపైనే సిమెంటు రోడ్డు

ABN , First Publish Date - 2021-10-25T05:15:25+05:30 IST

పిఠాపురం, అక్టోబరు 24: పట్టణంలో రహదారులు, డ్రైన్ల అభివృద్ధికి నిధుల కేటాయింపు జరుగుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ మాత్రం పురపాలక సంఘ అధికారులు నేతల ఒత్తిడికి లొం

బాగున్న రహదారిపైనే సిమెంటు రోడ్డు
మంగాయమ్మరావుపేటలో బాగున్న సీసీరోడ్డుపైనే మళ్లీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించిన దృశ్యం

అధ్వానంగా ఉన్న వాటికి కేటాయింపులు నిల్‌

పిఠాపురం మున్సిపాలిటీ రూటే సెపరేటు

అంతా బాగున్న రహదారి అది. గతంలోనే సిమెంటు రోడ్డు నిర్మించారు. తాజాగా మళ్లీ అదే రోడ్డుపై సీసీరోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించడమే గాకుండా కౌన్సిల్‌ ఆమోదం తీసుకుని టెండర్లు పిలిచారు. అధ్వాన రహదారులను మాత్రం పట్టించుకోవట్లేదు. పిఠాపురం పురపాలకలు, అధికారులు వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది.

పిఠాపురం, అక్టోబరు 24: పట్టణంలో రహదారులు, డ్రైన్ల అభివృద్ధికి నిధుల కేటాయింపు జరుగుతున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా అధ్వానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ మాత్రం పురపాలక సంఘ అధికారులు నేతల ఒత్తిడికి లొంగి బాగున్న రోడ్లకే నిధులు కేటాయిస్తూ అసలు బాగోలేని రోడ్లను పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని మంగాయమ్మరావుపేటలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ5.25 లక్షలు కేటాయిస్తూ ఆగస్టులో కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. వీటికి టెండర్లు కూడా పిలిచారు. నిధుల కేటాయింపు జరిగిన ఈ రహదారులను పరిశీలిస్తే ఇప్పటికే ఇక్కడ సీసీరోడ్డు ఉంది. కనీసం ఎక్కడా పాడవ్వలేదు. బాగున్న సీసీ రహదారిపైనే మళ్లీ సిమెంటు రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించడం ఇప్పుడు విమర్శలకు గురవుతోంది. మరోవైపు పట్టణంలో పలుచోట్ల రహదారులు అధ్వానంగా ఉన్నాయి. జగ్గయ్యచెరువు కాలనీ వంటి ప్రాంతాల్లో మట్టి రోడ్లు ఉన్నాయి. ఇక్కడ కొన్నిచోట్ల నడవడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి చోట్ల కేటాయింపులు చేయకుండా బాగున్న రోడ్లకే నిధులు కేటాయింపులు జరపడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పురపాలకులు కలుగజేసుకుని అధ్వానంగా ఉన్న రోడ్లకు నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

Updated Date - 2021-10-25T05:15:25+05:30 IST