ఆ ఆభరణాలను అప్పగించండి... ప్రధానికి నిజాం మునిమనవడి లేఖ...

ABN , First Publish Date - 2021-06-13T02:02:03+05:30 IST

నిజాం చరిత్ర, వైభోగం మనకు తెలిసినవే. ఇప్పుడు అవి మళ్ళీ మరోమారు తెరమీదకొచ్చాయి. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహదూర్‌కు సంబంధించిన జువెల్లరీ తిరిగి హైదరాబాద్‌కు అప్పగించాలంటూ నిజాం మునిమనవడు హిమాయత్‌ అలీ మిర్జా... ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

ఆ ఆభరణాలను అప్పగించండి... ప్రధానికి నిజాం మునిమనవడి లేఖ...

హైదరాబాద్ : నిజాం చరిత్ర, వైభోగం మనకు తెలిసినవే. ఇప్పుడు అవి మళ్ళీ మరోమారు తెరమీదకొచ్చాయి. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ బహదూర్‌కు సంబంధించిన జువెలరీని తిరిగి హైదరాబాద్‌కు అప్పగించాలంటూ నిజాం మునిమనవడు హిమాయత్‌ అలీ మిర్జా... ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇదే క్రమంలో... మోదీ అపాయింట్‌మెంట్‌ కూడా కోరారు. నిజాం ఆభరణాలను హైదరాబాద్‌కు తరలించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నానని ఆయన ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


విలువైన నిజాం ఆభరణాలకు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని, ప్రస్తుతం ఆర్‌బీఐ ఆధీనంలో ఉన్న ఆ నగలను నగరానికి తరలించి,  ప్రత్యేక మ్యూజియంను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని హిమాయత్‌ అలీ మిర్జా వెల్లడించారు. ‘పంచంలోనే అత్యంత హూందాతనం కలిగిన, అందమైన, అత్యంత విలువైన ఆభరణాలు నిజాం సొంతం. ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా కోహినూర్‌ వజ్రం మాయమైనట్లు ఈ నగలు కూడా మాయమయ్యే ప్రమాదముంది’ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.కాగా... 1970 లోనే నిజాం నగలను విదేశీయులకు రూ. 14 కోట్లకు విక్రయించేందుకు నిజాం ట్రస్టీలు ప్రయత్నించగా, తన తల్లి... నిజాం మనవరాలు(మీర్‌ ఉస్మాన్‌ అలీ కుమారుడు మోజం జాహ్‌, ఆయన కుమార్తె ఫాతిమా ఫౌజియా) అడ్డుకున్నారని చెప్పారు.


ఇక ఈసంపద విషయమై అప్పట్లో సివిల్‌ కోర్టులో కేసు దాఖలైందని, సుప్రీం కోర్టు వరకు వెళ్లి 1995 లో ఆ నగలను మళ్ళీ దక్కించుకున్నామని వివరించారు. ఆ తర్వాత... భారత ప్రభుత్వం కొనుగోలు చేయడంతో ఆ నగలు ఢిల్లీకి చేరాయని చెప్పారు. అతి తక్కువ విలువను ప్రాతిపదికగా తీసుకున్నప్పటికీ...  నిజాం నగల విలువ 13.5 బిలియన్‌ డాలర్లు (రూ. 99 వేల కోట్లు) ఉంటుందని చెప్పారు. కాగా... అప్పట్లో... భారత ప్రభుత్వం కేవలం రూ. 217 కోట్లు మాత్రమే చెల్లించి కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నానలుగేళ్ళ క్రితం(2017) వరకు విదేశాల్లో ఉన్న తాను తిరిగి వచ్చినప్పటి నుంచి నగలను వెనక్కు రప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ప్రధానికి లేఖ రాయడంతో పాటు ఆయన అపాయింట్‌మెంట్‌ కోరానని మీర్జా తెలిపారు.


నగరంలో మ్యూజియం...

నిజాం నగలను నగరానికి తరలించిన తర్వాత 300-500 ఎకరాల స్థలంలో ప్రత్యేక మ్యూజియంను ఏర్పాటు చేసినపక్షంలో... దేశవిదేశీ పర్యాటకులు వస్తారని హిమాయత్‌ అలీ మిర్జా పేర్కొన్నారు. ఆ క్రమంలో... పర్యాటక రంగంతో పాటు మ్యూజియం ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. మరోవైపు... లక్షల మందికి ఉపాధి దక్కుతుందన్నారు. 


నగరం ఎంత అభివృద్ధి చెందినా... నిజాం కట్టడాలు, నిజాం ప్లానింగ్‌ పర్యాటకులను నిత్యం  ఆకర్షిస్తుంటాయని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్‌ మూడేళ్ల క్రితం నగరానికి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ... ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ప్రశంసించిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు. అదే సందర్భంలో నిజాం నగల ప్రస్తావన కూడా చోటుచేసుకుందని వెల్లడించారు. ఎన్నోచారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న ప్రధాని మోదీ... నిజాం నగలను హైదరాబాద్‌కు తరలించే విషయంలోనూ సహకరిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-13T02:02:03+05:30 IST