రెండంచెల్లో ఐపీఎల్‌?

ABN , First Publish Date - 2020-08-28T09:11:29+05:30 IST

కరోనా కారణంగా భారత్‌ నుంచి యూఏఈకి తరలిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను రెండంచెల్లో జరపాలని బీసీసీఐ భావిస్తోంది..

రెండంచెల్లో ఐపీఎల్‌?

ప్లే-ఆఫ్స్‌ అబుదాబి, దుబాయ్‌లలో

బీసీసీఐ సమాలోచన


న్యూఢిల్లీ: కరోనా కారణంగా భారత్‌ నుంచి యూఏఈకి తరలిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను రెండంచెల్లో జరపాలని బీసీసీఐ భావిస్తోంది. ఎందుకంటే అక్కడ ఈ వైరస్‌ ప్రభావం తక్కువగానే ఉన్నప్పటికీ స్థానిక నిబంధనలను అనుసరిస్తూ లీగ్‌ను జరపడం సులువుగా కనిపించడం లేదు. అందుకే ఇప్పటి వరకు షెడ్యూల్‌ను కూడా విడుదల చేయని పరిస్థితి నెలకొంది. యూఏఈలోని దుబాయ్‌, షార్జా, అబుదాబి నగరాల మధ్య మ్యాచ్‌ల కోసం ప్రయాణం చేయాల్సి రావడంతో బోర్డు ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ మూడు నగరాలకు కొవిడ్‌ నిబంధనలు ప్రత్యేకంగా ఉండడమే దీనికి కారణం. ఉదాహరణకు ఎవరైనా అబుదాబిలో అడుగుపెట్టాలంటే అతడు కచ్చితంగా ర్యాపిడ్‌ టెస్టులో పాల్గొనాల్సిందే. నెగెటివ్‌ ఫలితం వస్తేనే సరిహద్దు దాటేందుకు వీలుంటుంది. ఇలాంటి కఠిన నిబంధనలతో మ్యాచ్‌ల సందర్భంగా ఇబ్బంది ఎదురుకానుంది. 

తొలి అంచె దుబాయ్‌, షార్జాలో..

అబుదాబితో పోలిస్తే దుబాయ్‌, షార్జాల విషయంలో చక్కటి వెసులుబాటు ఉంటోంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి ఆంక్షలు లేవు. ఆటగాళ్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. అందుకే ఈ లీగ్‌ను బోర్డు రెండంచెల్లో జరపాలని అనుకుంటోంది. తొలి అంచెను దుబాయ్‌, షార్జాల్లో నిర్వహించి ఆ తర్వాత అబుదాబికి మారిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో బోర్డు ఉంది. ఇక ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లను దుబాయ్‌, అబుదాబిలో.. నవంబరు 10న జరిగే ఫైనల్‌ను దుబాయ్‌లో నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే సంబంధిత విషయాలపై ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డుతో చర్చలు జరుగుతున్నాయి. లీగ్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌, బోర్డు తాత్కాలిక సీఈవో హేమంగ్‌ అమిన్‌ యూఏఈ ప్రభుత్వ అధికారులను కలిశాక తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. తమ జట్ల కోసం నిబంధనలను సడలించాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. మొత్తం 56 మ్యాచ్‌ల్లో దుబాయ్‌లో 21, అబుదాబిలో 21, షార్జాలో 14 జరిగే అవకాశాలున్నాయి.

కేకేఆర్‌, ముంబైలకు క్వారంటైన్‌ తిప్పలు

యూఏఈకి చేరిన 8 జట్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ముంబై ఇండియన్స్‌ మాత్రమే అబుదాబిలో ఉంటున్నాయి. అయితే ఇక్కడి కఠిన నిబంధనల కారణంగా ఆటగాళ్లు 14 రోజులపాటు క్వారంటైన్‌లో గడపాల్సి వస్తోంది. అదే దుబాయ్‌లో అయితే 7 రోజులే. దీంతో ఈ రెండు జట్లు ప్రాక్టీస్‌ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు లీగ్‌ను రెండంచెల్లో జరపడం ఖాయమైతే ముంబై, కోల్‌కతా జట్లు తమ స్థావరాన్ని దుబాయ్‌కు మార్చాల్సి ఉంటుంది.

Updated Date - 2020-08-28T09:11:29+05:30 IST