Abn logo
Aug 3 2020 @ 06:00AM

మొక్కల పెంపకం అందరి బాధ్యత

కలెక్టర్‌ హన్మంతరావు

వనజీవి రామయ్యతో కలిసి సీడ్‌ బాల్స్‌ వెదజల్లే కార్యక్రమం ప్రారంభం


జిన్నారం, ఆగస్టు 2 : మొక్కల పెంపకం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ప్రకృతికి సేవ చేస్తే మానవ సేవ చేసినట్లేనని కలెక్టర్‌ హన్మంతరావు అన్నారు. ఆదివారం జిన్నారం మండలం కొడకంచి అర్బన్‌ పార్కులో మొక్కల పెంపకానికి భూమిపుత్ర ఎన్జీవో వైశ్య ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో డ్రోన్‌ ద్వారా విత్తనాలు వెదజల్లే కార్యక్రమాన్ని కలెక్టర్‌ హన్మంతరావు, వనజీవి రామయ్య దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో అటవీ విస్తీర్ణాన్ని పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఎన్జీవో సంస్థలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. అడవుల్లో మనిషి వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్‌ ద్వారా విత్తనాలను చల్లి మొక్కలను పెంచే ప్రయత్నం చేపట్టామన్నారు.


మహిళా సంఘాల సహకారంతో జిల్లాలో సీడ్‌ బాల్స్‌ తయారీ చేపట్టినట్లు కలెక్టర్‌ చెప్పారు. అనంతరం పద్మశ్రీ వనజీవి రామయ్య మాట్లాడుతూ.. చెట్లు కన్న తల్లి లాంటివని, మొక్కలను నాటి సంరక్షిస్తే నీడ, పండు, గాలిని ఇస్తాయని చెప్పారు. సీడ్‌ బాల్స్‌తో మొక్కల పెంపకం అభినందనీయమన్నారు. అంతకుముందు గడ్డపోతారంలో నిర్మిస్తున్న వైకుంఠధామం, మోడ్రన్‌ చిల్డ్రన్‌ పార్కును కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, సర్పంచ్‌ శివరాజ్‌, ఎంపీటీసీ జానాబాయి, డీఎ్‌ఫవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ దశరథ, ఎంపీడీవో సుమతి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement