సాగు ఖరారు

ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వానాకాలంలో సాగు చేసే పంటలను వ్యవసాయ శాఖ అధికారులు ఖరారు చేశారు.

సాగు ఖరారు

వానాకాలంలో మారిన ప్రణాళిక

నియంత్రిత సాగుపై అధికారుల దృష్టి

మక్కలకు మంగళం.. పత్తికే ప్రాధాన్యం

ఉమ్మడి జిల్లాలో అధికంగా పత్తి, కంది సాగు

నూనెగింజల విస్తీర్ణం పెంచేలా కార్యాచరణ


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో  వానాకాలంలో సాగు చేసే పంటలను వ్యవసాయ శాఖ అధికారులు ఖరారు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తేనున్న నియంత్రిత సాగు విధానంలో   ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనేది లెక్క తేల్చారు. మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించే కంది, పత్తి సాగును ప్రోత్సహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈసారి వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం నియంత్రిత సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌/ ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌/ ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి : వానాకాలంలో సాగు చేసే పంటలను ఖరారు చేశారు. ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనేది లెక్క తేల్చారు. ఉమ్మడి జిల్లాలో కంది, పత్తి, మొక్కజొన్న ప్రధాన పంటలు కాగా, ఈసారి కంది, పత్తితోపాటు ఇతర పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల సాగు విస్తీర్ణం పెంచే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నియంత్రిత సాగుతో ఈసారి మొక్కజొన్న పంట కనుమరుగు కానున్నది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తేనున్న నియంత్రిత సాగు విధానంలో వానా కాలం సాగులో మొక్కజొన్న సాగు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో మొక్కజొన్నకు బదులుగా కంది, పత్తి సాగు ప్రోత్సహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలో 8,94,421 ఎకరాల విస్తీర్ణంలో వానాకాలం పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా పత్తి 4,62,549 ఎకరాలు, కంది 2,60,240 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయనున్నారు. 


అత్యధికంగా పత్తి, కంది సాగు..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా పత్తి సాగును ప్రోత్సహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 1,67,425 ఎకరాలు కాగా గత ఏడాది ఖరీ్‌ఫలో 2,18,557 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. ఈసారి నియంత్రిత సాగుతో 2,48,357 ఎకరాలు పత్తి సాగులోకి రానుంది. గతేడాదితో పోల్చితే ఈసారి 29,800 ఎకరాల్లో పత్తి విస్తీర్ణం పెరగనుంది. జిల్లాలో సాధారణ కంది సాగు విస్తీర్ణం 14,050 ఎకరాలు కాగా, గతేడాది 18,127.5 ఎకరాలు సాగు చేశారు. పప్పు ధాన్యాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జిల్లాలో 82,554 ఎకరాల విస్తీర్ణంలో కంది పంటను సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. 


వికారాబాద్‌ జిల్లాలో పత్తి పంట 1,93,802 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 2,13,192 ఎకరాల్లో సాగు చేసేలా కార్యాచరణ రూపొందించారు. గతేడాది సాగు విసీర్ణం కంటే ఈసారి 19,390 ఎకరాల్లో కంది పంటను అదనంగా పండించాలనే లక్ష్యం నిర్దేశించారు. గత ఏడాది సాగు చేసిన కంది పంటతో పోలిస్తే ఈసారి అదనంగా మరో 44,993 ఎకరాల్లో కంది సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోనున్నారు. మేడ్చల్‌ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 11,305 ఎకరాలు కాగా గతేడాది 18,577 ఎకరాలు సాగు చేశారు. ఈసారి వానా కాలంలో ఇంతే విస్తీర్ణం సాగులోకి రానుంది. పత్తి 1,000, కంది 1,786ఎకరాల్లో సాగు చేయనున్నారు. వరి సాగు ఎక్కువగానే ఉంది. 12,713 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగులోకి రానుంది. 


తగ్గిన సాగు విస్తీర్ణం

నియంత్రిత సాగు ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యవసాయాధికారులు రూపొందించిన ప్రకారం రంగారెడ్డి జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 4,19,735 ఎకరాలు కాగా నియంత్రిత సాగు విధానం అమల్లో భాగంగా ఈసారి 3,99,561 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను సాగు చేయాలని నిర్దేశించారు. సాధారణ సాగు విస్తీర్ణం కంటే 20,174 ఎకరాలు సాగు తగ్గింది. అలాగే వికారాబాద్‌ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వికారాబాద్‌ జిల్లాలో వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం 4,25,399.32 ఎకరాలు ఉండగా, గత ఏడాది 4,79,946 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. నియంత్రిత సాగు విధానం అమల్లో భాగంగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి జిల్లాలో 54,547 ఎకరాల విస్తీర్ణంలో సాగు తగ్గే అవకాశం ఉంది. 


