దయచేసి ఆస్పత్రిలో చేర్చుకోండి.. ప్రాణాలు కాపాడండి

ABN , First Publish Date - 2021-05-08T09:10:24+05:30 IST

దయచేసి ఆస్పత్రిలో చేర్చుకోండి, ప్రాణాలు కాపాడండి అంటూ హైదరాబాద్‌లోని గాంధీ, కింగ్‌ కోఠి ఆస్పత్రుల ముందు వైద్య సిబ్బందిని రోగులు, వారి బంధువులు వేడుకుంటున్నారు.

దయచేసి ఆస్పత్రిలో చేర్చుకోండి.. ప్రాణాలు కాపాడండి

  • బెడ్ల కోసం ఆస్పత్రుల ముందు కరోనా రోగుల ఆవేదన
  • ఒకే అంబులెన్స్‌లో ఒకే ఆక్సిజన్‌ సిలిండర్‌తో గాంధీకి ముగ్గురు కొవిడ్‌ రోగులు.. వచ్చేలోపు ఒకరి మృతి
  • మిగతా ఇద్దరినీ గాంధీలో చేర్చుకోలేదు
  • కింగ్‌కోఠి వె ళ్లాలని వైద్య సిబ్బంది సూచన
  • అక్కడికి వెళ్తే ప్రైవేటుకు వెళ్లాలని సలహా
  • తిరిగి నాచారం వెళ్లిపోయిన రోగులు
  • రోజూ 20 బెడ్లు ఖాళీగా ఉంటున్నట్లు..
  • లెక్కల్లో చూపుతున్న కింగ్‌కోఠి వైద్యులు
  • పరిస్థితులు మాత్రం భిన్నం
  • పదుల్లో వెనుదిరుగుతోన్న రోగులు 


మంగళ్‌హాట్‌, మే 7(ఆంధ్రజ్యోతి): దయచేసి ఆస్పత్రిలో చేర్చుకోండి, ప్రాణాలు కాపాడండి అంటూ హైదరాబాద్‌లోని గాంధీ, కింగ్‌ కోఠి ఆస్పత్రుల ముందు వైద్య సిబ్బందిని రోగులు, వారి బంధువులు వేడుకుంటున్నారు. బెడ్ల కోసం తిరుగుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. గాంధీలో బెడ్లు లేవని కొందరు రోగులను అక్కడి నుంచి కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలిస్తున్నారు. కింగ్‌కోఠి ఆస్పత్రికి వెళ్లినప్పటికీ అక్కడా బెడ్లు ఖాళీ లేవని వైద్య సిబ్బంది అంటున్నారు. ప్రాణాలతో పోరాడుతూ కొందరు రోగులు ఆ ఆస్పత్రి ముందే అంబులెన్స్‌, స్ట్రెచర్లపై కనపడుతున్నారు. ప్రతి రోజు 20 బెడ్లు ఖాళీగా ఉన్నట్లు కింగ్‌కోఠి వైద్యులు లెక్కల్లో చూపుతున్నారు. కానీ, వాస్తవంగా ఆస్పత్రిలో ఉన్న 350 బెడ్లు నిండిపోయినట్లు సమాచారం. దీంతో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే.. ఒకరు చనిపోతే తప్ప మరొకరికి బెడ్‌ దొరికే పరిస్థితి లేదని రోగుల బంధువులు అంటున్నారు. గాంధీ, కింగ్‌ కోఠి ఆస్పత్రుల వద్ద  శుక్రవారం దారుణ పరిస్థితులు కనపడ్డాయి.


 ఒక అంబులెన్స్‌లో ముగ్గురు రోగులు ఒకే ఆక్సిజన్‌ సిలిండర్‌తో ప్రాణాల కోసం పోరాడుతూ అటు గాంధీ, ఇటు కింగ్‌కోఠి ఆస్పత్రిలో వెంటిలేటర్‌ బెడ్ల కోసం ప్రయత్నించారు. నాచారం ఈఎ్‌సఐ ఆస్పత్రి నుంచి లక్ష్మణ్‌(48), మల్లికతో పాటు మరో కరోనా రోగిని అక్కడి వైద్యులు ఆ అంబులెన్స్‌లో శుక్రవారం ఉదయం 10 గంటలకు గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఆంబులెన్స్‌ తార్నాకకు చేరుకునేలోపే పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందారు. మిగిలిన ఇద్దరికి గాంధీలో బెడ్లు లేవని కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రికి పంపించారు. కింగ్‌కోఠి ఆస్పత్రికి ఉదయం 11.30 చేరుకున్న అంబులెన్స్‌లో లక్ష్మణ్‌ ఆక్సిజన్‌ పెట్టుకుని ఆయాసపడుతుండగా, మల్లిక తీవ్ర అస్వస్థతతో వైద్యుల రాకకోసం ఎదురుచూసింది. ఈ ఇద్దరు రోగుల బంధువులు వెంటిలేటర్‌ బెడ్ల కోసం కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి అధికారులను అడగగా బెడ్లు లేవని ప్రైవేట్‌లో ప్రయత్నించుకోండని సలహా ఇచ్చారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ ప్రయత్నాలు సాగించారు. అక్కడా బెడ్లు దొరకలేదు. దీంతో అదే అంబులెన్స్‌లో అక్కడి నుంచి తిరిగి నాచారం ఈఎ్‌సఐ ఆస్పత్రికి పయనమయ్యారు. ఇలాంటి ఘటనలు ఒకటి కాదు రెండు కాదు చాలా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య కింగ్‌కోఠి ఆస్పత్రిలో పదుల సంఖ్యలో కొవిడ్‌ రోగులను ఆస్పత్రికి తీసుకువచ్చి ఎలాంటి ఫలితం లేకపోవడంతో రోగులతో కలిసి వారి బంధువులు వెనుదిరిగారు.


గంట నుంచి వేచి ఉన్నా బెడ్లు దొరకలేదు  

గత నెల 28న మా అమ్మ(మల్లిక)ను నాచారం ఈఎ్‌సఐ ఆస్పత్రిలో చేర్పించాం. నిన్న రాత్రి నుంచి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అమ్మతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మణ్‌ అనే రోగిని, మరో రోగిని ఒకే అంబులెన్స్‌లో ఒక ఆక్సిజన్‌ సిలిండర్‌ను ఒకరికి మాత్రమే అమర్చి గాంధీకి పంపించారు. మార్గమధ్యంలోనే ఒకరు మృతి చెందడంతో ఇద్దరిని గాంధీకి తరలించారు. అక్కడ బె డ్లు లేకపోవడంతో కింగ్‌కోఠికి పంపించారు. గంట నుంచి వేచి ఉన్నా బెడ్లు దొరక లేదు.  

 రాము(మల్లిక కుమారుడు)


సీఎం సారేమో బెడ్లు ఉన్నాయంటున్నారు  

బెడ్ల కోసం ప్రయత్నించాం. గాంధీలో లేవని కింగ్‌కోఠికి పంపించారు. ఇక్కడా బెడ్లు లేవని ప్రైవేట్‌లో ప్రయత్నించుకోండి అని ఉచిత సలహా ఇస్తున్నారు. సీఎం సారేమో బెడ్లు ఉన్నాయి అని టీవీల్లో చెబుతున్నారు. ఇక్కడేమో వైద్య సిబ్బంది తిరిగి వెళ్లిపోమంటున్నారు. 

రమాదేవి(కొవిడ్‌ రోగి బంధువు)

Updated Date - 2021-05-08T09:10:24+05:30 IST