Please.. ఈ మెసేజ్‌ ఫార్వార్డ్‌ చేయొద్దు

ABN , First Publish Date - 2021-08-03T17:01:39+05:30 IST

Please.. ఈ మెసేజ్‌ ఫార్వార్డ్‌ చేయొద్దు...

Please.. ఈ మెసేజ్‌ ఫార్వార్డ్‌ చేయొద్దు

  • ఖాతాలు కొల్లగొడుతున్న సైబర్‌ నేరగాళ్లు
  • కొత్త దారుల్లో ఆర్థిక నేరాలు
  • నిరుద్యోగులను ఆకట్టుకునేలా మెస్సేజ్‌లు 
  • పూర్వాపరాలు పరిశీలించకుండా ఫార్వార్డ్‌ చేస్తున్న పలువురు 
  • తెలియకుండానే సైబర్‌ నేరగాళ్లకు సాయం

హైదరాబాద్‌ సిటీ : ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో ఖాళీలు, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు.. వంటి సందేశాలు కనిపించగానే, ఎవరికైనా ఉపయోగపడుతుందని చాలా మంది ఫార్వార్డ్‌ చేస్తుంటారు. దాన్నే సైబర్‌ నేరగాళ్లు తమకు అవకాశంగా మలుచుకుంటున్నారు. కొత్త దారుల్లో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. విదేశాల్లో ఉద్యోగం, మంచి జీతం అంటూ సందేశాలు పంపుతున్నారు. అర్హులైన వారికి సమాచారం చేరవేయండంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. వాటికి స్పందించి సమాచారాన్ని పరిచయస్తులకు, ఫ్రెండ్స్‌ గ్రూప్స్‌లో పంపేవారు పరోక్షంగా సైబర్‌ నేరగాళ్లకు సహకరించిన వాళ్లవుతున్నారు. ఉద్యోగ సమాచారం పంపిన వ్యక్తి పరిచయస్తుడే కావడంతో దానిపై ఆశ ఉన్న నిరుద్యోగులు ముందు, వెనుక చూడకుండా సైబర్‌ నేరగాళ్లను సంప్రదించి వారి వలలో పడుతున్నారు. వారి మాటలు నమ్మి డబ్బు పోగొట్టుకుంటున్నారు.


దుబాయ్‌లో నర్సు ఉద్యోగం పేరుతో...

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ ఉద్యోగ సమాచారం చక్కర్లు కొడుతోంది. ‘దుబాయ్‌ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసేందుకు బీఎస్సీ నర్సింగ్‌ అర్హత ఉన్నవారు అత్యవసరంగా కావాలి. భోజనం, వసతితో పాటు మంచి జీతం. 300 ఖాళీలు. ఇప్పటికే 50 దరఖాస్తులు వచ్చాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనేక ధ్రువపత్రాలతో సంప్రదించండి’ అంటూ మొయిల్‌ ఐడీ (sakuwa777@gmail.com) జత చేసిన సందేశం సోషల్‌ మీడియా వేదికల్లో కనిపిస్తోంది. ఆసక్తి ఉన్న వారు సూచించిన లింక్‌ (http://meedconsultants.com/vacancy) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, విద్యార్హత పత్రాలు, ధ్రువ పత్రాలతోపాటు పాస్‌పోర్ట్‌ ఫొటో స్కాన్‌ కాపీని కూడా పంపాలని సందేశంలో ఉంది. ఈ సందేశాన్ని చూసిన కొంతమంది ఎవరికైనా ఉపయోగ పడుతుందని వేరే గ్రూపుల్లో ఫార్వార్డ్‌ చేస్తున్నారు. ఇలా వేలాది మందికి ఈ సందేశం చేరింది. దీంతో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగం కోసం సంప్రదించారు. పదుల సంఖ్యలో బాధితులు సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. ఇది సైబర్‌ నేరగాళ్ల వల అని, ఎవరూ ఈ సందేశాన్ని ఫార్వార్డ్‌ చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.


నమ్మకంగా ముంచేస్తూ..

ఉద్యోగం కావాలంటూ సంప్రదించిన వారితో సైబర్‌ నేరగాళ్లు నమ్మకంగా మాట్లాడతారు. మొదట్లో డబ్బుల ప్రస్తావన తీసుకురారు. ఉద్యోగానికి సంబంధించిన వివరాలు, జీతం, భోజనం, వసతి వంటి వివరాలు చెబుతారు. అనంతరం రెజ్యూమ్‌ పంపమని కోరతారు. ఆ తర్వాత కాల్‌ చేసి, బంగారం లాంటి అవకాశం కోల్పోవద్దని సూచిస్తారు. అనంతరం కంపెనీ రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలని చెబుతారు. ఆ తర్వాత ప్రాసెసింగ్‌ ఫీజు, అసెస్‌మెంట్‌ ఫీజు, వీసా ఫీజు, ఇంటర్వూ కోసమంటూ పదే పదే డబ్బులు డిమాండ్‌ చేస్తూనే ఉంటారు. లేకపోతే ఉద్యోగం రాదంటూ బెదిరింపులకు దిగుతారు. ఉద్యోగం పోతుందనే బాధతో పలువురు వారు చెప్పిన ఖాతాల్లో డబ్బులు వేసి మోసపోతున్నారు. అంతేకాకుండా, ఉద్యోగం కోసం పంపిన ఆధార్‌, పాన్‌, పాస్‌పోర్ట్‌, ఫొటోలు, విద్యార్హత పత్రాలు వంటివి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో వచ్చే సందేశాలను పరిశీలించకుండా ఫార్వార్డ్‌ చేసి మోసగాళ్లకు సహకరించవద్దని కోరుతున్నారు.

Updated Date - 2021-08-03T17:01:39+05:30 IST