కరాచీలో 66 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2020-05-23T08:33:51+05:30 IST

మరో నిమిషంలో కిందకు దిగాల్సిన విమానం జనావాసాల మధ్య కుప్పకూలిపోయింది. జనావాసాల్లోకి దూసుకుపోయింది. భవనాలు, రోడ్లు, పార్క్‌ చేసిన వాహనాలను ధ్వంసం చేసింది. ఈ ఘోర ప్రమాదం కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మలీర్‌ వద్ద గల మోడల్‌ కాలనీలో...

కరాచీలో 66 మంది దుర్మరణం

కరాచీ, మే 22: మరో నిమిషంలో కిందకు దిగాల్సిన విమానం జనావాసాల మధ్య కుప్పకూలిపోయింది. జనావాసాల్లోకి దూసుకుపోయింది. భవనాలు, రోడ్లు, పార్క్‌ చేసిన వాహనాలను ధ్వంసం చేసింది. ఈ ఘోర ప్రమాదం కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మలీర్‌ వద్ద గల మోడల్‌ కాలనీలో చోటుచేసుకుంది. ‘‘పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కి చెందిన ఏ-320 విమానం (పీకే-8303) శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు లాహోర్‌ నుంచి కరాచీకి బయలుదేరింది. మధ్యాహ్నం 2.38 గంటలకు కరాచీలో ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. కానీ, దిగడానికి ఒక నిమిషం ముందు.. సాంకేతిక సమస్యలున్నాయంటూ ఎయిర్‌ ట్రాఫిక్‌ కం ట్రోల్‌(ఏటీసీ)కి సందేశం అందింది. ఓ ఇంజన్‌ పనిచేయడం లేదని విమానం కెప్టెన్‌ సజ్జాద్‌ గుల్‌ సమాచారం అందించారు.


రెండు రన్‌వేల్లో దేన్నైనా ఉపయోగించుకోవాలని వారు చెప్పారు. అంతలో.. విమానం ల్యాండింగ్‌ గేర్‌ పనిచేయడం లేదంటూ సజ్జాద్‌ గుల్‌ చెప్పారు. అదే అతడి చివరి సందేశం. ఆ తర్వాత రాడార్‌తో విమాన సంకేతాలు కట్‌ అయ్యాయి’’ అని పాక్‌ పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 4 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో కడపటి వార్తలందేసరికి 66 మంది దుర్మరణం పాలయ్యారని అధికారులు ధ్రువీకరించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది విమాన సిబ్బంది ఉన్నారు. విమానం జనావాసాల మధ్య కూలడంతో.. 10 ఇళ్లు దెబ్బతిన్నాయి. విమానం నుంచి 13 మంది మృతదేహాలను వెలికితీసినట్లు ఈదీ ఫౌండేషన్‌ అధికార ప్రతినిధి షాద్‌ ఈదీ తెలిపారు. ఈ ప్రమాదంపై పాక్‌ అధ్యక్షుడు ఆరి ఫ్‌ అల్వీ, ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, టెన్నిస్‌ స్టార్‌ సానియా మిర్జా విచారం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-05-23T08:33:51+05:30 IST