కష్టాల కడలిని దాటించేది ‘ప్లవ’

ABN , First Publish Date - 2021-04-14T06:35:15+05:30 IST

ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న కష్టాల కడలిని దాటిచేది ‘ప్లవ’ (నావ) నామ సంవత్సరం అని అప్పన్న ఆలయ ఇన్‌చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు పేర్కొన్నారు.

కష్టాల కడలిని దాటించేది ‘ప్లవ’
పంచాంగ శ్రవణం చేస్తున్న గోపాలకృష్ణమాచార్యులు

అప్పన్నకు ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ 

ఆలయ ఇన్‌చార్జి ప్రధానార్చకుడు గోపాలకృష్ణమాచార్యులు

సింహాచలం, ఏప్రిల్‌ 13: ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న కష్టాల కడలిని దాటిచేది ‘ప్లవ’ (నావ) నామ సంవత్సరం అని అప్పన్న ఆలయ ఇన్‌చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు పేర్కొన్నారు. నూతన తెలుగు సంవత్సరాది ఉగాదిను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం ఆలయ ఆస్థాన మండపంలో ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని అధిష్టింపజేసి షోడశోపచారాలు సమర్పించారు. అనంతరం ప్లవనామ సంవత్సర పంచాంగ శ్రవణం గావించారు. పంచాంగం ప్రకారం సింహాద్రినాథునికి ఆదాయం-2, వ్యయం-8, రాజ్యపూజ్యం-1, అవమానం-5గా పేర్కొన్నారు. గ్రహ గతుల ప్రకారం ఈ ఏడాది అంతా శుభ కాలమని, అంతేకాకుండా అనుకోని విధంగా ధన లాభం, సంపద కలిసి వస్తుందన్నారు. ఇక సాధారణ ప్రజల గ్రహ గతులను పరిశీలించగా రాజు, సైన్యాధిపతి, అర్ఘాధిపతి ముగ్గురూ కుజుడు కావడం వల్ల చోర, అగ్ని భయం వెంటాడుతుందన్నారు. ఎనలేని భయం, రాజకీయ కల్లోలాలు సంభవిస్తాయని, దేశ, రాష్ట్రంలో ప్రధాన వ్యక్తులకు వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. ఆకలి బాధలు, ప్రజాక్షోభం, దుర్మార్గులు ప్రబలుట, ప్రాణ హాని ఉంటుందని వెల్లడించారు. వర్షపాతం సామాన్యంగా ఉండడంతో పాటు అల్పవృష్టి, ఉరుములు, మెరుపులు, పిడగులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. తద్వారా పాడిపంటలు తగ్గడం, పశు నష్టం వాటిల్లుతుందన్నారు. మొత్తంమీద శుభాశుభాల మిశ్రమాలతో ఈ ప్లవ నామ సంవత్సరం గడుస్తుందని వివరించారు. 

Updated Date - 2021-04-14T06:35:15+05:30 IST