మొక్కజొన్నకు బదులు ఇతర పంటలు

వికారాబాద్‌ జిల్లాలో గతేడాది 4,79,946 ఎకరాల్లో పంటలు సాగు చేస్తే, ఈసారి వానాకాలంలో 4,76,283 ఎకరాల సాగు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ మేరకు పంటల సాగు చేపడితే గత ఏడాదితో పోలిస్తే ఈవానాకాలంలో జిల్లాలో 3,663 ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది. మొక్కజొన్న పంటకు బదులుగా రైతులు కంది, పత్తి, పెసర, మినుము, జొన్న, ఆముదం, వేరుశనగ తదితర పంటలను సాగు చేసే విధంగా అవగాహన కల్పించేలా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ వానాకాలంలో మొక్కజొన్న పంట వేయకుండా రైతులకు అవగాహన కల్పించే పనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. గతేడాది సాగు చేసిన విస్తీర్ణం కంటే ఈసారి వరి పంట సాగు తగ్గించనున్నారు.


గత ఏడాది ఈ సీజన్‌లో 1,30,967 ఎకరాల్లో కంది పంట సాగు చేయగా, ఈసారి 1,75,900 ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళిక రూపొందించారు. గత ఏడాది 17,552 ఎకరాల్లో పెసర సాగు చేస్తే, ఈ వానాకాలంలో 20,800 ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించారు. అదే మినుము పంట గత ఖరీ్‌ఫలో 8002 ఎకరాల్లో సాగుచేయగా, ఈసారి 9,500 ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. గత ఏడాది కంటే పెసర 3,248 ఎకరాలు, 1,498 ఎకరాల్లో మినుము అదనంగా పండించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఖరీ్‌ఫలో 11,481 ఎకరాల్లో జొన్నపంట సాగు చేస్తే, ఈసారి 15 వేల ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళిక రూపొందించారు.


గత ఏడాది 3,106 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తే, ఈ ఏడాది 30 వేల ఎకరాలకు పరిమితం చేయనున్నారు. ఈసారి సాగు విస్తీర్ణంలో పెద్దగా మార్పు లేకున్నా.. జిల్లాలో చాలావరకు వరి సాగు చేసే దొడ్డు రకాలకు బదులుగా తెలంగాణ వరి వంగడం వేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 15 వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇతర పంటలను 2,788 ఎకరాల్లో సాగుచేస్తే ఈసారి 356 ఎకరాలకే కుదించనున్నారు. చెరుకు పంట గత ఏడాది 6,552 ఎకరాల్లో సాగు చేస్తే ఈసారి 6,508 ఎకరాలు సాగు చేయాలని భావిస్తున్నారు. సోయాబీన్‌ గత ఏడాది 20,47 ఎకరాల్లో సాగుచేస్తే ఈ ఏడాది కూడా అంతే విస్తీర్ణంలో సాగు చేయాలని నిర్ణయించారు. 


నూనె గింజల సాగుపై ప్రత్యేక దృష్టి

ఉమ్మడి జిల్లాలో నూనె గింజల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. రెండున్నర దశాబ్దాల క్రితంవరకు నూనె గింజల సాగు బాగానే ఉండేది. ఆ తరువాత రైతులు తమ దృష్టిని ఇతర పంటలపై పెట్టారు. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే రైతులు పండించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం అమల్లోకి తీసుకువచ్చింది. ఈమేరకు అధికార యంత్రాంగం జిల్లాలో కంది, పత్తి, ఇతర పప్పు ధాన్యాలతో పాటు ఆముదం, వేరుశనగ వంటి నూనె గింజల సాగు పెంచేలా దృష్టి కేంద్రీకరించింది. గతేడాది 264 ఎకరాల్లో ఆముదం పంట సాగుచేస్తే.. ఈసారి 1,500 ఎకరాల్లో సాగు చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నారు. 349 ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ విస్తీర్ణాన్ని ఈసారి 1,300 ఎకరాలకు పెంచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 


అగ్నిపరీక్ష

వానాకాలంలో రైతులు మొక్కజొన్న సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించే బాధ్యతను ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులపై ఉంచింది. అధికారులు సూచించిన పంటలనే సాగు చేయాలని స్పష్టం చేసింది. చెప్పినా వినకుండా సాగు చేస్తే రైతుబంధు వర్తించదని, మద్దతు ధర లభించదని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన పంటలనే సాగు చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. నియంత్రిత సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఆదివారం నుంచి సదస్సులు నిర్వహిస్తున్నారు.


ఈనెల 28వ తేదీ వరకు సదస్సులు కొనసాగనున్నాయి. గ్రామాలకు వ్యవసాయ అధికారులు వెళ్లే సరికి రైతులు, కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. అందుబాటులో ఉన్న రైతులకు నియంత్రిత సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రభుత్వం చెప్పిన పంటలే సాగు చేయాలంటే ఎలా? మేము ఇప్పటివరకు పండించిన పంటనే వేస్తామంటూ రైతులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులున్నచోట రైతులకు నచ్చజెప్పడం అధికారులకు అగ్నిపరీక్షగా మారుతోంది..

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST