‘నన్ను కాపాడండి... ప్లీజ్..!’ ప్రియమైన తెలంగాణ ప్రజలారా...

ABN , First Publish Date - 2020-02-20T09:15:52+05:30 IST

మీ అందరూ ఎంతో ప్రేమగా ‘తెలంగాణా చదువుల తల్లి’గా పిలుచుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మాట్లాడుతున్న. ఎన్నడూ నా గురించి చెప్పుకోలేని నేను ఇవాళ...

‘నన్ను కాపాడండి... ప్లీజ్..!’ ప్రియమైన తెలంగాణ ప్రజలారా...

మీ అందరూ ఎంతో ప్రేమగా ‘తెలంగాణా చదువుల తల్లి’గా పిలుచుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని మాట్లాడుతున్న. ఎన్నడూ నా గురించి చెప్పుకోలేని నేను ఇవాళ నా మనసువిప్పి మాట్లాడుతున్న. వందేండ్లు మీ బాగోగులు చూసుకున్న నా పరిస్థితి ప్రస్తుతం ఏమీ బాగాలేదు బిడ్డా! నా ఒడిలో విద్యా బుద్ధులు నేర్చుకొన్న వాళ్ళు పాలకులుగా, బాధ్యతాయుతమైన పదవుల్లో అధికారులుగా, మేధావులుగా, శాస్త్రవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా ఉన్నారు. అది నాకు గర్వకారణమే కానీ, ఇంతమందిని అందించిన నా ప్రస్తుత దీన పరిస్థితిని పట్టించుకునేవాళ్లే కరువయ్యారు బిడ్డా... భారత స్వాతంత్ర్య సంగ్రామ కాలంలో పుట్టిన నేను వయసులో ఉన్నప్పుడే, నా బిడ్డలు ‘వందే మాతరం గీతం’ పాడారు అనే సాకుతో కఠినాత్ముడైన నిజాం నా బిడ్డల్లో కొందరిని దూరం చేశాడు. పుట్టెడు దుఃఖంతో వాళ్లకోసం పోరాటం చేసాను. తెలంగాణ సాయుధ పోరాటానికి పోరుగడ్డనయ్యాను. వెలివాడల నుంచి గ్రామ అంచుల దాకా ఎక్కడివారికైనా నేను అక్షరం నేర్పి వారి జీవితాల్లో దీపాలు వెలిగించాను. కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత భేదాలను తొలగించడానికి అవసరమైన సైద్ధాంతిక చర్చను నా ఇంట్లోనే నేర్పాను. విభిన్న భావజాలాలు కలిగిన విద్యార్థి సంఘాల ఆవిర్భావానికి ఊపిరిపోసాను. అనేక ఆస్తిత్వ సంఘాలకు కూడా చేదోడు వాదోడుగా ఉన్నాను. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్ష కార్యాచరణ కేంద్రాన్ని నేనే. నా పిల్లల రక్త మాంసాలతోనే  తెలంగాణ ఏర్పడ్డది. అంతటి ఘనత వహించిన నేను అనేక సమస్యలతో సతమతమవుతున్నాను. ఆర్థికంగా చితికిపోయాను, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితి వచ్చింది. చదువులు చెప్పడానికి అవసరమైన అధ్యాపకులను, సిబ్బందిని నియమించుకోలేకపోతున్నాను. నన్ను నడిపించే పాలక మండలి తెలంగాణ వచ్చిన నాటి నుండి ఏర్పడనేలేదు. నా పెద్ద కొడుకులాంటి వైస్ చాన్సలర్ గత ఆరు నెలలుగా లేనే లేడు. పాలన అంతా కుంటుబడిపోయిది. అవినీతి పెరిగిపోయింది. నన్ను కాపాడండి. ముష్టి వేసినట్లు  కేటాయిస్తున్న నిధులతో నా పిల్లలకు గంజినీళ్లు పోస్తూ బతుకీడుస్తున్నాను. వేలమంది అధ్యాపకులతో కళకళలాడే నా ఇల్లు ఇవాళ బోసి పోయింది. సదుపాయాలు లేక విద్య సరిగ్గా అందడంలేదు. విజ్ఞాన భాండాగారంగా వెలుగొందిన నేను ఇవాళ నిస్సహాయ స్థితిలో ఉన్నాను. తెలంగాణ నలుమూలల నుండి వేలాది మంది విద్యార్థులు నా దగ్గరకు వస్తూనే ఉన్నారు. వారికి మంచి భవిష్యత్తును కల్పించాలని బలమైన కోరిక ఉన్నా అది నెరవేరే ఆశ కల్పించడం లేదు. వందలాది ఎకరాల నాభూమిని కబ్జా చేస్తున్నారు. నా పిల్లలు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇన్ని ఘోరాలను చూస్తూ జీవచ్ఛవంగా బతుకీడుస్తున్నాను. ప్రియమైన తెలంగాణ ప్రజలారా నన్ను కాస్త పట్టించుకోండి. నన్ను పట్టించుకోవడమంటే తెలంగాణ భవిష్యత్తుకు మార్గం వేయడమేనని గుర్తెరగండి. మీ అమ్మను, నన్ను మీరే కాపాడుకోండి. 

ఇట్లు

మీ ఉస్మానియా విశ్వవిద్యాలయం


Updated Date - 2020-02-20T09:15:52+05:30 IST