Abn logo
Oct 23 2021 @ 08:28AM

గాయని చిత్రకు UAE లో అరుదైన గౌరవం..!

దుబాయ్: ప్రముఖ గాయని కేఎస్ చిత్రకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు యూఏఈ సర్కార్ గోల్డెన్ వీసా మంజూరు చేసింది. పదేళ్ల కాలపరిమితితో చిత్రకు యూఏఈ ఈ లాంగ్‌టర్మ్ రెసిడెన్సీ వీసాను జారీ చేసింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మర్రీ చేతుల మీదుగా దుబాయ్‌లో చిత్ర ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ అరుదైన గౌరవం పట్ల గాయని చిత్ర తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టారు. జీడీఆర్ఎఫ్ఏ డైరెక్టర్ జనరల్ నుండి గోల్డెన్ వీసా అందుకున్నందుకు సంతోషంగా, గౌరవంగా, విశేషంగా భావిస్తున్నట్లు చిత్ర ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక భారతీయ సినీ రంగంలో ఆమె ఎన్నో మైలురాలు దాటారు. ఇప్పటి వరకు వివిధ భాషల్లో 25వేలకు పైగా పాటలు పాడారామె. ఆరసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు.

ఇదిలాఉంటే.. భారత్ నుంచి ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు యూఏఈ ఇచ్చే ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. వీరిలో బాలీవుడ్‌కు చెందిన షారూక్ ఖాన్, సంజయ్‌దత్, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ ఉంది. అలాగే మలయాళం నుంచి మోహన్‌లాల్, మమ్ముటీ, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. వీరితో పాటు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా గోల్డెన్ వీసా అందుకున్నారు.  

తాజా వార్తలుమరిన్ని...