18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సీన్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిల్

ABN , First Publish Date - 2021-04-16T20:44:32+05:30 IST

18 సంవత్సరాలు నిండిన అందరికీ కొవిడ్-19 వ్యాక్సీన్ ఇవ్వాలంటూ ఇవాళ సుప్రీంకోర్టులో ప్రజా ప్రాయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది...

18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సీన్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిల్

న్యూఢిల్లీ: 18 సంవత్సరాలు నిండిన అందరికీ కొవిడ్-19 వ్యాక్సీన్ ఇవ్వాలంటూ ఇవాళ సుప్రీంకోర్టులో ప్రజా ప్రాయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగినందున ఇది అత్యవసరమని న్యాయవాది రష్మీ సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రత్యేకించి యువకులు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న అందరికీ విస్తృతంగా వ్యాక్సీనేషన్ అందించాలనీ.. తద్వారా సెకండ్‌ వేవ్‌లో కరోనా కేసులు ప్రబలకుండా నిలువరించవచ్చునని ధర్మాసనానికి పిటిషనర్ నివేదించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో రెండు డోసులకు మధ్య ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతోందనీ... ఇలాంటి పరిస్థితుల్లో 18 ఏళ్ల వారికి వ్యాక్సీన్ అందే సమయానికి కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరిగేందుకు అవకాశం ఉందని పిటిషన్ పేర్కొంది.


18 నుంచి 45 ఏళ్ల లోపు వారికి వ్యాక్సీన్ ఇవ్వకుండా తిరస్కరించడం నిరంకుశ, వివక్షపూరితమని పిటిషనర్ పేర్కొన్నారు. వ్యాక్సీన్ తిరస్కరించడం జీవించే హక్కు, ఆరోగ్య హక్కులను తిరస్కరించడమేనని ధర్మాసనానికి  నివేదించారు. కొవిడ్-19 వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సహా పలువురు నిపుణులు డిమాండ్ చేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. భారత్‌లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలంటే రోజుకు 10 మిలియన్ల డోసులు వేయాలని నిపుణులు చెప్పినట్టు పిటిషన్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సీనేషన్‌కు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-04-16T20:44:32+05:30 IST